Safety Of Women In Film Industry
ఇండస్ట్రీలో స్త్రీని కాపాడుకుందాం.
సుకుమారమైన మనసుతో పాటు సున్నితమైన దేహం గల మూర్తి స్త్రీ. అలాంటి మహిళ కొందరి స్త్రీలోలుల చేతుల్లో నలుగుతుంది. తన స్వేచ్చను.. విచ్చలవిడితనం అనుకునే వికృత మనుషుల మధ్య లైంగిక వేదింపులకు గురి అవుతుంది. అయితే ప్రతీ చోటా, ప్రతీ ఇండస్ట్రీలో అమ్మాయిలు లైంగిక వేదింపులను ఎదుర్కొంటున్నారు. కానీ మీడియా ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీపైనే టార్చ్ వేస్తుంది ఎందుకంటే.. ఇక్కడి వ్యక్తులు అంటే అందరికీ ఆసక్తి, వీరిపై న్యూస్ రాస్తే ఎక్కువ సేల్ ఉంటుంది. ఈ సెన్సిటీవ్ టాపిక్ పైనా గంటల తరబడి డిబెట్లు పెట్టవచ్చు. అయితే కేవలం టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే కాకుండా, దీనికి వెనుక మంచి ఆలోచనా ఉండోచ్చు. కానీ ఒక ఘటన జరిగాక తర్జనాబర్జనా పడే బదులు ఇలాంటి దారుణాల నుంచి అమ్మాయిలకు రక్షణ ఏంటీ అనేది చర్చించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి పని చేసే ప్రతీ చోట ఈ ఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. కాసేపు ఇతర పరిశ్రమల గురించి పక్కన పెట్టి సినిమా పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే.. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ఇండస్ట్రీలో దుమారాన్ని రేపాయి.
తాజాగా ఓ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేదింపుల కేసు సంచలనాత్మకంగా మారింది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ తనను 5 సంవత్సరాల నుంచి లైంగికంగా, శరీరంగా వేదిస్తున్నాడు అని, అనేసార్లు అత్యాచారం కూడా చేశాడు అని చెప్పుకొచ్చింది. తన వయస్సు 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ అమానుషం జరుగుతుందని, లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఒక నటీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి తన గొంతు వినిపించింది. ఇదే తరహాలోనే మలయాళ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ 2017 నుంచి తాను చిత్ర పరిశ్రమలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయట పెట్టింది. మాలివుడ్ లో స్టార్ హీరోగా పేరున్న వ్యక్తి.. తాను పెట్టిన కేసులో అరెస్టు అయి ఊచలు లెక్కపెడుతున్నారు. దాని తరువాత అక్కడి గవర్నమెంట్ ఇండస్ట్రీలో మహిళల మీద జరిగిన లైంగిదాడులపై ‘హేమా కమిటీ’ నియమించింది. ఆ రిపోర్టులో ఎన్నో లైంగిక దాడులకు సంబంధంచిన సంఘటనలు పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. ఈ మధ్యే తెలుగులో కూడా ‘వాయిస్ ఆఫ్ విమెన్’ పేరుతో బాధిత హీరోయిన్స్, ఇతర మహిళా నటులు ఏకం అవుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు.
అలాగే తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ రైటర్ పై ఓ సింగర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. టీవీలలో, పేపర్లలో చర్చసాగింది కానీ, కొంత కాలానికి సమస్య సమసిపోయింది. హిందీ పరిశ్రమలో కూడా ఈ తరహా ఆరోపణలు వచ్చాయి కానీ ఎక్కడా ఏ ఆడపిల్లకు రక్షణ కల్పించలేకపోయారు. ఎవరైనా బాధిత మహిళ బాధ బరించ లేక తెగించే మీడియా ముందుకు వస్తే తప్ప దీనిపై చర్చించరు. ఒక వేళా చర్చ పెట్టిన తన గురించే మాట్లాడుతారు తప్ప పరిశ్రమలో భూతంలా వెంటాడుతున్న వేదింపులపై చర్చ పెట్టరు. ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పరు. పరిశ్రమలో మహిళలపై ఆగడాలను ఎలా అరికట్టాలో ఓ డిస్కషన్ పెట్టరు. అసలు దీనికి రూట్ కాజ్ ఎక్కడా, దాన్ని ఎలా ఓవర్ కమ్ చేయాలి అనే విషయాలపై ఇంత వరకు ఎవరు దృష్టి పెట్టకపోవడం బాధాకరం.
