History OF Telugu Cinema – 5
తెలుగు సినిమా చరిత్ర- 5
1941వ సంవత్సరంలో తెలుగు చిత్రాలు చాలా విడుదలైయ్యాయి. సినిమా అంటేనే కళా, వ్యాపారానికి సంబంధించిన ప్రక్రియ. ఈ ఏడాది కొత్త ప్రొడక్షన్ కంపెనీలు కూడా వచ్చాయి. అలా శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీని స్థాపించి తల్లి ప్రేమ అనే చిత్రాన్ని నిర్మించారు కడారు నాగభూషణం. ఈ చిత్రంలో ఆయన సతీమణి పసుపులేటి కన్నాంబ నటించారు. ఆ తరువాత కే.బీ నాగభూషణం చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. కన్నాంబ, నాగభూషణం ఇద్దరిది నాటకరంగం నుంచి వచ్చినవారే. ఆ పరిచయమే వీరి ప్రేమ ఆ తరువాత పెళ్లికి దారిసింది. ఆ తరువాత కూడా ఇద్దరు చిత్రరంగంలో రాణించారు. ఇదే సంవత్సరం ప్రతిభా పిక్చర్స్ ను స్థాపించి పార్వతీ కళ్యాణం అనే చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య నిర్మించారు. అలాగే బిఎన్ రెడ్డి దేవత చిత్రాన్ని ఇదే సంవత్సరం విడుదల చేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు ధర్మ పత్ని అనే చిత్రం ద్వారా ఇదే సంవత్సరం వెండితెరకు పరిచయమయ్యారు. అలాగే హెచ్ఎం రెడ్డి నిర్మించిన తెనాలి రామకృష్ణ చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది. ఈ చిత్రంలో ఎల్వీ ప్రసాద్ నటించారు.
1942 యుద్దం కారణంగా చిత్ర పరిశ్రమ కొంత గందరగోళానికి లోనయింది. జెమిని వారు తీసిన తొలి తెలుగు చిత్రం జీవన్ముక్తి ఈ సంవత్సరమే విడుదలైంది. ఇదే సంవత్సరం కె.వి.రెడ్డి దర్శకత్వంలో భక్త పోతన చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో అప్పటివరకు రొమాంటిక్, సాంఘిక చిత్రాలలో నటించిన నాగయ్య తొలిసారి భక్తి రస పాత్రను పోషించారు. ఆ తర్వాత భక్తి పాత్రలకే పరిమితం అయ్యారు. అలాగే గూడవల్లి రామబ్రహ్మం పత్ని సినిమాను తీశారు. ఇక శ్రీ రాజరాజేశ్వరి బ్యానర్ పై సుమతి చిత్రం విడుదలైంది. జెమిని వారు నిర్మించిన బాలనాగమ్మ చిత్రానికి పోటీగా శాంత బాలనాగమ్మ చిత్రాన్ని శాంత వసుంధర ప్రొడక్షన్స్ నిర్మించింది. అలాగే వైవి రావు నిర్మించి దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ సంవత్సరం విడుదలైంది. ఇక ఇదే సంవత్సరం దీనబంధు చిత్రం కోసం శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను రాశారు. ఈ పాటలోని సాహిత్యాన్ని గమనించి సినిమా పాటగా వద్దనే ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. అదే ప్రస్తుత ఏపీ రాష్ట్రీయ గేయం.