Nanna Malli Ravaa Movie 12th April Release
నాన్నా మళ్లీ రావా మూవీ ఏప్రిల్ 12 విడుదల
హార్ట్ టచ్ చేస్తూ, కన్నీళ్లు తెప్పించే ‘మాతృదేవోభవ’ వంటి అరుదైన కొన్ని సినిమాలు మాత్రమే వస్తాయి. అలాంటి ఎమోషన్ డ్రామా ‘నాన్నా మళ్లీ రావా..!’ మూవీ విడుదలకు సిద్ధమైంది. కమల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్దేష్ దర్శకత్వంలో, డా. ఉమారావు నిర్మాణంలో సత్యప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘నాన్నా మళ్లీ రావా..!’. సత్యప్రకాష్, ప్రభావతి, రిత్విక్, హరీక, శిరీష తదితరులు నటించిన ఈ మూవీ ఈనెల 12న శనివారం థియేటర్లలో విడుదల కాబోతుంది
ఈ సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు గ్లిజరిన్ పెట్టుకోకుండానే ప్రతి రోజు నాకు కన్నీళ్లు వచ్చాయి. సినిమా షూటింగ్ అని కాకుండా నా చుట్టూ జరుగుతున్న నిజ సందర్భాల్లాగే నేను ఫీలయ్యాను, దీనికి కారణం దర్శకుడు నిర్దేష్ గారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కారణం. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి, కుటుంబ సమేతంగా చూడగలిగే దర్శకుడు తీర్చిదిద్దారు” అని తెలిపారు.
దర్శకుడు నిర్దేష్ మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రివ్యూ ప్రదర్శన అనంతరం చూసిన వారి స్పందనను బట్టి ఒక మంచి సినిమా చేశామన్న నమ్మకం కుదిరింది. సినిమా సెన్సార్ సమయంలో సెన్సార్ బోర్డు సభ్యుల ప్రశంసలు ఎప్పటికి మరిచపోలేను. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగంగా ఉంటుంది. థియేటర్‌లో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ శనివారం విడుదల అవుతున్న ఈ సినిమా ను థియేటర్ కు వెళ్లి చూడాలని ప్రతి ఫ్యామిలకి విజ్ఞప్తి చేస్తున్నాను..” అని చెప్పారు.
హీరో రిత్విక్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను కేశవ్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నిజజీవితంలో నాన్న పాత్ర ఎంతో విలువైందో తెలిసింది. షూటింగ్ సమయంలోనే గుండె బరువెక్కిన సంఘటన జరిగింది. నాన్నతో పాటు, ఈ సినిమా నా గుండెల్లో ఎప్పుడు నిలిచే ఉంటుంది.” అని అన్నారు.
కుటుంబ సమేతంగా అందరికి నచ్చే సబ్జెక్టుతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఈ చిత్ర నిర్మాత డా. ఉమారావు ధన్యవాదాలు చెప్పారు.
ఒకప్పుడు వచ్చిన”మాతృదేవో భవ” చిత్రం అమ్మ విలువను తెలపగా, ‘నాన్నా మళ్లీ రావా..!’ మూవీ నాన్నా త్యాగాన్ని గుర్తు చేస్తూ ఏడిపిస్తుందని ఈ చిత్రంలో తల్లి పాత్ర చేసిన నటి ప్రభావతి తెలిపారు.