Maruthi Nargar Subramanyam Movie Review
మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ
Emotional Engagement Emoji
విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకతని, గుర్తింపుని సొంతం చేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ ప్రధాన పాత్రలో మొదటిసారిగా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. నిహారిక, సుమంత్ అశ్విన్లతో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేసిన దర్శకుడు లక్ష్మణ్ రెండో సినిమాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనౌన్స్ చేశారు. ముందు నుంచి భిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ రావడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి. దానికి తోడు సుకుమార్ భార్య ఈ సినిమాని సమర్పిస్తూ ఉండడం సినిమా మీద మరింత ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది.. దానికి తోడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఇంతమంది సపోర్ట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?, అనేది చూద్దాం.
కథ:
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి పట్టణంలోని మారుతీ నగర్ లో వుండే సుబ్రహ్మణ్యం( రావు రమేష్ ) చిన్నతనం నుండే గవర్నమెంట్ జాబ్ చేయాలనే లక్ష్యంతో కళలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత టీచర్గా పోస్టింగ్ కూడా వచ్చిన తర్వాత అనూహ్యంగా కోర్ట్ కేసుల్లో పడి ఆ పోస్టింగ్ హోల్డ్ లో పడుతుంది. అప్పటినుంచి చేస్తే ఆ ఉద్యోగమే చేయాలని భావించి ఇంట్లో ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి(ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులోనే క్లర్క్ గా పని చేస్తూ ఉంటుంది.ఆమె జీతం మీదనే ఇల్లు మొత్తం గడుస్తూ ఉంటుంది. వీరి కుమారుడు అర్జున్(అంకిత్ కొయ్య) తాను అల్లు కుటుంబానికి చెందిన వాడినని చిన్నప్పుడు పెంచడానికి సుబ్రహ్మణ్యానికి ఇచ్చారని భావిస్తూ నాన్న అని కూడా పిలవకుండా సుబ్రహ్మణ్యం అనే పిలుస్తూ ఉంటాడు. అలాంటి అర్జున్ కాంచన(రమ్య పసుపులేటి)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తండ్రితో కలిసి వెళ్లి ఆమె ఇంట్లో మాట్లాడగా ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇస్తారు. ఇంతలో కళారాణి అమ్మ ( అన్నపూర్ణ ) చనిపోవడంతో కళారాణి తీర్థయాత్రలకు బయలుదేరుతుంది. ఆ సమయంలో అనూహ్యంగా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు జమ అవడంతో సుబ్రహ్మణ్యం , అర్జున్ షాక్ అవుతారు. ఇంతకీ ఆ 10 లక్షలు అకౌంట్ లోకి ఎలా వచ్చాయి.?, ఆ డబ్బుతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు.?, పదిహేనేళ్ళుగా చిన్న గోడల దగ్గరే ఆగిపోయిన తన సొంత ఇల్లు ఎలా పూర్తిచేసాడు అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కామెడీ టచ్ బాగుంది. ఓపెనింగ్ నుంచి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం, అతని కొడుకు పాత్ర మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఏళ్ళ తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం.. ఈ రెండిటిని లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న కామెడీ సీన్స్.. మొత్తమ్మీద ఈ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో ఫన్ తో పాటు కొన్ని చోట్ల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది.
ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన రావు రమేశ్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సుబ్రమణ్యం’ పాత్రను ఆయన చాలా బాగా పండించారు. ముఖ్యంగా రావు రమేష్ డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి. ఎమోషనల్ టోన్ లో నడిచిన భార్య పాత్రలో ఇంద్రజ ఆకట్టుకుంది. అంకిత్ కొయ్య నటన చాలా బాగుంది. రమ్య పసుపులేటి అందాల ప్రదర్శన సినిమాకి ప్లస్ అయ్యింది. ఇతర కీలక పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, నూకరాజు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
లక్ష్మణ్ కార్య తీసుకున్న కథాంశం, మరియు రావు రమేశ్ – అంకిత్ కొయ్య పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా సాగుతుంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. సినిమాలో ఎమోషన్ కి స్కోప్ వున్న సన్నివేశాలు ఉన్నపటికీ దర్శకుడు దాని మీద ఫోకస్ చేయలేదనిపించింది. కాకపోతే దర్శకుడు సినిమా ని పూర్తి స్థాయి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెప్పాలనుకున్నాడు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రతో పాటు ఆమె తల్లిదండ్రుల పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.
అలాగే, ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి ఖాతాలోనో పడితే..? ఈ కోణంలో నడిచే డ్రామా కూడా ల్యాగ్ అయ్యింది. నిజానికి పాతికేళ్ళు కేవలం భార్య సంపాదన మీద ఆధారపడి బతికే సుబ్రహ్మణ్యానికి ఒక్క సారిగా లక్షలు వచ్చి పడితే.. అతని మనస్తత్వం ఎలా ఉంటుంది ?, అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ? వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. లక్ష్మణ్ కార్య దర్శకుడిగా ఆకట్టున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కామెడీ సీన్స్ మరియు ‘రావు రమేశ్ – అంకిత్ కొయ్య’ పాత్రలు ఆకట్టుకున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ బోరింగ్ ప్లేతో స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని చోట్ల ఎంటర్టైన్ మెంట్ తో పాటు నటీనటుల పనితీరు కూడా బాగుంది. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
Cast & Crew Details :
Story, Screenplay, Dialogues & Direction: Lakshman Karya
Produced by PBR CINEMAS & LOKAMAATRE CINEMATICS
Producer – Bujji Rayudu Pentyala Producer – Mohan Karya
Presented by: Thabitha Sukumar
Music – Kalyan Nayak
Cinematography – MN Balreddy
Editor – Bonthala Nageswara Reddy