Savithri Birthday Special
మహానటి సావిత్రి బర్త్ డే స్పెషల్
వెండితెరపై మూడు దశాబ్దాలు వెలుగు జిలుగులతో విరాజిల్లి.. నటన, అందం, అభినయంతో అబాల గోపాలాన్ని అలరించిన మహానటి సావిత్రి. ఆమె ప్రస్థానం సినిమాకు అందమైన టైటిల్స్ అయతే ఆమె జీవిత ప్రయాణం ఓ కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే. ఎన్నో మలుపులు, చిత్ర విచిత్ర సంఘటనలు. వెలుగులు వెదజల్లే ఆమె కళ్లు, వెన్నల లాంటి అందమైన నవ్వు, నెమలి నడకల హోయలు, తీయని తేనెపలుకుల మాట ఆమెను చూస్తే నిండైన తెలుగు తనం ఉట్టిపడేలా ఉంటుంది ఆమె ఆహార్యం. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి సావిత్రి.
తరాలు మారినా తెలుగు చిత్రసీమలో సాటిలేని మేటిగా కీర్తింపబడుతున్న నటి సావిత్రి. నటనలో శిఖరాగ్రానికి చేరిన సావిత్రి అందరిలానే తొలినాళ్లలో కష్టాలు, నిరాశ ఎదుర్కోవలసి వచ్చింది. చిన్నతనం నుంచి నటీ కావాలనే పట్టుదల. సావిత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండల్లం చిర్రావూరులో 1937 డిసెంబర్ 6న జన్మించారు. తాను పుట్టకముందే తండ్రి గురువయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక తన చిన్నతనం అంతా పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఇంటిలోనే జరిగింది. చిన్నతనం నుంచి కళలపైన విపరీతమైన ప్రేమ పెంచుకుంది. తన 13 ఏట ఒక నాటకంలో పాల్గొని హిందీ నటుడు పృథ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. అలా నటనపై ఇష్టంతో 1949లో మద్రాసు చేరి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఎల్ వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం చిత్రం కోసం సావిత్రితో కొన్ని షాట్స్ తీసిన తరువాత మరీ చిన్న పిల్లలా ఉందని తీసేశారు. తరువాత పాతాళబైరవి చిత్రంలో డ్యాన్స్ చేసే ఒక పాత్రలో కనిపించారు. అలా చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగారు. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందారు. అలా ‘పెళ్ళిచేసి చూడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1953 లో ‘దేవదాసు’ చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. పార్వతి పాత్రలో ఆమె చూపించిన అభినయం నేటికి మరుపు రానిది. దీంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 30 ఏళ్ల సినీ జీవితంలో 252 సినిమాల్లో నటించారు.
వెండితెరను ఏలిన సావిత్రి నిజజీవితంలో అనేక ఇబ్బందులు ఎదురకొన్నారు. జెమినీ గణేష్ ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత వారి మధ్య వచ్చిన భిన్నాభిప్రాయాలు సావిత్రిని చీకట్లోకి నెట్టాయి. అదే సమయంలో సినిమాలు నిర్మించి ఆర్థికంగా కొంత నష్టపోయారు. నా అనుకున్న వారు మోసం చేశారు. ఎన్నో దానధర్మాలు చేసిన సావిత్రి తన చివరి రోజుల్లో డబ్బుల కోసం చిన్న చిన్న పాత్రలు వేశారు. ఆత్మాభిమానం కల ఆవిడ ఎవరినీ చేయి చాపి ఆడగలేదు. ఏ సమస్యనైనా ఒంటరిగానే ఎదుర్కొన్నారు. అలా తన సినిమా ప్రస్థానంలా తన జీవిత ప్రస్థానానికి 1981 డిసెంబర్ 26న శుభం కార్డు వేసుకున్నారు. మహానటి సావిత్రి జీవిత కథతో 2018లో తెలుగులో మహానటి అనే సినిమా విడుదలై అందరి ప్రశంసలు పొందింది.