History Of Telugu Cinema
తెలుగు సినిమా చరిత్ర ఎపిసోడ్-1
తెలుగు సినిమా గురించి ప్రస్థావించే ముందు భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహేబ్ ఫాల్కే గురించి ముందుగా తెలుసుకోవాలి. ఆయన సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు. భారతీయ సినిమాగా ఆయన తెరకెక్కించిన తొలి మూకీ చిత్రం ‘రాజా హరిచంద్ర’. ఈ చిత్రం 1913 మే 3వ తేదీన ముంబాయ్ లోని కారో నేషన్ సినిమాటోగ్రాఫ్ థియేటర్లో విడుదలైంది. ఆయన పేరుమీదనే ప్రతీ సంవత్సరం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక తెలుగు సినిమాకు రఘుపతి వెంకయ్య నాయుడు విశేష సేవ చేశారు. మొదట్లో ఆయనకు ఫోటో స్టూడియో ఉండేది. కదిలే బొమ్మలు వస్తున్నాయని తెలుసుకున్న ఆయన తన స్టూడియోను అమ్మేసి ఆ సినిమా షాట్స్ తెప్పించి ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగులో మొదటి మూకీ చిత్రం ‘బీష్మ ప్రతిజ్ఞ'(1921) తీశారు. తరువాత ఆయన తనయుడు సూర్యతో కలిసి గజేంద్ర మోక్షం(1923), భక్త నందనార్(1923), లంకా దహనం(1930) వంటి చిత్రాలను తెరకెక్కించారు.
1931 సినిమా పరిశ్రమ వేగంగా అభివృద్ది చెందింది. టాకీ చిత్రాలు ప్రారంభం అయ్యాయి. ఇక 1932లో తెలుగులో రెండు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. అవి పాదుక పట్టాభిషేకం చిత్రం, శకుంతల చిత్రాలు. ఇక 1933లో 6 చిత్రాలు విడుదలయ్యాయి వీటిలో రామదాసు, సావిత్రి, లవకుశ సినిమాలకు మంచి పేరు వచ్చింది. ఇక ఇదే సంవత్సరం ఫస్ట్ ఎడిటింగ్ ప్రయోగం జరిగింది. ద్రౌపతి వస్త్రాపహరణం అనే మూకీ సినిమాలో ఒక సీన్ లో భీముడి మీసం ఊడిపోవడంతో ప్రేక్షకులు అందరూ వెళ్లిపోయారట, దీంతో పోతిన శ్రీనివాస్ రావుకు ఒక ఆలోచన వచ్చి, భీముడి మీసం ఊడిపోయిన రీల్ ను కత్తిరించి అతికించి మళ్లీ ప్రదర్శించారట.. ఇదే ఫస్ట్ ఎడిటింగ్ సీన్. పోతిన శ్రీనివాసే ఫస్ట్ ఎడిటర్.
తొలిస్టూడియో మైదలైంది 1933లో. దక్షిణ భారతదేశంలో కూడా సొంతంగా సినిమా స్టూడియో ఉండాలని పివి దాసు పట్టు పట్టారు. అలా 1933లో కొంత మంది స్నేహితులతో కలిసి వేల్ పిక్చర్స్ అనే స్టూడియోస్ ను నిర్మించారు. అప్పటివరకు మన చిత్రాలన్నీ ముంబాయి, కోల్ కత్తా, కొల్లాపూర్ సిటీలలో నిర్మాణం జరిగేది. దీనివలన చాలా ఇబ్బందులతో పాటు ఖర్చు కూడా పెరిగేది.
వేల్ పిక్చర్స్ స్థాపించిన తరువాత శ్రమ తగ్గింది. 1934లో సీతా కళ్యాణం అనే చిత్రాన్ని ఈ స్టూడియోలో తొలిసారిగా నిర్మించారు. మొట్టమొదటిసారి కొంత బాగాన్ని అవుట్ డోర్లో చిత్రీకరించిన చిత్రం సీతా కళ్యాణం. ఈ చిత్రంతోనే ప్రొడ్యూసర్ పేరును ప్రత్యేకంగా వేసుకోవడం మొదలైంది. ఆ తర్వాత వీవి దాసు 1935లో శ్రీకృష్ణ లీలలు నిర్మించారు, 1936లో మాయాబజార్ శశిరేఖ పరిణయం చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రాన్ని 1957లో మాయాబజార్ గా పునర్నిర్మించారు.