K R K- కణ్మనీ రాంబో ఖతీజా మూవీ రివ్యూ

Published On: April 30, 2022   |   Posted By:

K R K- కణ్మనీ రాంబో ఖతీజా మూవీ రివ్యూ

విజయ్ సేతుపతి  ‘కణ్మనీ రాంబో ఖతీజా’ సినిమా రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

👎

ఇద్దరు ఆడాళ్లు …వాళ్ల మధ్య నలిగిపోయే మగాడి కథలు మనకు  కొత్తేమీ కాదు. శోభన్ బాబు సినిమాలు అన్నీ ఇలాంటి కథలతో ఉండేవే. ఆ తరంలో దాదాపు ప్రతీ హీరో ఇలా ఇద్దరి హీరోయిన్స్ మధ్యన నలిగిపోయే కథ చేసిన వారే. అయితే కాలం మారింది. సమాజంలో ఇలాంటి అఫీషియల్ గా పోకడలు తగ్గాయి. దాంతో సినిమాలు కూడా ఇలాంటి కథలను టచ్ చేయటం లేదు. కానీ దర్శకుడు  విగ్నేశ్‌ శివన్ కు మాత్రం ఈ ఐడియా బాగా హాంట్ చేసినట్లుంది. అంతే ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని, విజయ్ సేతుపతి ని తీసుకొచ్చి ట్రైయాంగిల్ లవ్ స్టోరి లాంటి ఈ కథను తెరకెక్కించారు. మరి ఈ కథ ఈ జనరేషన్ ప్రేక్షకులకు ఎక్కుతుందా..నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయా..ఈ స్టార్స్ ఒప్పుకునేటంత విషయం కథ,కథనంలో ఏముందో చూద్దాం.

Story line:

పుట్టు దురదృష్ణవంతుడు  రాంబో(విజయ్‌ సేతుపతి).  తమ వంశంలో ఎవ్వరికీ పెళ్లి కాదని, పెళ్లి అయినా కూడా ఏవో అశుభాలే జరుగుతాయనే ఊరి ప్రజల మూఢ నమ్మకాలను తొలగించేందుకు రాంబో తండ్రి ఓ అడుగు ముందుకు వేస్తాడు. పెళ్లి చేసుకుంటాడు.. తండ్రి కూడా అవుతాడు. కానీ రాంబో పుట్టిన మరుక్షణమే అతను చనిపోతాడు.  తల్లి మతి స్దిమితం కోల్పోతుంది. రాంబో మేనత్త, బాబాయ్‌లు పెళ్లి కాకుండానే జీవితాన్ని కొనసాగిస్తుంటారు.

ఇక రాంబో తాను దురదృష్ణవంతుడుని కాబట్టి…ఏది కోరుకున్నా కూడా తన చెంతకు చేరదని, అది దూరమవుతుందని భావిస్తూంటాడు. కనీసం చాకోబార్ ఐస్ క్రీమ్ పొందలేని దురదృష్ణవంతుడిగా ఫీలవుతాడు రాంబో. ఇక అందరికీ ఎంతో సులభంగా దొరికే వర్షం కూడా రాంబో మీద కురవదు.  దీంతో రాంబో  తను ప్రక్కనే ఉంటే తల్లి ఆరోగ్యం సెట్ కాదని ఓ పిచ్చి నమ్మకం పెంచుకుని ఇంటి నుంచి పారిపోతాడు. అంతేకాదు తాను ఎవర్ని ఇష్టపడితే వాళ్లకు కీడు జరుగుతుందని, ప్రేమ,పెళ్లి వంటి వాటికి దూరంగా ఉంటాడు.  కానీ, త‌న త‌ల్లి మాత్రం ఏదో ఒక రోజు ప్రేమ‌లో త‌డిసి ముద్ద‌వుతావ‌ని, నీకు ఇష్ట‌మైన‌వన్నీ నీకు ద‌క్కుతాయ‌ని చెప్పిన మాట మాత్రం మనస్సులో నాటుకుపోతుంది.

ఇక సిటీకు వెళ్లిన రాంబో  అక్క‌డే ప‌గ‌లు క్యాబ్ డ్రైవ‌ర్‌గా, రాత్రిళ్లు ప‌బ్‌లో బౌన్స‌ర్‌గా ప‌నిచేస్తూంటాడు.  ర్యాంబోకి త‌న త‌ల్లి చెప్పిన‌ట్టుగానే ఒకేసారి ఇద్ద‌రి మ‌న‌సుల్ని సొంతం చేసుకుని వారి ప్రేమ‌లో త‌డిసి ముద్ద‌య్యే అవకాసం వస్తుంది. క్యాబ్ డ్రైవర్ గా ఉన్నప్పుడు పరిచయమైన క‌ణ్మ‌ణి (న‌య‌నతార‌) అతన్ని ఇష్టపడుతుంది. అలాగే పబ్ లో పనిచేసేటప్పుడు, ఖ‌తీజా (స‌మంత ) కి కనెక్ట్ అవుతాడు. ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాడు రాంబో. ఒకరితో పగలంతా గడిపితే.. మరొకరికి రాత్రి సమయం కేటాయిస్తాడు. వీళ్లద్దరుని ప్రేమించిన ర్యాంబోకి ఆ త‌ర్వాత అస‌లు స‌మ‌స్య ఎదుర‌వుతుంది.

కణ్మణి.. ఖతీజాలకు ఒకరి గురించి ఒకరికి తెలిసే సమయానికే రాంబోకు ఒక మానసిక జబ్బు ఉందని.. అందువల్లే అతను కణ్మణి.. ఖతీజాలను తనకు తెలియకుండానే వేర్వేరుగా ప్రేమించాడని బయటపడుతుంది. దాంతో వాళ్లిద్దరూ అతనిపై సానుభూతి చూపిస్తారు. అయితే కొద్ది రోజులకు రాంబోకు మానసిక జబ్బు ఏమీ లేదని…అది తమ నుంచి తప్పించుకోవటానికి  ఆడిన నాటకం అని వాళ్లిద్దరికి రివిలైపోతుంది. నిలదీస్తారు..కోప్పడతారు. ఇద్దర్నీ తాను సమానంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో వాళ్లిద్దరు అతన్ని వదిలేసి వెళ్లిపోతారు. కానీ రాంబో తల్లికి ఒంట్లో బాగోపోవటంతో ఇద్దరు మళ్లీ వస్తారు. అక్కడ ఆమె ఇద్దరూ తన కొడుకుని చేసుకుని సుఖపడమని దీవిస్తుంది. షాకైన వాళ్లిద్దరూ మళ్లీ వెళ్లిపోతారు. చివరకు విసుగెత్తిన వాళ్లిద్దరూ తమకు తగ్గ జోడిని వెతుక్కుని రాంబోకు బై చెప్పేస్తారు. రాంబో మళ్లీ ఒంటరివాడవటం, అతనికు కత్రినా కైఫ్ వివాహానికి ఒప్పుకుందనే విషయం తెలియటంతో  కథ ముగుస్తుంది.

Screenplay Analysis:

ఇక ఈ సినిమా ట్రైలర్ చూసి ఏదో సమ్ థింగ్ ఉందని ఎక్సపెక్ట్ చేస్తాం. అందులో విఘ్నేష్ శివన్ కాస్త విషయం ఉన్న డైరక్టర్ కావటం..స్టార్ కాస్ట్ సినిమాపై అంచనాలు పెంచటానికి కలిసొచ్చాయి. ముఖ్యంగా ట్రైలర్లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు టీ.. ఇంకొకరు కాఫీ తెచ్చి ఇస్తే.. రెండూ కలిపి తాగే సీన్.. నయన్-సామ్ ఒకరి తర్వాత అతడి చెంపలు చెల్లుమనిపించే షాట్.. లాంటివి చూస్తే ఈ సినిమా మంచి ఫన్ రైడ్ లాగా అనిపించింది. కానీ అవన్నీ  ట్రైలర్ వరకే పరిమితం. సినిమాలో అంతగా పండలేదు.

ఈ సినిమా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా డైరక్టర్ చెప్తాడు కానీ మనకు మతి భ్రమించిన వాడి లవ్ స్టోరీగా కనిపిస్తుంది. అక్కడక్కడా కామెడీ సీన్స్ నవ్వించినా…కోర్ కాన్సెప్ట్ మనని కన్వీన్స్ కానివ్వదు.రాంబో-కన్మణి ఎపిసోడ్  ఎమోషనల్‌గానూ, రాంబో-కతీజా ఎపిసోడ్ ఫన్నీగానూ డిజైన్ చేసాడు. అలాగే రాంబో క్యారక్టరైజేషన్ లో చెప్పే ఐస్ క్రీమ్ సీన్ నవ్విస్తుంది. కానీ చాలా సీన్స్ చాలా ఊరగా…నాటుగా ఉంటాయి.. ముఖ్యంగా టీ-కాఫీ, బాదం-పిస్తా ఎపిసోడ్లు బాగా నవ్విస్తాయి కానీ మరీ ఓవర్ గా అనిపిస్తుంది. హీరో ఇద్దరినీ ప్రేమించానని చెప్పే సీన్స్ కొద్దిసేపు డైలాగులతో నవ్వించినా సస్డైన్ కాదు .ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ఒకే సమయంలో వేర్వేరుగా ప్రేమించడం.. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని ఆశపడటం.. ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగించడం.. ఇలాంటి ఎన్నో కథలు చూసిన మనకు రొటీన్ అనిపించటం కూడా అతిశయోక్తి కాదు.

ఎలాగో ఫస్టాఫ్ సాగిపోయినా …సెకండాఫ్‌లో రాంబో గురించి కన్మణి, కతీజాలకు నిజం తెలిశాక కథ పూర్తిగా గాడి తప్పింది. ఈ కథకు స్క్రీన్ ప్లే కూడా ఏమి అనుకున్నట్లు లేరు. ఎటు కథ నడిస్తే అటు నడిపేసారు.  సినిమా ప్రారంభంలో హీరో మీద వచ్చే సింపతీ…ఎమోషన్‌తో  , సెకండాఫ్‌లో పూర్తిగా పోతుంది. సెకండాఫ్ ప్రారంభం నుంచి అసలు కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో డైరక్టర్ చాలా గందరగోళంగా గడిపినట్లు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఇద్దరి హీరోయిన్స్ తో ముడిపెడతాడేమో అనుకుంటే కాస్త డిఫరెంట్ గా ఇద్దరు వదిలేసి వెళ్లిపోతాడు . ఏదైమైనా ఎమోషన్‌కు లేని కథలో మిగతా ఎలిమెంట్స్ ఏమి ఉన్నా కలిసి రాదని క్లారిటీ వస్తుంది..   తెరపై స్టార్‌ క్యాస్ట్‌ తప్ప కథలో కొత్తదనం కనిపించదు. పాన్‌ ఇండియా సినిమాలు సందడి చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు స్క్రిప్టు విషయంలో జాగ్రత్తపడకపోతే  ప్రేక్షకులు ఆదరించడం కాస్త కష్టమే. విజయ్‌ సేతుపతి లాంటి గొప్ప నటుడితో సమంత, నయనతార లాంటి స్టార్‌ హీరోయిన్స్‌ ఉన్నా ఫలితం లేదు.

అయినా చిన్న లాజిక్ … పగలు క్యాబ్ డ్రైవర్.. రాత్రి బౌన్సర్ గా పని చేసే ఒక మామూలు వ్యక్తి.. ఆయా సమయాల్లో తనను కలిసే ఇద్దరు పోష్ అమ్మాయిలను లైన్ లో పెట్టేసి…ఇద్దరూ తన కోసం పడి కొట్టేసుకునేలా చేయడం సాధ్యమా చెప్పండి.

Analysis of its technical content:

సినిమాకు అవసరమైన మెయిన్ టెక్నికల్ ఎలిమెంట్ స్క్రిప్టు. అక్కడే దెబ్బ తింది. మిగతావి ఎంత బాగున్నా కలిసొచ్చేదేముంది. అప్పటికి  అనిరుధ్ రవిచందర్ సంగీతం. అతడి నేపథ్య సంగీతం బాగుంది. రెండు పాటలు హుషారుగా ఉన్నాయి. కదిర్-విజయ్ కార్తీక్ కెమెరా వర్క్ కలర్ ఫుల్ గానే సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్  ఓకే. రైటర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. ఫెయిలయ్యాడు. అతని  సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని సీన్స్ ని బ్రతికించింది…మిగతాదంతా నాన్సెన్స్ అనిపించింది.ఎడిటింగ్ మరింత ట్రిమ్ చేయచ్చు.

డైలాగుల్లో …రెండు కళ్లున్నాయి.. రెండు చెవులున్నాయ్.. నాకు ఇడ్లీ అంటే ఇష్టం దోశె అంటే ఇష్టం.. రజినీ అంటే ఇష్టం.. కమల్ అంటే ఇష్టం …కాబట్టి ఇద్దరిని లవ్ చేయకూడదా? నా గుండెను రెండు ముక్కలుగా కోసి.. రెండు సింహాసనాలు చేసి మీ ఇద్దరినీ కూర్చోబెట్టాను అని హీరో చెప్పే డైలాగులు లాంటివి కొన్ని బాగా పేలాయి.

నటీనటుల్లో విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ఎప్పటిలాగే బాగాచేసారు. రాంబోగా విజయ్‌ ఫెరఫెక్ట్ ఛాయిస్.   కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఎట్రాక్ట్ చేస్తుంది. టీవీ షో యాంకర్ గా ప్రభు, ఖతీజా ఫస్ట్ బాయ్‌ప్రెండ్‌ మహ్మద్‌ మోబీగా శ్రీశాంత్‌ బాగానే చేశారు.

CONCLUSION:

జస్ట్ ఓకే అని కూడా అనిపించని ఈ సినిమాని చివరి దాకా చూడటం కాస్త కష్టమైన విషయమే.

Movie Cast & Crew

నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీశాంత్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ – సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
సినిమాటోగ్ర‌ఫి:ఎస్.ఆర్.కధిర్ – విజయ్ కార్తీక్ కణ్ణన్
Genres:Telugu, Romantic Comedy
Run time:2 Hrs 39 Min
దర్శకుడు: విగ్నేశ్‌
సంగీతం: అనిరుథ్‌
నిర్మాతలు: విగ్నేశ్‌ శివన్ – నయనతార – ఎస్.ఎస్.లలిత్ కుమార్
విడుదల తేది: ఏప్రిల్‌ 28,2022