Reading Time: 2 mins

History Of Telugu Cinema-7
తెలుగు సినిమా చరిత్ర – 7

1945లో యుద్దం ముగిసిన తరువాత 11వేల అడుగుల ఫిల్మ్ నిబంధనలు ఎత్తివేశారు. దీంతో ఈ సంవత్సరం 10 సినిమాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరంతో సాంఘిక చిత్రాలకు ఆదరణ తగ్గింది. 1946లో మూడు సాంఘీక చిత్రాలు విడుదలయ్యాయి. శ్రీ సారథి ఫిల్మ్స్ వారు నిర్మించిన గృహప్రవేశం చిత్రాన్ని ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో ఎల్వీప్రసాద్, భూనుమతి నటించారు. ఇదే ఏడాది నాగయ్య నిర్మించిన త్యాగయ్య చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. కోన ప్రభాకర్ రావు నిర్మాతగా, హీరోగా మంగళసూత్రం అనే చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఘంటసాల బలరామయ్య ముగ్గురు మరాఠీలు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే సంవత్సరం భక్త తులసిదాస్, వనరాణి వంటి చిత్రాలు విడుదలయ్యాయి. 1946 ఉత్తమ చిత్రం త్యాగయ్య, ఉత్తమ నటుడు నాగయ్యగా నిలిచారు.

1947 లో తమిళ డిస్ట్రిబ్యూటర్లు తెలుగు చిత్రాలను కొనడం ఆపేశారు. అంతేకాకుండా మద్రాస్ ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ టాక్సీని పెంచింది. దాంతో తెలుగులో అనేక నిర్మాణ సంస్థలు మూతపడ్డాయి. అదే సమయంలో కొన్ని కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇక వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై యోగివేమన చిత్రాన్ని కెవి రెడ్డి తీశారు. వేమన పద్యాలను కరపత్రాలపై ముద్రించి ఆడియన్స్ కు పంచారు. ఇలా సినిమా ప్రచారాన్ని కొత్తగా చేయడం యోగివేమనతో మొదలైంది. అలాగే గూడవల్లి రామబ్రహ్మం శారదా ప్రొడక్షన్స్ స్థాపించి పల్నాటి యుద్ధం నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఈ చిత్రం పూర్తి అవకముందే రామబ్రహ్మంకు పక్షవాతం రావడంతో ఈ బాధ్యతలు ఎల్వి ప్రసాద్ తీసుకొని చిత్రాన్ని పూర్తి చేశారు. ఇదే సంవత్సరం భానుమతి ఆమె భర్త పిఎస్ రామకృష్ణారావు కలిసి భరణి పిక్చర్స్ స్థాపించి రత్నమాల అనే సినిమాను తీశారు. ఈ సినిమాలో సిఎస్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి ప్రధాన పాత్రలో నటించారు. 1947 ఆగస్టు 15న నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విజయవాడలో ప్రారంభం అయింది.