Reading Time: 3 mins

Prabhas  The pan India star-Tel

ప్రభాస్ ది పాన్ ఇండియా స్టార్

ఆరడుగుల ఎత్తు, అందమైన ముఖవర్చస్సు, వెన్నెల్లాంటి నవ్వు.. వెండితెరపై ఆయన కటౌట్ చూస్తే చాలు అభిమానుల్లో పూనకాలు వస్తాయి. ఆయనే రెబల్ స్టార్ ప్రభాస్. పడిలేచే కెరటమల్లె విజయాలను, అపజయాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్న నటుడు ప్రభాస్. ఆయన కోసం ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు, నిర్మాతలు ఆశగా చూస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ పేరు ప్రతిష్ఠలు ఒక రాత్రిలో వచ్చినవి కావు. దీని వెనుక 22 సంవత్సరాల కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉంది. ఒక్కో సినిమా చేస్తూ పాన్ ఇండియా స్టార్ వరకు ఎదిగి తెలుగు పరిశ్రమ ఎల్లలు చెరిపిన బాహుబలి ఆయన. సలార్ చిత్రంతో బాక్స్ చరిత్రను తిరగరాసి, కల్కితో పాన్ ఇండియా స్టార్ నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జర్నీ అమోఘం.

ప్రభాస్ తండ్రి నిర్మాత సూర్యనారయణ రాజు, పెద్దనాన్న కృష్ణం రాజుల ప్రోత్సాహంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకున్న నటుడు. వారసత్వం కాదు ప్రతిభ మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది అని నమ్మి, కష్టపడుతూ ఈరోజు సినిమా అనే శిఖరాన్ని శాసిస్తున్నారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు అదే పదివేలు అనుకునే ప్రొడ్యూసర్లు కోకొల్లలు. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన జర్నీ ఎందరో యంగ్ హీరోలకు స్పూర్తిదాయకం.

ఈశ్వర్(2002)

జయంత్ పరంజీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ సిినిమాలో కాస్త సన్నగా, పొడుగ్గా, కోర మీసాలు, కత్తుల్లాంటి కళ్లు, రింగుల జుట్టు ఇదే ప్రభాస్ మొదటి కటౌట్. ఆ సమయంలో టాప్ హీరోలు అంతా మీడియం హైట్‌తో ఉన్నావారే. దాంతో ప్రభాస్ ప్రేక్షకులను  పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈశ్వర్ సినిమా కొన్ని ఏరియాల్లో బాగానే ఆడింది. ఆ తరువాతి సంవత్సరం రాఘవేంద్ర సినిమా వచ్చింది.

రాఘవేంద్ర(2003)

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను తెరకెక్కించిన సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాఘవేంద్ర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అయింది. అయితే ఈ సినిమా ప్రభాస్‌కు చాలా ప్లస్ అయింది. రాఘవేంద్ర చిత్రంలో ప్రభాస్ షర్ట్ లేని సీన్స్ చాలానే ఉన్నాయి. దీంతో ఆయన కటౌట్‌కు ఉన్న క్యాలీబర్ బయటపడింది. ఆ సమయంలో మీడియా పత్రికలు సరైన కథ, ఆయన కటౌట్‌ను ఉపయోగించుకునే డైరెక్టర్ వస్తే ప్రభాస్ రేంజ్ మారిపోతుంది అని రాసుకొచ్చాయి.

వర్షం(2004)

వర్షం చిత్రంతో ముచ్చటగా మూడోసారి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ‘వర్షం’ కురిపించాడు. ప్రభాస్‌లో ఉన్న మాస్ కోణాన్ని వాడుకోవడంతో డైరెక్టర్ శోభన్ కొంత మేరా విజయం సాధించారు. వరుసగా రెండు సినిమాలు ప్లాఫ్ అవడంతో వర్షం సినిమా కూడా పోతుందేమో అని ప్రభాస్ చాలా సార్లు భయపడ్డారట. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా చెప్పారు. వర్షం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు ప్రభాస్. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నా దాన్ని రోమాంటిక్ డ్రామాగానే ప్రేక్షకులు ఆదరించారు. అప్పటి వరకు.. ప్రభాస్ కెరియర్‌లో వర్షం బ్లాక్ బస్టర్ హిట్. దాంతో ఆయనకు పరిశ్రమలో రాణించగలం అనే నమ్మకం ఏర్పడిందట.

అడవిరాముడు(2004)

సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి కమర్షల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన బి గోపాల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం అడవి రాముడు. వర్షం హిట్ తరువాత ప్రభాస్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. దాంతో అడవిరాముడు చిత్రం కనెక్ట్ కాలేదు. దాంతో ఈ చిత్రం సైతం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మళ్లీ ప్రభాస్‌ను వెనక్కి లాగినట్లు అయింది. అయినా సరే అధైర్యపడలేదు. ఎలాగో ఫ్యామిలీ ఆడియెన్స్ దగ్గరయ్యాను అనే కాన్ఫిడెన్స్‌తో చక్రం సినిమా చేశారు.

చక్రం(2005)

క్రియేటీవ్ దర్శకుడు కృష్ణవంశి తెరకెక్కించిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం చక్రం సైతం అంతగా రుచించలేదు. దాంతో ప్రభాస్ కెరియర్‌పై ప్రభావం పడింది. అయితే అప్పటికే దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమాకు సైన్ చేశాడు. దాదాపు ఆ చిత్రం షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధం అయింది. ఆ చిత్రంపైనే ప్రభాస్ అన్ని ఆశలు పెట్టుకున్నారు. అదే ఛత్రపతి మూవీ.

