Reading Time: < 1 min

Saripodhaa Shanivaaram Music Director Jakes Bejoy

సరిపోదా శనివారం మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజాయ్

జేక్స్ బెజోయ్ సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆయన పేరు తెలియక పోవచ్చు కానీ ఆయన చేసిన పాటలు చెబితే ఇట్టే గుర్తుపడుతారు. ‘టాక్సీవాల’ చిత్రంలో మాటే వినదుగా పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తరువాత ‘చావు కబురు చల్లగా’, ‘పక్కా కమర్షల్’ వంటి చిత్రాలకు పని చేశారు. కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాకు పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. ఇక సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారో చూడాలి.

జేక్స్ బెజోయ్ అన్ని భాషా చిత్రాలలో పనిచేస్తున్నప్పటికీ ప్రధానంగా మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 2014లో మలయాళంలో వచ్చిన ‘ఏంజల్’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. మలయాళం, తమిళ్, హిందీ, తెలుగులో ఆయన అందించిన ఆల్బమ్స్ అద్భుతమైన హిట్‌ను సాధించాయి.

జేక్స్ బెజోయ్‌కి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఇష్టంతో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. కేరళలో జన్మించిన జేక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ తరువాత యూఎస్‌ఏలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మ్యూజిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. అక్కడ ఉన్నప్పుడే తన ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో గేమ్స్‌కు సంబంధించిన మ్యూజిక్ కంపోజింగ్ చేసేశారు.

2013లో సినిమాల్లో పనిచేయాలని భారత్‌కు తిరిగి వచ్చేశారు. అలా ‘ఏంజల్’ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చే ఆఫర్ వచ్చింది. అలా అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో మాలయాళంలో ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. ఇప్పటి వరకు 54 చిత్రాలకు పైగా పనిచేశారు. ఇంకా విడుదల కావల్సిన చిత్రాలు ఉన్నాయి. శ్రోతలను ఉర్రూతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ ‘సరిపోదా శనివారం’ చిత్రానికి పని చేయడం చాలా సంతోషం అని, ఆయన పాటలు అంటే ఎంతో ఇష్టమని హీరో నాని సైతం చెప్పారు. అన్ని భాషాలతో పాటు తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.