Rajamouli The Blockbuster Director
ఎస్ఎస్ రాజమౌళి ది బ్లాక్ బస్టర్ డైరెక్టర్
తెలుగు సినిమా పరిధిని పెంచి, కళకు ఎల్లలు లేవంటూ తెలుగు గౌరవాన్ని ఖండంతరాలు దాటించిన ఘనుడు.. ఆయన తెరకెక్కించిన సిినిమాలతో హాలీవుడ్ ప్రేక్షకులనే ఆశ్చర్యపడేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రతీ తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే పేరు ఎస్ఎస్ రాజమౌళి. చిత్రసీమే ఆయన చరిత్రను రాసుకునే స్థాయికి ఎదిగిని రాజమౌళి ప్రయాణం పూలబాట కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాడు. కుటుంబం అంతా సినిమా నేపథ్యమే అయినప్పటికీ ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు సినిమా అనే శిఖరాగ్రానా ఠివీగా నిల్చొని ఉన్నాడు. చెమట చుక్కలను చిందించేవాడి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది అని మరోసారి రుజువు చేశారు.
రాజమౌళి సినిమా ప్రస్థానం ఓ సక్సెస్ సినిమా జర్నీ అంత కిక్కు ఉంటుంది. తండ్రి కోడూరి విజయేంద్ర ప్రసాద్. తెలుగు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా అద్భుతమైన రచనలు అందించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు ఆయనే రచయితగా ఉన్నారు. చిన్నతనం నుంచి ఇంట్లో సినిమా వాతావరణం ఉండడంతో రాజమౌళికి ఫిల్మ్ మేకింగ్‌పై మక్కువ పెరిగింది. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిమొదలు పెట్టారు. అలాంటి సమయంలో తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్నశాంతినివాసం సీరియల్‌కు దర్శకత్వం వహించారు. అక్కడే రాజమౌళి ప్రతిభ చూసిన రాఘవేంద్రరావు స్టూడెంట్ నెం.1 సినిమా చేసే అవకాశం ఇచ్చారు.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెం.1 చిత్రంతో తన విజయ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తరువాత మళ్లీ ఎన్టీఆర్ హీరోగా ‘సింహాద్రి’ తెరకెక్కించి ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్లోని ఊరమాస్‌ని వెండితెరకు పరిచయం చేశారు. ఆ తరువాత ‘సై’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని రగ్బి ఆటతో వెండితెరపై మాయ చేశారు. ఈ చిత్రంతో కాలేజీ కుర్రాలకు దగ్గరయ్యాడు. ఆ తరువాత ప్రభాస్ కటౌట్‌ను సరిగ్గా వాడుకొని తల్లి సెంటిమెంట్‌తో ‘ఛత్రపతి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసే కలెక్షన్లను రాబట్టారు. ఆ తరువాత మాస్ మహారజ రవితేజ డుయల్ రోల్‌తో విక్రమార్కుడు తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ బొమ్మ ఇచ్చారు.
సోషియో ఫ్యాంటసీ కథాంశంతో ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్ని చూపించారు. యమదొంగ చిత్రంతో యమలోకంలో భూకంపం పుట్టించాడు. అదే తరహాలో తెలుగు సినిమా చరిత్రలో కొత్త శకాన్ని ఆరంభిస్తూ రామ్ చరణ్ హీరోగా ‘మగధీర’ తీర్చిదిద్దారు. వెంటనే మళ్లీ భారీ బడ్జెట్ జోలికి వెళ్లకుండా సేఫ్‌గా ఓ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించారు. సునిల్ హీరోగా ‘మర్యాద రామన్నతో యాక్షన్ సినిమా వసుళ్లను సాధించాడు. ఇక్కడే రాజమౌళి ఆలోచనలకు పదును పెట్టారు. ఎవరు టచ్ చేయని పాయింట్‌తో ఈగను హీరోగా పెట్టి ‘ఈగ’ చిత్రాన్ని అందించారు. అది తెలుగు చరిత్రలో మాస్టర్ పీస్‌లా మిగిలిపోయింది.
వెంటనే బిగ్గెస్ట్ ఇండియన్ సినిమాలు అయినా ‘బహుబలి బిగినింగ్’, ‘బహుబలి కన్ క్లూజన్ సినిమా చరిత్రను తిరగరాశాడు. హాలీవుడ్ ప్రేక్షకులతో నిరాజనాలు అందుకున్నారు. ఆ తరువాత ఫిక్షనల్ పిరియాడికల్ డ్రామా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని ఒకే సినిమాతో గ్లోబల్ స్టార్‌ను చేశారు. ఆస్కార్ అవార్డునే కాదు ప్రపంచమే గొప్ప దర్శకులుగా కీర్తించే స్పిల్ బర్గ్, జేమ్స్ కేమరూన్లు సైతం రాజమౌళి విజన్‌కు సలాం కొట్టారు. ఇప్పుడు మహేష్‌తో మరో గ్లోబల్ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్ ఎస్ రాజమౌళి ఈ పేరును తెలుగు చిత్రసీమ పచ్చబొట్టు వేసుకుంటుంది. నిజంగా ఆయన తెలుగు నేలపై జన్మించడం మనకు గర్వకారణం. ఆయన సినిమా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పతాకం రెపరెపలాడుతుంది.