Reading Time: 2 mins

Same Story 6 Movies-Tel

ఒకే కథ – ఆరు చిత్రాలు

ఇది క్రియేటీవ్ ఫీల్డ్. ఒకే కథను మళ్లీ మళ్లీ చెబితే ఎవరూ చూడరు అనేది నిజం. కానీ ఒకే కథతో ఏకంగా ఆరు సినిమాలు తీశారంటే ఆశ్చర్యపోవడం మనవంతు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా 1953లో బ్రతుకుతెరువు అనే సినిమా వచ్చింది. జీవనోపాది అనే నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించారు. భాస్కర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కోవెలముడి భాస్కర్ రావు నిర్మాణ సారథ్యంలో పీ.ఎస్ రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించారు. దీనికి ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చారు. చక్కటి డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ప్రేక్షకులను అలరించింది.

తెలుగు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన బ్రతుకుతెరువు చిత్రాన్ని బలే రామన్(Bale Raman) పేరుతో 1956లో తమిళ్‌లో డబ్బింగ్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ డబ్బింగ్ అయిన పది సంవత్సరాల తరువాత 1966లో కన్నడ భాషలో బడుకువ దారి (Badukuva Daari) పేరుతో రీమేక్ అయింది. జయలలిత, కల్యాణ్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ సైతం సూపర్ హిట్ అయింది. ఆ తరువాత బ్రతుకుతెరువు కథను హిందీలో జీనే కి రాహ్(Jeene Ki Raah) పేరుతో 1969లో రీమేక్ చేశారు. జితేంద్ర, తనుజ హీరోహీరోయిన్లుగా ఈ చిత్రాన్ని ఎల్.వీ ప్రసాద్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే తమిళంలో నాగేశ్వరరావు, సావిత్రిలు నటించిన బ్రతుకుతెరువు చిత్రాన్ని బలే రామన్ పేరుతో డబ్బింగ్ చేసినప్పటికీ ఇదే చిత్రాన్ని 1972లో రీమేక్ చేశారు. ఎంజీ రామచంద్రన్, కే ర్ విజయ, కాంచన ప్రధాన పాత్రలతో నాన్ ఎన్ పిరందెన్(Naan Yen Pirandhen) పేరుతో దర్శకుడు ఎమ్ కృష్ణన్ తెరకెక్కించారు. అలా బ్రతుకుతెరువు అనే కథ ఇన్ని భాషల్లో విజయాన్ని దక్కించుకుంది. ఇక్కడే మరో విశేషం జరిగింది. ఎల్. వీ ప్రసాద్ తెరకెక్కించిన జీనే కి రాహ్ అనే చిత్రాన్ని, దీనికి మూల కథ అయిన బ్రతుకుతెరువు చిత్రాలను స్పూర్తిగా తీసుకొని తెలుగులో భార్యబిడ్డలు అనే చిత్రాన్ని రూపోందించారు. ఈ చిత్రానికి రచయితగా ఎల్. వీ ప్రసాద్ పనిచేశారు.

ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఏ.వీ సుబ్బారావు నిర్యాతగా, టీ రామరావు దర్శకత్వం వహించారు. బ్రతుకుతెరువు చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన భార్యబిడ్డలు చిత్రంలో నాగేశ్వరరావు హీరో కాగా జయలలిత హీరోయిన్‌గా నటించారు. 1972లో వచ్చిన భార్యబిడ్డలు చిత్రానికి కే.వీ మహాదేవన్ సంగితాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించి హిట్ చేశారు.