Revu Movie Pre Release Event – Tel
రేవు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘రేవు’ చిత్రాన్ని చూసి నేను రివ్యూ రాస్తా – ప్రముఖ నిర్మాత దిల్ రాజు
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తూనే ఉంటారు. కానీ 99 శాతం ఫెయిల్యూర్.. వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారు. కానీ ప్రభు, పర్వతనేని రాంబాబు వంటి వారు ఉండటం వల్లే మేం అంతా ఇక్కడకు వచ్చాం. ఇలాంటి సినిమాను తీయడం గొప్ప కాదు.. ప్రేక్షకుడ్ని థియేటర్ వరకు తీసుకు రావడం గొప్ప విషయం. రేవు కాన్సెప్ట్ బాగుంది. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమాను తీశారు. కాబట్టి వీళ్ళ సినిమాని చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు.
దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘మురళీ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. రేవు చిత్రాన్ని చూసి ఆయన కొన్నారు. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘సినిమాను నేను చూశాను. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆ టైంలోనే ఎన్నారై నిర్మాత మురళీ గారు పరిచయం అయ్యారు. వారు కూడా ఈ సినిమాను చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే, ఉన్న పరిమితులతో ఎంత అద్భుతంగా సినిమాను తీయవచ్చు అనే దానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. డైరెక్టర్ హరినాథ్ అందరి వద్ద నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు. సెన్సార్ వాళ్లు కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు.
నిర్మాత మురళీ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని నాకు రాంబాబు గారు, ప్రభు గారు చూపించారు. ఇంత మంచి చిత్రాన్ని నాకు చూపించిన వారికి థాంక్స్. వారి వల్లే నా ఈ సినీ జర్నీ మొదలైంది. రేవు సినిమాలోని ప్రతీ పాత్ర ఆడియెన్స్‌తో పాటుగా ఇంట్లోకి వెళ్తుంది. మా సినిమాను రామ సత్యనారాయణ గారు చూశారు. ఆయనకు చాలా నచ్చింది. డీఎస్ రావు గారు కూడా మా మూవీని చూసి మెచ్చుకున్నారు. మేం అడిగిన వెంటనే మాకోసం వచ్చిన కోదండ రామిరెడ్డి గారికి థాంక్స్. రేలంగి నరసింహారావు ఎన్నో హిట్ చిత్రాలను ఇచ్చారు. అలాంటి దర్శకుడు మా ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. మా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఆగస్ట్ 23న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించండి’ అని అన్నారు.
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం చిన్న చిత్రాలు హిట్ అవుతున్నాయి. గత వారం కమిటీ కుర్రోళ్లు, ఈ వారం ఆయ్ హిట్ అయింది. వచ్చే వారం రేవు ఆడుతుంది. పర్వతనేని రాంబాబు, ప్రభు చాలా క్వాలిటీ ఉన్న చిత్రాన్ని తీసుకున్నారు. దిల్ రాజు, ఏసియన్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతోంది. చాలా గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మంచి చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు వల్లే ఇంత మంది గెస్టులుగా వచ్చారు. రేవు చూస్తుంటే.. రంగస్థలం చూసినట్టుగా అనిపించింది. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుందనిపిస్తుంది’ అని అన్నారు.
దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్రభు, రాంబాబు గారు ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ల జడ్జ్మెంట్ కరెక్ట్‌గానే ఉంటుంది. మా రామ సత్యనారాయణ సినిమా చూశారు. మూవీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
భరత్ భూషణ్ మాట్లాడుతూ.. ‘రేవు ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డీఎస్ రావు మాట్లాడుతూ.. ‘రేవు కథను తీసుకోవడమే ఒక ఛాలెంజ్. మత్స్యకారుల జీవితం మీద తీసిన ఈ చిత్రానికి ఇంత మంది సపోర్ట్ లభించడం ఆనందంగా ఉంది. మురళీ గారు ఈ సినిమాను ఎంతో ధైర్యంతో ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది చాలా డిఫరెంట్ చిత్రం. ఈ సినిమాకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ.. ‘రేవు లాంటి కథను తీసుకున్న మురళీ గారు, రాంబాబు గారు, ప్రభు గారు థాంక్స్. మంచి చిత్రాలు ఈ మధ్య ఆడియెన్స్ వరకు రీచ్ అవ్వడం లేదు. ఇలాంటి సినిమాను ప్రభు గారు, రాంబాబు గారు తీసుకున్నారంటే కచ్చితంగా హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. కొత్త వాళ్లంతా కలిసి అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నటీనటుల నుంచి దర్శకుడు మంచి నటనను రాబట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. ‘రేవు సినిమాలో అందరూ అద్భుతంగా నటించారని అనిపిస్తోంది. డైరెక్టర్ గారు తీసిన విధానం, పాటలు రాసిన విధానం, కెమెరా మెన్ పెట్టిన షాట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని’ అన్నారు.