Happy Birthaday Megastar Chiranjeevi
పద్మవిభూషణ్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
ఒక్కడిగా వచ్చి, ఒక్కటి నుంచి మొదలు పెట్టి, ఒక్కటో స్థానంలో రెండు దశాబ్ధాలుగా నిలబడ్డ వెండి తెర ఇలవేల్పు మెగాస్టార్ డా. పద్మవిభూషణ్ చిరంజీవి. హిమాలయాలను తలదన్నే వ్యక్తిత్వం ఆయన సొంతం. కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని కీర్తి సంతకం ఆయన నింపిన స్పూర్తి. అభిమానులు ప్రేమగా అన్నయ్య అని పిలుచుకునే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు ప్రేక్షకుడు ఘనమైన శుభాకాంక్షలతో నెట్టింట్లో సంబరాలు చేసుకుంటున్నారు.
నాలుగు దశాబ్దాలుగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న మెగాస్టార్ ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్‌రౌండ్ లేకుండా సినిమా శిఖరాగ్రాన చేరిన ఆయన ప్రయాణం ఒక పాఠ్యపుస్తకం. హీరో, డేరింగ్ అండ్ డాషింగ్, సుప్రీంస్టార్ నుంచి మెగాస్టార్ వరకు ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కాదు. ప్రాణం ఖరీదు ఆయన మొదట విడుదలైన సినిమా కానీ, దానికి ముందే పూనాదిరాళ్లు చిత్రంలో నటించారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలపై ఇంట్రెస్ట్ పెంచుకొని డిగ్రీ పూర్తి చేసుకొని 1976 చెన్నై వెళ్లారు. అక్కడే యాక్టింగ్ స్కూల్‌లో శిక్షన పూర్తి అవకముందే పునాదిరాళ్ల చిత్రంలో అవకాశం వచ్చింది. అప్పటి వరకు శివశంకర వరప్రసాద్‌గా ఉన్న ఆయన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు.
బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవుల చిత్రంతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయనకు ఉన్న స్పెషల్ ట్యాలెంట్స్ అయిన డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను మాత్రమే కాదు ఇండస్ట్రీ వ్యక్తులను సైతం అబ్బుర పరిచారు. అప్పటి వరకు ఉన్న డ్యాన్స్‌లు మారిపోయాయి. బ్రేక్ డ్యాన్స్ అనే కొత్త రీతిని టాలీవుడ్‌లోకి తీసుకొచ్చారు. నటనలో కూడా తనదైన స్టైల్ చూపించారు. మాస్ యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు ప్రయోగాలు చేశారు. విలన్‌గా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. అలా 1983లో ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ మారింది. ఆయన సినిమా ప్రయాణంలో బిఫోర్ ఖైదీ ఆఫ్టర్ ఖైదీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత కూడా కేవలం కమర్షల్ చిత్రాలు కాకుండా స్వయం కృషి, రుద్రవీణ లాంటి ప్రయోగాలు చేశారు.
హనుమంతుడి భక్తుడైన చిరంజీవి శివుడి పాత్ర వేస్తే దేవుడే దిగివచ్చాడేమో అనే భ్రమ కలుగుతుంది చూసేవారిలో. ఇక చంటబ్బాయి చిత్రంలో ఆయన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆయన నటించిన కామెడీ చిత్రాలలో అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలు టాప్‌లో ఉంటాయి. ఇక యాక్షన్ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేట, రాక్షసుడు నుంచి ఇంద్ర, స్టాలీన్ మొదలుకొని మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో చిత్రాలు ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఎనిమిది ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్న హీరో మెగాస్టార్. ఖైదీ చిత్రం ఆయన తొలి ఇండస్ట్రీ హిట్ ఆ తరువాత వరుసగా పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర.
సినిమా రంగంలోనే కాదు సేవారంగంలో కూడా ఆయనే మెగాస్టార్. రక్తం అందక ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోవద్దనే సంకల్పంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. ఆ తరువాత చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నేత్రదానం కోసం ఐ బ్యాంక్ స్థాపించారు. ఇక కోవిడ్ సమయంలో ఆక్సీజన్ అందక ఇబ్బంది పడుతున్న రోగులను చూసీ చలించి ఆక్సీజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇలా ఎంతో మందికి అండగా నిలుచున్నారు. కొన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. ఆ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. 2017 లో ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కాబోతుంది. తరువాత ఆయన కూతురు సుస్మిత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్‌మెంట్స్‌లోని ఓ చిత్రంలో నటించబోతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఓ చరిత్ర. ఆయన నీడన ఎదిగిన ఎంతో మంది నటులు ఇండస్ట్రీలో టాప్ పోజిషన్‌లో ఉన్నారు. అంతే కాదు ఆయన ఇంటి నుంచే స్టార్ నటులు ఉన్నారు. ఒక్క స్టార్ హీరో సినిమా చేస్తే దాదాపు వెయ్యి మందికి ఉపాది లభిస్తుంది. అలా మెగా కుటుంబం మొత్తం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఎంప్లయిమెంట్ కల్పిస్తున్నారు. ఇప్పటికీ కుటుంబసభ్యలు మొత్తం మెగాస్టార్ చూపిన సేవామార్గంలోనే నడుస్తున్నారు. ఒక వ్యక్తి ఎదిగి ఇంతమంది ఎదుగుదలకు చేయూతనిస్తూ, కోట్లాది అభిమానులకు స్పూర్తిగా నిలిచిన మెగాస్టార్ డా. పద్మవిభూషణ్ చిరంజీవికి బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.