Natural Star Nani Movie Journey Till Saripodhaa Sanivaaram
నేచురల్ స్టార్ జర్నీ అష్టాచమ్మ నుంచి సరిపోదా శనివారం వరకు
ప్రతిభ ఉన్నవారికి ప్రపంచం ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేచురల్ స్టార్ నాని అందుకు నిదర్శనం. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని అనూహ్యంగా హీరో అయ్యారు. నాని నటన చూసిన ప్రేక్షకులందరూ పక్కింటి కుర్రాడిలా చాలా నేచురల్ గా నటిస్తున్నారని అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు నేచురల్ స్టార్ అనే ట్యాగ్ ని ఇచ్చారు. అంతేకాదు మొదటి సినిమా నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతో చేరువయ్యారు. నాని సినిమా వస్తుంది అంటే కుటుంబం అంతా కలిసి చూడవచ్చు అనే నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 2008లో తెరకెక్కిన ‘అష్టాచమ్మా’ చిత్రంతో నాని తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2009లో రమేష్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తనిష్ తో కలిసి నాని స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ‘రైడ్’.
అదే సంవత్సరం ‘స్నేహితుడా’ అనే చిత్రాన్ని సత్యం బెల్లంకొండ తెరకెక్కించగా అందులో నాని హీరోగా నటించారు. కెరీర్ బిగినింగ్ లో నాని సినిమాలు పెద్దగా ఆడకపోయినా.. ఆయన నటనకు అభిమానులు ముచ్చట పడుతున్న సందర్భంలో 2010లో భీమిలి కబడ్డీ జట్టు అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో నాని పోషించిన సూరిబాబు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అలా మొదలైంది’ సినిమా ప్రేక్షకులకు నానిని మరింత చేరువు చేసింది. అదే సంవత్సరం 2011లో జి అశోక్ దర్శకత్వంలో ‘పిల్ల జమిందార్’ చిత్రం థియేటర్లో ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక నాని కెరియర్ లో ‘ఈగ’ చిత్రం ఒక రకమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అప్పటివరకు పెద్ద దర్శకులతో పని చేయని హీరో నాని ఏకంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పని చేసే అవకాశం లభించింది. సినిమాలో నాని క్యారెక్టర్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది కానీ సినిమా మొత్తం నాని పాత్ర పగ తీర్చుకునే ‘ఈగ’ రూపంలో ప్రతిబింబిస్తోంది. ఆ తర్వాత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘పైసా’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలు వచ్చాయి.
వరుసగా ఈ రెండు చిత్రాలు నానికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా నానికి డీసెంట్ హిట్ ను అందించింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలేభలే మగాడివోయ్’ చిత్రంతో ఫిలింఫేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం తర్వాత నాని కొంచెం తన రూట్ మార్చుకున్నారు. కేవలం క్లాస్ చిత్రాలు మాత్రమే కాదు, కాస్త మాస్ టచ్ తో వెళ్దామని నిర్ణయించుకున్నారు. అనురాగపూడి దర్శకత్వంలో ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ వంటి చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, శ్యాంసింగారాయ్ చిత్రాలలో నటించి నేచురల్ స్టార్ అంటే ఏంటో మరోసారి రుజువు చేశారు.
ఎప్పుడూ వినూత్నమైన కథలను ప్రోత్సహించే నాని యంగ్ డైరెక్టర్ వివేక ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం మంచి పబ్లిక్ టాక్ నే సొంతం చేసుకున్నప్పటికీ థియేటర్లో కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. వెంటనే మరో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ అనే మాస్ ఫిలిమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వెంటనే ‘హాయ్ నాన్న’ చిత్రంతో మళ్ళీ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. తాజాగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రెండోసారి చేస్తున్న చిత్రం సరిపోదా శనివారం. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రియాంక అరుణ్ మోహన్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటిస్తోంది. గతంలో గ్యాంగ్ లీడర్ చిత్రంలో వీరిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లో భాగంగా నాని తిరుమల దర్శనానికి సైతం వెళ్లారు. ఇక ప్రమోషన్లు కూడా జోరుగా సాగిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని హీరో నాని నమ్మకంగా ఉన్నారు.