Prabhas Birthday Special
ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్
ప్రభాస్.. నిజమైన బాక్స్ ఆఫీస్ కటౌట్ ఆయన. ఆరడుగుల మూడు అంగుళాల నిలువెత్తు రూపమే కాకుండా, ఆయన మంచితనం, మనసు అంతకు మించిన ఎత్తు అని చెప్పవచ్చు , అందుకే వెండితెరపై ఆయన్ను చూడగానే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. రెబల్ స్టార్ గా పరిచయం అయి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్. నిత్యం కఠోర శ్రమ, క్రమశిక్షణతో ఒక్కో సినిమా చేస్తూ కీర్తి సంపాదించుకున్నారు. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 న ప్రభాస్ జన్మించాడు. వీరిది పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. పెద్దనాన్న కృష్ణం రాజు తెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు ప్రభాస్.
జయంత్ పరంజీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ సినిమా మొదటిది. ఈశ్వర్ సినిమా కొన్ని ఏరియాల్లో బాగానే ఆడింది. ఆ తరువాతి సంవత్సరం రాఘవేంద్ర సినిమా పరాజయం అయింది. ఆ సమయంలో వర్షం సినిమా వచ్చింది. ప్రభాస్‌లో ఉన్న మాస్ కోణం ఎలివేట్ అయింది. వర్షం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు ప్రభాస్. ఆ తరువాత బి గోపాల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం అడవి రాముడు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. క్రియేటీవ్ దర్శకుడు కృష్ణవంశి తెరకెక్కించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం చక్రం సైతం అంతగా రుచించలేదు. అలాంటి సమయంలో రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి వచ్చింది. వెండితెరపై ప్రభాస్ నడిచివస్తుంటే విజిల్స్ పడ్డాయి. భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అప్పటి వరకు ప్రభాసును అలా ఎవరూ చూపించలేదు. ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష, చార్మి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్ చిత్రాలు వచ్చాయి. ప్రభాస్ ను కొత్తగా చూపించిన దర్శకుడు కరుణాకర్. మిస్టర్ ఫర్ఫెక్ట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పంచాడు. వెంటనే వచ్చిన రెబల్. ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్, ఆ స్వాగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ సినిమా వర్కౌట్ కాలేదు. అలాంటి సమయంలో రైటర్ కొరటాల శివ మిర్చి సినిమా చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మళ్లీ రాజమౌళితో సినిమాను ప్రకటించారు. కొంత లేట్ అయినా బహుబలి విడుదలై రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు.
బహుబలి చిత్రాల తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశ పరిచాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మరో అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కల్కి భారీ విజయం సాధించింది. ప్రస్తుతం సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హనురాఘవ పూడి దర్శకత్వంలో మరో సినిమా లైనప్ లో ఉంది. ఆయన బర్త్ డే రోజు ఈ సినిమాల అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అంటేనే ఒక లాయలిటీ ఉంటుంది. మరీ ఈ సంవత్సరం ఆయనకు అన్నీ విజయాలే రావాలని కోరుకుంటూ బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.