Thandel Movie Story Similar Like These Movies
తండేల్ కథ ఈ సినిమాల కథ ఒకటే
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో జీ2 ప్రొడక్షన్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు ముండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. శ్రీకాకుళం తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవితాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. చేపల వేటకు వెళ్లిన కొంతమంది యువకులు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ లోకి ఎంటర్ అవ్వడం పాకిస్తాన్ సైన్యం వారిని పట్టుకుని 14 నెలలు జైల్లో బంధించడం, ఆ తర్వాత ప్రభుత్వం చొరవతో వారు తిరిగి భారతదేశానికి రావడం అనే యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తండేల్ అంటే పడవను నడిపే ప్రధాన నావికుడు. ఈ సినిమాలో రాజు పాత్రలో నాగచైతన్య, రాజు ప్రియురాలు బుజ్జి తల్లి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. పాకిస్తాన్ జైల్లో ఉన్న ప్రియుడు రాజు కోసం బుజ్జి తల్లి పడిన తపన, తనను బయటకు తీసుకురావడం కోసం తాను ఎదుర్కొన్న సమస్యలు చూపిస్తారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. వీరి నడుమ వచ్చే లవ్ సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నట్లు అర్థం అవుతోంది. ఈ స్టోరీ ప్లాట్ వినగానే మనకు 1992లో వచ్చిన రోజా సినిమా గుర్తుకు వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి సైనికుడు రిషి పాత్రలో నటించగా.. మధుబాల రోజా పాత్రలో నటించారు. టెర్రరిస్టుల చేతిలో బందీగా ఉన్న రిషిని విడిపించడానికి రోజా ఏం చేసింది అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి థ్రిల్ ను పంచింది. అందుకే పెద్ద విజయాన్ని సాధించింది.
ఈ రెండు సినిమా స్టోరీ లైన్ ఒకే విధంగా అనిపిస్తున్నాయి. అయితే వీటికి మూలం భారతీయ ఇతిహాసమైన మహాభారతంలో ఉంది. 18 పర్వాలుగా ఉన్న మహాభారతంలో వనపర్వం ప్రస్తావనలో సతీ సావిత్రి కథ గురించి అందరికీ తెలిసిందే. సావిత్రి ఆశ్వాపతిరాజు కుమార్తె. సత్యవంతుడిని పెళ్లి చేసుకోవాలని తండ్రితో చెబుతుంది. నారదుడితో మంతనాలు జరిపిన తండ్రి సత్యవంతుడికి అల్పాయుషు ఉందని, ఆస్తి పోగొట్టుకొని అడవుల్లో జీవిస్తున్నారు అని సావిత్రికి చెబుతాడు. అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తుంది సావిత్రి. ఇద్దరికీ పెళ్లి అవుతుంది. అడవుల్లో కాపురం పెడతారు. సత్యవంతుడి ఆయుషు తీరే రోజు అతడుతో కలిసి సావిత్రి అడవికి వెళుతుంది. అక్కడే యముడు వచ్చి సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్తుంటాడు. ఆ సమయంలో సావిత్రి యముడి వెంటనే వైతరణి నది వరకు వెళ్తుంది. ఈ క్రమంలో పతియే ప్రత్యక్ష దైవం, పతిసేవే అన్నిటికీ మించింది అనే ఎన్నో నీతివంతమైన మాటలతో యముడికి మెప్పించి సత్యవంతుడి ప్రాణాలను తిరిగి దక్కించుకుంటుంది.