Reading Time: < 1 min

Shopping Mall Movie Completed 14 years

 

షాపింగ్ మాల్ సినిమాకు 14 ఏళ్లు

 

తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో షాపింగ్ మాల్ సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2010లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమిస్తే చిత్రంతో నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ‘షాపింగ్ ‌మాల్‌’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించి హిట్ అందుకున్నారు. తమిళ దర్శకుడు వసంతబాలన్‌ డైరక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మహేష్‌, అంజలి జంటగా నటించిన ఈ సినిమా పాటలు చిరంజీవి చేతుల మీదుగా విడుదలయ్యాయి. ఇక ఈ సినిమాను దీపావళి సందర్భంగా 2010 నవంబర్ 5న విడుదల చేశారు. పెద్ద పెద్ద దుకాణాల్లో పని చేసే సేల్స్‌ గాళ్స్‌, బాయ్స్‌ జీవిత నేపథ్యాల్లో సినిమా సాగుతుంది. దీని మాతృక ‘అంగాడి తెరు’ అనే తమిళ చిత్రం కాగా అది ఇండియన్‌ పనోరమాకి ఎంపికైంది. ఇక ఈ సినిమాకి సంగీతం జీవీ ప్రకాష్‌కుమార్‌, విజయ్‌ ఆంటోని అందించగా మాటలు  శశాంక్‌ వెన్నెలకంటి అందించారు. ఇక ఈ సినిమాకు 14 ఏళ్ళు పూర్తయిన క్రమంలో జీవీ ప్రకాష్ కుమార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ

షాపింగ్ మాల్ సినిమాకి 14 ఏళ్లు పూర్తయ్యాయి. సురేష్ కొండేటి సార్ నిర్మాతగా తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా నా కెరియర్లో అత్యంత ముఖ్యమైన సినిమాల్లో ఒకటి. సినిమా సాంగ్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తు వస్తున్నాయి అని అన్నారు.

ఇక నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ మనం నమ్మి చేసిన సినిమాను ప్రేక్షకులు కూడా నమ్మి హిట్ చేసినప్పుడు వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం. ఆలా నేను నమ్మి, ప్రేక్షకులను కూడా నమ్మేలా చేసి  హిట్ అయిన సినిమా ‘షాపింగ్ మాల్’. ఆ సినిమా వచ్చి నేటికి 14 సంవత్సరాలు అయిన సందర్భంగా నటించిన నటీనటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు, ఆదరించిన ప్రేక్షకులకు, అలాగే ఈ  సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి తరవాత తెలుగు అమ్మాయి అనిపించుకున్న అంజలికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాను తెలుగులో చేస్తున్నప్పుడు నన్ను ప్రోత్సహించి అప్పట్లో ఈ సినిమా తెలుగు పాటలను విడుదల చేసిన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఆయన పేర్కొన్నారు.