పని చేసే అన్ని విభాగాల్లో ఆడా, మగా అనే తేడా లేకుండా కలిసి, ఆలోచనలు పంచుకునే పరిశ్రమ సినిమా పరిశ్రమ. ఇక్కడికి చాలా మంది తమకు ఉన్న కళను నిరూపించుకోవాలని పరిశ్రమకు వస్తారు. అవకాశం కోసం చూస్తారు. అయితే.. ఒకరి అవసరం వీరికి అవకాశం. అది సినిమాకు అవసరం అయితే ఎవరికీ ఏ ప్రాబ్లమ్ లేదు, కానీ అతని వ్యక్తిగత అవసరం అయితేనే సమస్య. ముఖ్యంగా పరిశ్రమలో పనిచేసే చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్ కాదు. తక్కువ చదువుకొని వస్తారు. అంతే కాకుండా చిన్న వయస్సులో వస్తారు. ఈ బాధిత అమ్మాయి కూడా తెలిసీ, తెలియని 16 ఏళ్లకే పరిశ్రమకు వచ్చింది. అలాంటి సమయంలో వారి చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తమ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా ఎవరికి చెప్పుకోలేరు. దీనికి రెండు కారణాలు ఉంటాయి.
ఎవరికి చెప్పాలో, ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు, రెండోది బయటకు వచ్చి చెబితే వారికి అవకాశాలు ఎక్కడ రాకుండా పోతాయో, ఆర్థికంగా రోడ్డుమీద పడుతామేమో అని భయం. మరి వీటి నుంచి లేడీ ఆర్టిస్టులు బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. దీనిపై చాలా మంది ప్రముఖులు మాట్లాడారు, పత్రికలు రాశాయి కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. అయితే మాకు ఉన్న పరిజ్ఞానంతో, ఈ ప్రాబ్లమ్ గురించి అర్థం చేసుకొని ఒక ఆలోచనను మీతో పంచుకోవాలను కుంటున్నాము. డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయితే ఆ షిప్ ఓనర్ ప్రొడ్యూసర్. అందుకే సిినిమాలను నిర్మించే ప్రతీ నిర్మాత దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో మాట్లాడి, ఒక ప్రత్యేక గ్రిల్ ఏర్పాటు చేయాలి. ఎవర్నస్ ఆఫ్ విమెన్ ప్రొటెక్షన్ లాంటి విభాగాలను నిర్మించాలి. దాని ద్వారా మహిళా ఆర్టిస్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఎవరితో ఎలా మెలగాలో చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో కేవలం తెలుగువారే లేరు.. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లేడీ ఆర్టిస్టులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే షూటింగ్ జరిగే లోకేషన్స్ లో ఒక విజిలెన్స్ ఆఫిసర్ పర్యవేక్షణ ఉండాలి. దీని కోసం నిర్మాత ప్రతీ లేడీ ఆర్టిస్టుపైనా వారి వారి హోదాను బట్టి ఆ గ్రిల్ లో ఫీజు కింద కట్టాలి.
అలా జమ అయినా డబ్బులను ఆ సంస్థం ఖర్చులు పోగా మిగిలినా డబ్బును బ్యాంకుల్లో ఎఫ్ డీ కింద జమ చేసి, మహిళా ఆర్టిస్టులకు భరోసా కింద ఇవ్వాలి. అలా చేస్తే ఏ మహిళా కూడా అరాచకాన్ని భరిస్తూ కూర్చొదు. ధైర్యంగా తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతుంది. దీనికోసం యాంటీ సెక్సువల్ హరాజ్ మెంట్ లాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో కమిటీ సభ్యులను నియమించి పరిశ్రమలో జరుగుతున్న పరిస్థితులను, మహిళల సమస్యల పట్ల మానెటిరింగ్ చేయాలి. అలా అయితే అమ్మాలకు ఒక కమిటీ ఉందన్న ధైర్యం ఉంటుంది. అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్‌ను మీడియలో చర్చ అవకముందే నిజనిజాలు ఏంటో తెలుసుకొని ఆపై కేసును పోలీసులు, న్యాయస్థానం దృష్టి తీసుకెల్తే ఇంత జగడం ఉండదు. నిజాలేంటో తెలియకుండా వారి ఫోటోలతో సహా రచ్చకీడ్చే పరిస్థితి రాదు.
ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు పరిశ్రమలో ధైర్యంగా అడుగు పెడుతున్నారు. ఈ లాంటి సంఘటనలు వారిని వెనక్కు పోయేలా చేస్తాయి.. లేదా కొత్తగా వచ్చే ఆడపిల్లలు ఇలాంటి వాటికి సిద్దపడి మాత్రమే ఇండస్ట్రీకి రావాలనే సంకేతాలు ఇస్తాయి. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు. సినిమా పరిశ్రమలో తమ ట్యాలెంట్‌తో స్వేచ్చగా పనిచేసుకోగలం అనే నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. పరిశ్రమలో మహిళలు బాగుంటారు.