Thaman Birthday Special
ఎస్ ఎస్ తమన్ బర్త్ డే స్పెషల్
సినిమాకు కథ, కథనం ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే ముఖ్యమని అందరికి తెలిసిందే. హీరో ఎలివేషన్ ను రచయిత, దర్శకులు ఎంత బాగా రాసుకున్నా.. సంగీతం తోడవకపోతే ఆ కిక్ రాదు. థియేటర్లో ఆ కిక్ రావాలంటే సంగీత దర్శకుడి ప్రతిభపై ఆధారపరడి ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎందరున్నా తమన్ స్టైలే వేరు. తమన్ ఇచ్చే డ్రమ్స్ సౌండ్ కు థియేటర్లు మారుమోగుతాయి. అఖండ చిత్రంలో తమన్ విశ్వరూపాన్ని తెలుగు ఆడియన్స్ చెవులారా విన్నారు. అతి చిన్న వయస్సులో సంగీత ప్రపంచంలోకి అరంగేట్రం చేసిన తమన్ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
ఎస్ఎస్ తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. అందరికీ తమన్ గా సుపరిచితం. ఈయన కుటుంబం అంతా సినిమాలకు పరిచయం ఉన్నవారే. అయితే వీరి తాతా ఘంటసాల బాలరమయ్య గురించి కొంత మందికి తెలుసు. అక్కినేని నాగేశ్వర రావును సీతారామ జననం అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. బాలరాజు అనే చిత్రాన్ని తెరకెక్కించి మాస్ హీరోను చేశారు. ఎన్నో సినిమాలను నిర్మించి చిత్రసీమకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన తదనంతరం ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. ఆ కుటుంబంలో 1983 నవంబర్ 16 న జన్మించిన తమన్ కు చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ పెరిగింది. దానికి కారణం అమ్మ సావిత్రి గాయని. తండ్రి అశోక్ కుమార్ డ్రమ్స్ ప్లేయర్. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర డ్రమ్స్ వాయించేవారు.
తమన్13 ఏళ్లకే తండ్రిని కోల్పోయాడు. దాంతో చదువుకు స్వస్తి చెప్పి, కుటుంబానికి అండగా ఉండేందుకు డ్రమ్స్ ప్లేయర్ గా కేరీర్ ప్రారంభించారు. తన ప్రతిభ చూసిన మాధవపెద్ది సురేశ్ ‘భైరవద్వీపం’ సినిమాకు డ్రమ్స్ వాయించడానికి తీసుకున్నాడు. తొలి పారితోషికంగా రూ.30 తీసుకున్నారు. ఆ తరువాత సంగీతమే తన ప్రపంచం అయిపోయింది. కఠోరమైన సాధన చేసి తక్కువ కాలంలో రిథమ్ డ్రమ్స్ ప్లేయర్ అయిపోయాడు. రూ.30తో ప్రారంభమైన ఆయన పారితోషికం రోజుకి రూ.3 వేలకు చేరుకుంది. ఆయన డ్రమ్స్ ప్లేయర్ గా రాజ్‌కోటి, మాధవపెద్ది, బాలసుబ్రమణ్యం, గంగై అమరన్, శివమణి వంటి సంగీత దర్శకుల దగ్గర పని చేశారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో సిద్ధార్థ్ స్నేహితుడిగా డ్రమ్స్ వాయించే పాత్ర చేశాడు.
అలా తమన్‌కు 24 ఏళ్లు వచ్చే సరికీ 64 మంది సంగీత దర్శకులతో 900 సినిమాలకు పనిచేశారు. తెలుగు, మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ్, కన్నడ.. ఇలా వివిధ భాషల్లో బెస్ట్ ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో రోజుకు రూ.40 వేలు చార్జ్ చేసేవారు. అలా 2008లో కిక్ సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత వరుసగా అంజనేయులు, శంఖం, జయిభవ వంటి సినిమాలకు పని చేశారు. బృందవనం, రగడ, మిరపకాయ్ వంటి సినిమాలతో మంచి పేరు వచ్చింది. దాంతో తెలుగులో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు. తక్కువ కాలంలోనే 80 కి పైగా చిత్రాలలో పని చేశారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాలకు పనిచేస్తున్నారు. అంతే కాకుండా సూపర్ సింగర్ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ నుంచి బెస్ట్ విషేస్ అందిస్తున్నాము.