Reading Time: 2 mins

Heroine Ishwarya Sharma Interview

 

హీరోయిన్ ఐశ్వర్య శర్మ ఇంటర్వ్యూ

“డ్రింకర్ సాయి”లో చేసిన క్యారెక్టర్ కు అందరూ కనెక్ట్ అవుతారు – హీరోయిన్ ఐశ్వర్య శర్మ

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “డ్రింకర్ సాయి” సినిమా హైలైట్స్ హీరోయిన్ ఐశ్వర్య శర్మ తెలిపారు.

-“డ్రింకర్ సాయి” సినిమాలో నా క్యారెక్టర్ పేరు బాగీ. ఈ కథ విన్నప్పుడు నాది చాలా బలమైన క్యారెక్టర్ అనిపించింది. ఈ క్యారెక్టర్ ను జెన్యూన్ గా ప్రెజెంట్ చేయాలని బాధ్యతగా ఫీలయ్యాను. నటిగా నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని సీన్స్ ఇస్తే చేసి చూపించాను. అందులో పర్ ఫార్మెన్స్ నచ్చి ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. బాగీ క్యారెక్టర్ కు మీరు బాగా కనెక్ట్ అవుతారు.

– మా నాన్న స్టేజ్ యాక్టర్. నాపైనా ఆ ప్రభావం తెలియకుండానే పడింది. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. డ్యాన్సర్, సింగర్ కావాలనేది నా కోరిక. ఈ ఫీల్డ్ లోకి రాకుంటే ఫలానా జాబ్ చేయాలనే ఆప్షన్ కూడా పెట్టుకోలేదు. 12 క్లాస్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ కోర్సు పూర్తయ్యాక ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. గతంలో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లలో నటించలేదు. కొన్ని యాడ్స్ లో నటించాను. “డ్రింకర్ సాయి”తో హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నా.

– తెలుగమ్మాయిని కాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పేప్పుడు ఇబ్బందిగా ఉండేది. నేను ఏ డైలాగ్ చెబుతున్నాను అనేది అర్థమయ్యేది కాదు. ఈ సినిమా చేసేప్పుడు భాష ఒక్కటే నేను ఎదుర్కొన్న సమస్య. అది తప్ప సెట్ లో నటిస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను.

-హీరో ధర్మతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పర్సనల్ గా చాలా మంచివాడు. “డ్రింకర్ సాయి” క్యారెక్టర్ కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం అతనిది. డైలాగ్స్ చెప్పడంలో నాకు సపోర్టివ్ గా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయి పాత్రలో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు.

– ప్రేమతో మనకు విడదీయరానికి అనుబంధం ఉంటుంది. మన జీవితంలోని ప్రతి దశలో, ప్రతి సందర్భంలో ప్రేమను అనుభూతి చెందుతాం. “డ్రింకర్ సాయి”లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంతో కొన్ని మంచి విషయాలు కూడా చెబుతున్నాం. అవి ఇప్పుడు రివీల్ చేస్తే స్క్రీన్ మీద ఎంజాయ్ చేయలేరు.

– బాగీ క్యారెక్టర్ లో ఇన్నోసెంట్ గా కనిపిస్తాను. అలాగే రఫ్ అండ్ టఫ్ గా, స్ట్రిక్ట్ గా ఉంటాను. ఇందులో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తాను. నా క్యారెక్టర్ లో ఫన్ కూడా ఉంటుంది. ట్రైలర్, మిగతా కంటెంట్ చూశాక బాగీ క్యారెక్టర్ మీద మీకొక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అయితే సినిమా చూస్తే మీకు బాగి క్యారెక్టర్ పూర్తిగా అర్థమవుతుంది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కు భిన్నంగా నా క్యారెక్టర్ ఉంటుంది.

– మా చిత్రంలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని సాడ్ సాంగ్ వింటున్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ మంచి సాంగ్స్ చేశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో మా “డ్రింకర్ సాయి” సినిమాకు పోలిక లేదు. అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్. మా సాయి మాసీ డ్రింకర్.

– మా డైరెక్టర్ కిరణ్ ఫన్నీ పర్సన్. మా మీద ఎలాంటి ప్రెజర్ పెట్టలేదు. షూటింగ్ అంతా సరదాగా చేశాం. సెట్ లో నన్ను అక్క అని పిలిచేవారు. నేను ఆయనను అన్నా అని పిలిస్తే, లేదు నేను నీకు తమ్ముడిని , తమ్ముడు అని పిలువు అనేవారు. ఈ క్యారెక్టర్ లో నేను పర్ ఫార్మ్ చేయగలను అని బాగా నమ్మారు కిరణ్ గారు. ఎంతో సపోర్ట్ చేశారు.

– మా ఇంట్లో ఫ్యామిలీ అంతా సౌత్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మూవీస్ చాలా బాగుంటుంది. అర్థవంతమైన కథ, సహజంగా సినిమాలను రూపొందిస్తుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. ధనుష్ నా ఫేవరేట్ యాక్టర్. నేను ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూశాను.