King Nagarjuna Birthday Special
కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్
వెండితెర మన్మథుడు, అమ్మాయిల కలల గ్రీకువీరుడు, ఇండస్ట్రీ యువసమ్రాట్ కింగ్ నాగార్జున జన్మదిన సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఒకసారి చూద్దాం. సురభి నాటకాలలో లేడీ పాత్రలు వేసే ఓ యువకుడు తెలుగుపరిశ్రమలో హీరోగా ఎదిగి ఓ సామ్రాజ్యాన్నే నిర్మించాడు. ఆయనే అక్కినేని నాగేశ్వర రావు. ఆయన భార్య పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అంతే కాకుండా తెలుగు పరిశ్రమకు ఓ హీరోను ఇచ్చాడు. ఆరడుగుల ఎత్తు, అందమైన కళ్లతో పాటు చక్కని శరీర సౌషష్టం కలిగి ఉన్న నాగార్జున 1986లో విక్రమ్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అదే సంవత్సరం కెప్టెన్ నాగార్జున్, 1987లో వచ్చిన అరణ్యకాండ చిత్రాలు సైతం నిరాశ పరిచాయి. దాంతో అక్కినేని అభిమానులు కలవర పడ్డారు. నాగేశ్వరరావు నటవారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన నాగ్ సక్సెస్ కాలేడేమో అని కంగారు పడ్డారు.
అదే సంవత్సరం మజ్ను చిత్రం విడుదలైంది. దీంతో నాగార్జున కాస్త ఊపరి పీల్చుకున్నారు. నాగేశ్వర రావు అభిమానులు కూడా కాస్త కుదురుకున్నారు. సంకీర్తన సినిమా నిరాశ పరచినా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం విజయాన్ని అందించింది. ఆ తరువాత కిరాయి దాదా, ఆఖరి పోరాటం, జానకీ రాముడు, విక్కీ దాదా, విజయ్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్‌కు యువసామ్రాట్ను చేశాయి. నాగార్జున నటించిన మొదటి రెండు సినిమాల ఫలితాలు చూసి విమర్శించినవారే ఆ తరువాత ప్రశంసించారు. అదే సమయంలో క్రియేటీవ్ దర్శకుడు మణిరత్నంతో గీతాంజలి చిత్రం వచ్చింది.
మణిరత్నం నేరుగా తెలుగులో తీసిన సినిమా గీతాంజలి. ఇదొక ప్రేమ కావ్వంగా ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. పాటలు, సీన్లు అన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో శివ అనే చిత్రం విడుదలైంది. పేజీల డైలాగులు, భారీ ఫైట్లు, విలన్లపై అరవడాలు అనే రోటిన్ కాన్సెప్ట్‌ను శివ చిత్రం తోసిపుచ్చింది. కళ్లతో విలన్లను బెదిరించడంతో పాటు అనేక రకల కొత్త షాట్సేను వెండితెరకు పరిచయం చేశారు. ఇదంత చేసింది రామ్ గోపాల్ వర్మనే కానీ, అతను చెప్పిన ఆలోచనను నమ్మడం నాగార్జున గొప్పతనం. కమర్షల్ చిత్రాలు సైతం చేశారు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అల్లరి అల్లుడు, హలోబ్రదర్, ఘరానాబుల్లోడు లాంటి ఊర మాస్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
అలా కమర్షల్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో అన్నమయ్య అంటూ మరో ప్రయోగానికి తెరలేపారు. రొమాంటిక్ సినిమాలు చేసే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రం ప్రకటించినప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారు. తీరా చిత్రం విడుదల అయిన తరువాత వారే ప్రశంసించారు. ఆ వెంటనే ఆవిడా మా ఆవిడే లాంటి కామెడీ రోమాంటిక్ చిత్రంలో నటించారు. ఇక 2002లో వచ్చిన సంతోషం సినిమా నాగార్జున ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. ఆయన్ను వెండితెర మన్మథుడిని చేసింది. అలా మన్మథుడు అనే చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇక మాస్, క్లాస్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేశారు. మాస్, నేనున్నాను, సూపర్, స్టైల్ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
ఇటు పక్కా కమర్షియల్ చిత్రాలను తీస్తూనే మళ్లీ రాఘవేద్ర రావుతో శ్రీరామధాసు అనే భక్తి చిత్రాన్ని తీశారు. కంచెలర్ల గొపన్నగా వెండితెరపై ఆయన అభినయాన్ని చూపించారు. ఫలితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో నాగార్జున రోమాంటిక్ మాస్ హీరోనే కాదు, భక్తిరసాలను కూడా రక్తి కట్టించగలడని మరోసారి నిరుపించుకున్నారు. మళ్లీ కింగ్, డాన్, రగడ, కేడీ వంటి కమర్షియల్ చిత్రాలు చేశారు. మధ్యలో పీరియాడిక్ డ్రామాగా రాజన్న చిత్రంలో రాజన్న పాత్రాలో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత కొన్ని ప్రయోగాలు చేశారు కానీ అవి పెద్దగా ఆడలేదు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం చిత్రంలో అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించారు. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
మరీ కుర్రాడిలా కాకుండా కాస్త వయసుకు తగ్గట్లు పాత్రలను ఎంచుకోవాలని సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకుంది. దాంతో నాగార్జున ప్రేక్షకులకు మరింత ఉత్సహాన్ని అందించాలని ఓం నమో వెంకటేశయా అనే భక్తి చిత్రాన్ని అందించారు కానీ అది అనుకున్నంత ఆదరణ పొందలేదు. ఆ తరువాత రాజుగారి గది2, మన్మథుడు2, ఆఫీసర్, బంగార్రాజు, ఘోస్ట్ లాంటి చిత్రాలలో అలరించారు. కానీ అవేవి పెద్దగా ఆడలేదు. ఈ మధ్య నాగార్జున స్టార్ డమ్‌కు సరిపోయే కథతో నా సామిరంగ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రం పరువాలేదనిపించింది.
కింగ్ నాగర్జున కేవలం సినిమాలు మాత్రమే కాదు బుల్లితెరపై కూడా అలరించారు. మీలో ఎవరు కోటిశ్వరుడు, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీటితో పాటు టీవీ యాడ్స్ చేస్తున్నారు. సొంత బిజినెస్‌లు చూసుకుంటున్నారు. అంతే కాదు తన కొడుకులిద్దరిని ఇండస్ట్రీకి ఇచ్చారు. వారు కూడా అక్కినేని నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కింగ్ నాగార్జున కాంట్రవర్సీలకు దూరం ఉండే వ్యక్తి. తన పని తాను చేసుకోవడం తప్ప ఇంకోటి తెలియని నటుడు. అందుకే వెండితెర గ్రీకువీరుడు, మన్మథుడు అయినా క్లీన్ పేపర్లా ఎలాంటి మచ్చ లేకుంటా ఉన్నారు. ఇలాగే నాగార్జున తన కెరియర్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకోవాలని ఆశిస్తూ కింగ్ నాగార్జునకు బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున శుభాకాంక్షలు అందిస్తున్నాము.