Reading Time: 2 mins

Telugu Cinema Gandhi Jayanti Special
గాంధీజీతో తెలుగు చిత్రాల అనుబంధం

సత్యం, అహింస గాంధీ చూపిన మార్గాలు. నేటికి చాలా మంది గాంధేయవాదులు వీటినే ప్రమాణాలుగా పాటిస్తున్నారు. నెత్తురు చిందించకుండా దేశానికి స్వాతంత్ర్యం రావాలని కలలు కన్న బాపుజీ, శాంతిని ఉపదేశిస్తూ దేశ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. అలా ఆయనతో పాటు ఎందరో మహానుబావుల కృషితో స్వతంత్ర్య భారత్ ఏర్పాటైంది. ఇక ప్రతీ సంవత్సరం ఆక్టోబర్ 2 న గాంధీ జయంతిని జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటాము కానీ ఆయన చూపిన మార్గాన్ని మరిచిపోతున్నాము. అందుకే గాంధీజీ ఆలోచనలకు రూపం ఇస్తూ, పాట రూపంలోనో, సన్నివేశం రూపంలోనో చిత్రసీమ ఎప్పుడూ ఆయన్ను స్మరిస్తూనే ఉంటుంది. బాపూజీ జయంతి సందర్భంగా సినిమాలో ఆయన ప్రస్థావనాన్ని ఒక సారి చూద్దాం.

రఘుపతి రాఘవ రాజారామ్… పతిత పావన సీతారామ్… ఈశ్వర్ అల్లా తేరో నామ్… సబ్ కో సన్మతి దే భగవాన్.. తులసీదాస్ రాసిన ఈ గీతం ఈ రోజుకీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల్లో కూడా గాంధీజి ప్రతిమ కానీ, ఫోటో కానీ ఆయనకు ఇంపార్టెన్స్ ఉన్నా ఏ సీనులోనైనా ఇదే పాట వినిపిస్తుంది. అలాగే గాంధేయవాదం థీమ్ తో వచ్చిన ‘మహాత్మ’ సినిమాలో ఒక పాటలో “కొంతమంది సొంతపేరు కాదుర గాంధీ.. ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ..” అనే పాటలో ఆయన గురించి చాలా గొప్పగా వర్ణించారు లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి. భారత మాత తలరాత మార్చిన విధాతరా గాంధీ అనే లైన్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ పాట ప్రారంభంలో ‘రఘుపతి రాఘవ రాజారామ్…’ అనే పదాలు వినిపిస్తాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకుముందు 1938లో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో రూపొందిన ‘మాలపిల్ల’ చిత్రంలో బసవరాజు అప్పారావు గాంధీజీపై రాసిన “కుల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితే ఏమి…” అనే పాట అప్పట్లో కొంతమందిని కదిలించింది. 1941లోనే తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ తెరకెక్కింది. హేమలతా ఫిలిమ్స్ పతాకంపై ఎ.కె.చెట్టియార్ దర్శకత్వంలో ‘మహాత్మ గాంధీ’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఆ తరువాత అంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1955లో తెరకెక్కిన దొంగరాముడు చిత్రంలో “భలే తాత మన బాపూజీ.. బాలల తాతా బాపూజీ..” పాట, ‘బడిపంతులు’ చిత్రంలో “భారతమాతకు జేజేలు అనే పాటలో శాంతి దూతగా వెలసిన బాపూ అనే లైన్స్ రూపంలో గాంధీజిని స్మరించుకున్నారు.

‘పవిత్రబంధం’లో “గాంధి పుట్టిన దేశమా.. ఇది నెహ్రు కోరిన సంఘమా అనే పాటలో మహాత్ముని ప్రస్థావన ఉంటుంది. అలాగే గాంధీ పుట్టిన దేశం చిత్రంలోని “గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం” అనే పాట శ్రోతల్ని ఆకట్టుకుంది. ‘మరో ప్రపంచం’ సినిమాలో “మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం అనే పాట ఉంది. అలాగే మేలుకొలుపు చిత్రంలో “చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, ఇది బాపూజీ పిలుపు అనే పాట ఉంది. ‘కోడలు దిద్దిన కాపురం’లోని “నీ ధర్మం, నీ సంఘం అనే పాటలో “సత్యాగ్రహమే సాధనంబుగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ అనే పాట ఉంది. ఇలా అనేక పాటలలో గాంధీజిని స్మరించుకున్నారు.

ఇక తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో మహాత్మాగాంధీ చెప్పిన సత్యం, అహింసలను బేస్ చేసుకొని దాదాగా ఉన్న శంకర్ ఎలా మారాడు అనేది చెప్పారు. ఈ చిత్రంలో చిరంజీవికి గాంధీజి కనిపించే సీన్లు సైతం ఉంటాయి. అంతే కాకుండా తెలుగులో వచ్చిన చాలా సినిమాల్లో ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడానికి గాంధీని అనకుంటున్నావా.. అనే డైలాగ్స్ అయితే లెక్కేలేదు. అలాగే బ్రిటిష్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’ చిత్రం చాలా పేరుగాంచింది. భారతీయ భాషలన్నింటిలో డబ్బింగ్ అయింది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషాల్లో గాంధీ గొప్పతనాన్ని చూపిస్తూ సినిమాలు వచ్చాయి. శాంతిని ఆయుధంగా వాడి యుద్దం గెలింపించిన మహ్మాత్మున్ని తలచుకుంటూ బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున గాంధీజికి 155వ జయంతి శుభాకాంక్షలు.