Telugu Cinema History- 6
తెలుగు సినిమా చరిత్ర 6
1943లో సినిమా పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ముడి ఫిలిం అంటే రీల్ కొరత ఏర్పడింది. దీంతో సినిమాలను పదకొండు వేల అడుగులకు కుదించాల్సి వచ్చింది. అప్పటివరకు మినిమం 18 వేల అడుగుల సినిమాలు తీసేవారు. అంతేకాకుండా లైసెన్స్, పర్మిట్స్ పద్ధతులు రావడంతో చాలా కంపెనీలు మూతపడ్డాయి. దాంతో నిర్మాణ వ్యయం పెరిగింది. తక్కువ సినిమాలు నిర్మాణం జరిగింది. అయితే తక్కువ సినిమాలు విడుదల కావడంతో ఎక్కువ లాభాలు వచ్చాయి. అప్పటివరకు భక్తిరస పాత్రలు చేసిన చిత్తూరు నాగయ్య సొంతంగా రేణుక పిక్చర్స్ ను స్థాపించి భాగ్యలక్ష్మి అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ఇదే సంవత్సరం తొలిసారి అండర్ వాటర్ సన్నివేశాలను చెంచులక్ష్మి సినిమా కోసం చిత్రీకరించారు. ఘంటసాల బలరామయ్య నిర్మించిన గరుడ గర్వభంగం ఇదే సంవత్సరం విడుదలైంది. ఇదే సినిమాను విష్ణు మాయ అనే పేరుతో 1963 లో పునర్నిర్మించారు. ఆ తర్వాత కృష్ణ ప్రేమ, పతిభక్తి, పంతులమ్మ వంటి చిత్రాలు విడుదలయ్యాయి.
1944 లో కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఆనక ఆటుపోటులను ఎదుర్కొంది. ఈ సంవత్సరం కేవలం ఏడు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. 1944లో ప్రతిభ పిక్చర్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య నిర్మాణ దర్శకత్వంలో సీతారామ జననం చిత్రం ద్వారా నాగేశ్వరరావు హీరోగా తెరంగేట్రం చేశారు. అంతకుముందే ధర్మపత్ని అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇదే సంవత్సరం వైవి రావు నిర్మాణ దర్శకత్వంలో తాసిల్దారు చిత్రం విడుదలైంది. ఈ సంవత్సరం విడుదలైన ఏడు చిత్రాలలో తాసిల్దారు చిత్రం మాత్రమే విజయం సాధించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సి ఎస్ ఆర్ నటించారు. ఆయన నటన ఆయన పాడిన పద్యాలకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ వన్స్ మోర్ అంటూ థియేటర్లో గోల చేసేవారు. అక్కడో గమ్మత్తు జరిగేది థియేటర్లో ఎవరైనా పెద్దవారు కూర్చుంటే రీల్ను వెనక్కి తిప్పి సినిమాలోని సీను మళ్ళీ ప్లే చేసేవారట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
1945లో కేవలం ఐదు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. ప్రముఖ నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం మాయాలోకం అనే జానపద చిత్రాన్ని తీసి మంచి విజయాన్ని సాధించారు. ఈ చిత్రం ద్వారా సినిమా నిర్మాణ ఖర్చులను దాదాపు లక్షకు పెంచారు. ఇదే సంవత్సరం దక్షిణ భారతదేశ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక బి.యన్ రెడ్డి స్వర్గసీమ అనే చిత్రాన్ని ఇదే సంవత్సరం నిర్మించారు. ఈ చిత్రం ఆంధ్రాలో 1946లో విడుదలై వాహిని పిక్చర్స్ కు కనక వర్షం కురిపించింది. స్వర్గసీమ చిత్రానికి చిత్తూరు వి నాగయ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ఆంధ్రాలో 200 రోజులు తమిళనాడులో 150 రోజులు, బెంగళూరులోని ఒకే థియేటర్లో 225 రోజులు ఆడి లక్షల్లో వసూలు చేసింది. వియత్నం ఫెస్టివల్లో ప్రదర్శించారు. అంటే విదేశాల్లో ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రం స్వర్గసీమ. ఇదే సంవత్సరం మాయామశ్చీంద్ర విడుదలైంది. 1945లో పాదుక పట్టాభిషేకం నాగభూషణం నిర్మించారు. జయాపిక్చర్స్ వారు వాల్మీకి చిత్రాలు విడుదల చేశారు.