Thandel Releasing Along With These Telugu Movies
తండేల్ తో పాటు ఫిబ్రవరిలో విడుదల అవుతున్న సినిమాలు
సంక్రాంతి కానుకగా తెలుగులో మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ అంతంత మాత్రంగానే టాక్ తెచ్చుకున్నా, సంక్రాంతికి వస్తున్నాము సినిమా మాత్రం మంచి విజయాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాత అరకొరా చిన్న సినిమాలు విడుదలైనా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసింది. ఈ నెలలో కూడా చాలానే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో మొదటి వారంలో తండేల్ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రావడానికి ముందే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తమిళ హీరో అజిత్, బ్యూటిఫుల్ హీరోయిన్ త్రిష కలిసి నటించిన చిత్రం పట్టుదల ఈ వారమే విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలను అందుకున్నారు. యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరువాత రోజు ఫిబ్రవరి 7 న నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ చిత్రం విడుదల అవుతుంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో జీ2 నిర్మాణ సంస్థపై బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
తెలుగలో ఈ నెలలో విడుదల అవుతున్న అన్ని సినిమాల్లో తండేల్ మాత్రమే పెద్ద బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఇదే రోజు పూరిజగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఒక పథకం ప్రకారం. వినుత్నమైన ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఇవి మొదటి వారం విడుదల అవుతుండగా, రెండవారం ప్రేమికుల రోజును పురస్కరించుకొని విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన కృష్ణ అండ్ హిల్ లవ్ సినిమాను పేరు మార్చి ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదల చేస్తున్నారు.
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా నటించిన బ్రహ్మ ఆనందం సినిమా సైతం ఫిబ్రవరి 14న విడుదలకు సిద్దంగా ఉంది. ఆ తరువాత ఫిబ్రవరి 21 ధనుష్, ఫిబ్రవరి 26న సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇంకా క్లారిటీ రాలేదు కానీ బెల్లం కొండ సాయి, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న భైరవం సినిమా సైతం ఇదే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇన్ని సినిమాలకు థియేటర్లు ఏమిటన్నది డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఎన్ని సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకొని ముందుకు సాగుతాయో.