ఛత్రపతి(2005)

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరియర్‌కు పునర్జన్మ అంటే అతిశయోక్తి కాదు. అప్పటి వరకు దాగి ఉన్న ప్రభాస్‌లోని మాస్ కటౌట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు రాజమౌళి. వెండితెరపై ప్రభాస్ నడిచివస్తుంటే విజిల్స్ పడ్డాయి. పిడికిలి బిగిస్తే చప్పట్లు మోగాయి. భారీ యాక్షన్ సీన్స్ సైతం అలవోకగా చేసి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు అని నిరుపించుకున్నారు ప్రభాస్. ఇక ఛత్రపతి కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఆయన కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఉన్న వర్షం చిత్రాన్ని భారీ కలెక్షన్లతో అలా పక్కకు జరిపింది. ఈ మూవీతో అటు మాస్, ఇటు క్లాస్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇటు మాస్ ఆడియెన్స్ అందరిని ఫిదా చేశాడు.

తరువాత డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష, చార్మి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పౌర్ణమి(2006). ఛత్రపతి చిత్రం తరువాత ప్రభాస్‌కు వచ్చిన మాస్ ఇమేజ్ ముందు ఈ చిత్రం నిలబడలేదు. ఆ తరువాత అమ్మ సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రం యోగి(2007). మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని హంగులు ఉన్నా యోగి బాక్స్ ఆఫీస్ వద్ద చతికీలా పడింది. ఆ తరువాత నాన్నపై రివెంజ్ బ్యాగ్‌డ్రాఫ్‌లో వచ్చిన మరో వినుత్నమైన చిత్రం మున్నా. వంశి పైడిపల్లి దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ స్టైలిష్ చిత్రం సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత డైనమిక్ దర్శకుడు పూరి దర్శకత్వంలో బుజ్జిగాడు(2008) కూడా ప్రభాస్‌కు విజయాన్ని తీసుకురాలేదు. అదే వరుసరలో బిల్లా(2009) ప్లాఫ్. పూరి దర్శకత్వంలో మరో ప్రయత్నంగా వచ్చిన ఏక్ నిరంజన్(2009) బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. వరుసగా ఆరు ప్లాఫ్‌లు ఆవరించినా చలించని హీరో ప్రభాస్.

చిత్రాలు అయితే పెద్దగా ఆడడం లేదు కానీ అభిమానఘనం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆ తరువాత పూర్తి క్లాస్ టచ్‌తో వచ్చిన చిత్రం డార్లింగ్. ఏ కరుణాకర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన డార్లింగ్ చిత్రం ప్రేక్షకుల మనుసులను దోచుకుంది. డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుచుకోవడం అలవాటు అయింది. దాంతో అందరూ ప్రభాస్‌తో లవ్‌లో పడ్డారు.

మిస్టర్ ఫర్ఫెక్ట్(2011)

డార్లింగ్ చిత్రం ఇచ్చిన బలంతో మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రంతో మెప్పించారు. ఆ తరువాత కాస్త రూట్ మార్చి మాస్ టచ్ చేస్తూ.. డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించిన రెబల్(2012) మూవీ మళ్లీ బ్యాక్‌ఫైర్ అయింది. కానీ ఆ చిత్రంలో ప్రభాస్ స్టైల్, ఆ స్వాగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సమయంలో రైటర్ కొరటాల శివ చెప్పిన కథ నచ్చి మిర్చి సినిమా చేశారు. 2013లో వచ్చిన మిర్చి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘాటైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళితో మరో సినిమాను ప్రకటించారు. ఆ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవు. ప్రకటన చేసి 2 సంవత్సరాలు అయినా, మూడు సంవత్సరాలు అయినా బాహుబలి రాకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహపడ్డారు. ఆ సమయంలో బహుబలి విడుదలైంది. భారత దేశ సినిమా చరిత్రలో బాహుబలి కొత్త శఖానికి నాంది పలికింది.

సినిమాకు అవధులు లేవు అంటూ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్రాలు కాదు అంతా భారతీయ సినిమా పాన్ ఇండియా సినిమా అంటూ బహుబలి చిత్రాన్ని విడుదల చేసి మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు హీరో రెబల్ స్టార్ ప్రభాస్. అప్పటి వరకు వినని బడ్జెట్‌తో చిత్రాన్ని రూపోందించి, కలలో కూడా చూడని కలెక్షన్ల నెంబర్లను బాక్స్ ఆఫీస్ నుంచి రాబట్టారు. తెలుగు పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సినిమాలు బహుబలి1(2015), బహుబలి2(2017). ఇక ప్రభాస్ పేరే చరిత్ర అవుతున్న తరుణంలో సాహో(2019), రాధేశ్యామ్(2022), ఆదిపురుష్(2023) చిత్రాలు నిరాశ పరిచాయి.

శిఖరం ఎప్పుడు ఎవరి ముందు తలవంచదు, ప్రతీకూలపరిస్థితులకు భయపడదు అన్నట్లు ప్రభాస్ ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. అలా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్(2023) చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మరో అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కల్కి(2024) చిత్రంతో వెయ్యికోట్ల క్లబ్ దాటి మరో సారి బాక్స్ ఆఫీస్ మొగుడు అని నిరుపించుకున్నాడు. ప్రస్తుతం సలార్ 2, కల్కి 2 చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సలార్, హనురాఘవ పూడి దర్శకత్వంలో మరో సినిమాలు లైనప్ చేశారు.

కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ కామ్‌గా ఒక యోగిలా తన పని చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టే ప్రభాస్ నేడు ది వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా స్టార్ అయ్యారు.