Reading Time: < 1 min

Telangana Film Chamber Of Commerce Congratulates Karthikeya 2 Film Unit

 

కార్తికేయ2 చిత్ర యూనిట్‌కు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు

 

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను అందజేసి, అభినందనలు తెలియజేశారు.  2022 సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కార్తికేయ 2’ సినిమాకు గాను,  దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా ‘కార్తికేయ2’ చిత్ర యూనిట్‌కు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున అధ్యక్షులు సునీల్ నారంగ్, గౌరవ కార్యదర్శి కె అనుపమ్ రెడ్డి  అభినందనలు తెలియజేశారు. క్రిందటేడాది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి గాను, ఈ ఏడాది ‘కార్తికేయ2’ చిత్రానికి గాను  నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ వరుసగా రెండు నేషనల్ అవార్డ్స్ అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణంగా ఉందని  అన్నారు. అలాగే ‘కార్తికేయ2’  చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్లకు అభినందనలు తెలియజేశారు.

నిఖిల్ హీరోగా కృష్ణతత్వాన్ని, శ్రీకృష్ణుడి గొప్పదనం తెలియజేసేలా  అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ 2 చిత్రం తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వంలో  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  ఈ సినిమాకు మరో సీక్వెల్ ‘కార్తికేయ 3’ కూడా చిత్ర బృందం ప్రకటించింది.