Reading Time: 2 mins

History Of Telugu Cinema-4
తెలుగు సినిమా చరిత్ర 1938-1940 

1938లో మాలపిల్ల చిత్రం ఘనవిజయం సాధించడంతో 1939 లో ఐదు సాంఘిక చిత్రాలు విడుదలయ్యాయి. రైతుబిడ్డ, వందేమాతరం, మళ్ళీ పెళ్లి, అమ్మ, వరవిక్రయం. ఇదే సంవత్సరం బీఎన్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా వాహిని పిక్చర్స్ బ్యానర్ స్థాపించబడింది. ఈ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. అందులో వందేమాతరం, సుమంగళి, దేవత, స్వర్గసీమ, మల్లేశ్వరి మొదలైన చిత్రాలు ఉన్నాయి. వందేమాతరం పొలిటికల్ చిత్రంగా భావించే ప్రమాదం ఉందనీ, ముందుచూపుతో బ్రాకెట్లో సుమంగళి అనే టైటిల్ పెట్టి విడుదల చేశారు. ఈ చిత్రంలో నిరుద్యోగం, వరకట్న సమస్యల మీద చర్చించారు. అలాగే మళ్లీపెళ్లి చిత్రంపై కూడా భారీ వివాదం కొనసాగింది. వితంతు వివాహాలను ప్రోత్సహించే ఈ సినిమాలో బ్రాహ్మణుల కొన్ని ఆచారాలను నిలదీసేలా ఉన్నాయని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

మీర్జాపురం రాజా సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో 1938లో జయా ఫిలిమ్స్ ను స్థాపించి కృష్ణ జరాసంధ అనే చిత్రాన్ని నిర్మించారు. 1940లో రాజా గారు భోజ కాళిదాసు అనే చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా 1941లో దక్షయజ్ఞం, 1942లో భక్త ప్రహ్లాద, 1944లో భీష్మ వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన జీవిత కాలంలో అన్ని పౌరాణిక చిత్రాలనే ప్రేక్షకులకు అందించారు. అలాగే ప్రముఖ దర్శక నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య అందరికీ సీ పుల్లయ్య గా పరిచితులు. 1938లో మోహిని భస్మాసుర అనే చిత్రాన్ని రంప అడవుల్లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి సీ పుల్లయ్య దర్శకత్వం వహించారు. అలాగే 1939లో వరవిక్రయం, బాలనాగమ్మ, అపూర్వ సోదరులు, గొల్లభామ, సంక్రాంతి, పక్కింటి అమ్మాయి, దేవాంతకుడు తీశారు.

1940లో తెలుగు సినిమా కాస్త ఒడిదూకులకు లోనైంది. అప్పటికే ఉన్న నవీన భారత్ పిక్చర్స్, భవాని పిక్చర్స్, మోడరన్ సినీ టోన్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్ లో మూతపడ్డాయి. పౌరాణికలు తీస్తున్నప్పటికీ, సాంఘికలు ఎక్కువయ్యాయి. 1940లో మొత్తం 14 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరం బోధ కాళిదాసు పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే సంవత్సరం శ్రీశ్రీ రచించిన కాలచక్రం అనే చిత్రం తెరకెక్కించారు. 1940లో బారిష్టర్ పార్వతీశం, చదువుకున్న భార్య వంటి లఘు చిత్రాలు వచ్చాయి. ఇవి పూర్తిస్థాయిలో కామెడీ చిత్రాలుగా తెరకెక్కాయి. అంటే కామెడీ చిత్రాలలో ఫస్ట్ చిత్రాలు ఇవే అని చెప్పవచ్చు. విశ్వమోహిని అనే చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది. దర్శకుడికి ఒక సినిమా నటికీ మధ్య జరిగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.