Is this the reason for the unpredictable result of the game changer
గేమ్ ఛేంజర్ అన్ ప్రిడక్టబుల్ రిజల్ట్ కి కారణం ఇదేనా
భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రం థియేటర్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది. ట్రైలర్ తో మంచి అంచనాలు అందుకుంది. తీరా సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అన్ ప్రిడక్టబుల్ అంటూ అందరిలో ఆసక్తిరేపి ప్రిడక్టబుల్ కథను అందించారు అనే అపవాదును మూటగట్టుకున్నారు శంకర్. దర్శకుడు శంకర్ వరుసగా ఫెయిల్ అవడానికి కారణం ఏంటనేది చాలా మంది సినీవిమర్శకులు విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు.
శంకర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన సుజాత రంగరాజన్ మరణం తీరని లోటు. ఆయన తరువాత శంకర్ కు సరైన రచయిత దొరకలేదని అంటున్నారు. భారతీయుడు, జెంటిల్ మెన్, ఒకేఒక్కడు వంటి చిత్రాలలో కథ వస్తువు ఒక్కటే. సమాజంలో అంతర్లీనంగా జరుగుతున్న సమస్యలు, అవినీతి, లంచం. ఈ కథలకు కమర్షల్ ఎలిమెంట్స్ ను జోడించి సెంటిమెంట్ సీన్లతో మాయ చేసేవారు. ఆయన 2008లో ఆనారోగ్యంతో మరణించడంతో.. ఆయన స్థానాన్ని భర్తి చేసే రచయిత దొరకలేదు. ఆ తరువాత వచ్చిన స్నేహితుడు, ఐ, రోబో 2.0, ఇండియన్ 2 చిత్రాలు వరుస ఫ్లాప్ లు పడ్డాయి. దాంతో శంకర్ జాగ్రత్త పడ్డారు. ప్రముఖ రైటర్ అండ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో గేమ్ ఛేంజర్ మొదలు పెట్టారు.
ఈ సినిమా శంకర్ గతవైభవాన్ని తిరిగి తీసుకొస్తుంది అని అందరూ భావించారు. సినిమా విడుదలైన తరువాత ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ ఆలోచనలు అప్డేట్ అవలేదు, ఆయన మేకింగ్ స్టైల్ కూడా మారలేదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. నిజానికి సినిమాలో ఏం లోపించాయో ఎవరు విశ్లేషించడం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే పొలిటికల్ సిస్టమ్ ను ఎంత వరకు ప్రభావితం చేయగలడు అనేది అసలు పాయింట్. దీనికి అంతర్లీనంగా తండ్రి అప్పన్న పార్టీ పెట్టడం, దాన్ని వశపరుచుకున్న శ్రీకాంత్, అతని ఇద్దరు కొడుకుల ఆశ, అతని కొడుకులో ఒకరైన ఎస్ జే సూర్య కు ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ కు మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాలో మరో పాయింట్.
ఒకేఒక్కడు సినిమాలో ఒక సామాన్యుడు సీఎం అయితే ఏం చేయగలడు అనే పాయింట్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమా వర్కౌట్ అయింది. గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయగలడు అనే పాయింట్ ను ప్రస్థావిస్తూ.. చివరికి సీఎం అయినట్లు చూపించారు. 25 సంవత్సరాలు దాటిన ఏ భారతీయ పౌరుడు అయినా రాష్ట్రానికి సీఎం అవడానికి అర్హుడు. ఇక్కడ సినిమాటిక్ లాజిక్ మిస్ అయింది. నిజానికి సినిమాలో అన్ ప్రిడక్టబుల్ పాయింట్ అంటే ఇదే. కానీ దాన్ని తెరమీద సరైన తీరుగా ప్రదర్శించలేదు. దీనికి తోడు రామ్ నందన్ మొదట ఐపీఎస్ ఆఫీసర్ అవడం, ఆ తరువాత హీరోయిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఐఏఎస్ కావడం అనే పాయింట్ ఏ విధంగా వర్కౌట్ అవలేదు. డైరెక్ట్ గా ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లు చూపించినా పెద్దగా తేడా ఉండేది కాదు.
సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న పాత్ర మెప్పించింది. అతనికి ఉండే లోపం కదలించింది. నమ్మినవారే వెన్నుపోటు పొడవడం అందరినీ బాధించింది. అంతటి రివేంజ్ స్టోరీ లైన్ పెట్టుకొని రామ్ నందన్ తో శ్రీకాంత్ క్యారెక్టర్ కు తలకొరివి పెట్టించడం ప్రేక్షకుడు కనెక్ట్ అవలేదు. ఇక అంజలి పాత్రలో డెప్త్ సరిగా చూపించలేదు. దాదాపు పాతిక సంవత్సరాల తరువాత తల్లికొడుకులు ఒకటైన ఎమోషన్స్ తెరమీద పండించలేదు. వీటికి తోడు తండ్రి ఆశయం కోసం హీరో తన తల్లిని తల్లి కాదు అని చెబితే, అదే ఆశయం కోసం ప్రాణాలు త్యాగం చేసిన తల్లి ఎమోషన్ ను ప్రేక్షకుడు ఫీల్ అవలేదు. చాలా వరకు సినిమాలో కనెక్షన్ పాయింట్స్ మిస్ అయ్యాయి. బహుసా డ్యూరేషన్ కారణంగా వాటిని కత్తిరించి ఉంటారు అనేది అర్థం అవుతుంది.
మొదట సినిమా నిడివి 5 గంటలు వచ్చినట్లు శంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా ఒకటే భాగం అనుకున్నప్పుడు అంత లెంగ్త్ ఎలా తీశారు. ఒక 30 నిమిషాల నడివి ఎక్కువగా తీశారు అంటే ఒక అర్థం ఉంది. 2 గంటల 45 నిమిషాలు నిడివితో విడుదల చేశారు అంటే ఇంకో 2 గంటల 25 నిమిషాల సినిమా కత్తిరించారు. అంటే మరో సినిమా అన్నమాట. అంటే సినిమా తీసిన ఖర్చు, తీసేసిన ఖర్చుతో సమానం. అందువలనే కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇవన్ని కలిపి సినిమాపై ప్రభావం చూపాయి. ఇలా కాకుండా తండ్రి స్థాపించిన పార్టీని కొడుకు ఎలా వశం చేసుకున్నాడు, లేదా పోలిటికల్ గేమ్ ను కలెక్టర్ ఎలా ఆడించాడు అనే పాయింట్ ను కమర్షియల్ గా చూపించినా ఫలితం వేరేలా ఉండేది. ఇప్పటికైనా మించి పోయింది ఏం లేదు. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోగలిగితే అద్బుతాలు క్రియేట్ చేయడం శంకర్ కు కొత్తేమి కాదు. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.