Remembering Memories Of SPB
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ మధుర జ్ఞాపకం
సంగీతా పిపాసి, గానగంధర్వ ఎస్పీబి తెలియని తెలుగు సంగీత ప్రియుడు లేరు. దాదాపు 54 ఏళ్ళు సంగీత తారగా వెలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. శాస్త్రీయ సంగీతం నుంచి జానపదుల వరకూ, లలిత సంగీతం నుంచి రాక్, బ్రేక్, వంటి ఎన్నో సంగీత విన్యాసాలను అలవోకగా ఆకలింపజేసుకొని సునాయాసంగా ప్రదర్శించే ప్రతిభా వంతుడు. ఎస్పీబీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత అంతేకాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడి.. పాటతో సుదీర్ఘప్రయాణం చేసిన మహోన్నతమైన వ్యక్తి. వృద్దాప్యానికి తోడు కోవిడ్ కారణంగా తన 74వ ఏట సెప్టెంబర్ 25, 2020 చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కళారంగానికి ఆయన చేసిన సేవను స్మరించుకుందాం.
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. పాటతో ఏర్పడిన బంధం, స్కూల్, కాలేజీ రోజుల్లో బలపడింది. వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుస్తూ.. సినిమాల్లో పాడాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా 1966లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో “ఏమి ఈ వింత మోహం” అనే పాటతో ఆయన సినీపాట ప్రాస్థానం ప్రారంభమైంది. ఈ చిత్రానికి కోదండపాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలో బాలును ఎంతో ప్రోత్సహించాడు. ఆ భక్తితో బాలు నిర్మించిన ఆడియో ల్యాబ్ కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని పేరే పెట్టారు. బాలుకు మొదట్లో బాగా పేరుతెచ్చిన పాటలు..” రావమ్మా మహాలక్ష్మి రావమ్మా”(ఉండమ్మా బొట్టు పెడతా), ” ఏ దివిలో విరిసిన పారిజాతమో ” (కన్నె వయసు), ” మేడంటే మేడాకాదూ ” (సుఖః దుఃఖాలు) ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి.
మాస్ట్రో ఇళయ రాజా సారథ్యంలో ” వే వేల గొపెమ్మలా ”, ” వేదం అణువణువున”, “తకిట తధిమి తకిట తధిమి తందాన ” వంటి పాటలు మోరుగాంచాయి. ఎస్పీబి కి ఉన్న మరో అద్భుతమైన ప్రతిభ అనుకరణ. ఆ మిమిక్రి నేపుణ్యంతో ఎంతో మంది నటుల గొంతుకు అతికేలా ఎన్నో పాటలు పాడారు. అన్ని సంవత్సరాలుగా ఆయన పాట బోరుకొట్టకపోవడానికి కారణం ఆయన మాయా గొంతే కారణం అని చెప్పవచ్చు. లెజండరీ సంగీత దర్శకులు నుంచి యువ సంగీత దర్శకుల వరకు అందరికి పాడిన ఘనత ఎస్పీబీదే. ఆయన సినీ ప్రస్థానంలో11 భాషలలో 40 వేల పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన పనిచేసిన విభాగాలలో 29 సార్లు నంది అవార్డు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎస్పీబీ లాంటి గానగంధర్వుడు మళ్లీ పుట్టడు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఆయన పాడిన ప్రతీ పాటలో ఆయన జీవిస్తూనే ఉంటాడు. ఈ సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున నివాళ్లు అర్పిస్తున్నాము.