Reading Time: 2 mins

Top 1 Movie 2024
టాప్ 1 చిత్రం 2024

సినిమా పరిశ్రమలో ప్రతీ సంవత్సరం వందలాది చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలాగే 2024లో అన్ని భాషల్లో కలిపి 300 కు పైగా చిత్రాలు తెలుగు తెరపైన ప్రదర్శించబడ్డాయి. వాటిలో ఎన్నో చిత్రాలు విజయాన్ని సాధించగా, కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఒక సంవత్సరంలో ఎన్ని చిత్రాలు విడుదలైనా కొన్ని చిత్రాలు మాత్రం మనసుకు దగ్గరగా ఉంటాయి. వాటినే మనం ఎమోషనల్ ఎంగేజ్మెంట్ చిత్రాలు అంటాము. మరి 2024లో ఎమోషనల్ ఎంగేజ్మెంట్ అందించిన టాప్ 10 చిత్రాలలో పుష్ప ది రూల్ ఒకటవ స్థానంలో ఉంది.

అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా ది రూల్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చూస్తూనే ఉన్నాం. నేటికీ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ఈ చిత్రం ఆద్యంతం ఎర్రచందనం స్మగ్లింగ్ గురించే ఉన్నప్పటికీ అంతర్లీనంగా కుటుంబ బంధాలు, బాంధవ్యాల గురించి చూపించారు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఊరికే రాయలేదు. కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొనే రాసినట్లు ఉన్నారు. కలెక్షన్లు రప్ప.. రప్ప వస్తున్నాయి. భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం ఇప్పుడు తెలుగు దర్శకులవైపు చూస్తుందంటే మాములు విషయం కాదు. దీనంతటికి కారణం ఒక సుకుమార్ అని, అల్లు అర్జున్ అని చెప్పలేము. ఏదేమైనా పుష్ప ది రూల్ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. సినిమాలో పుష్ప వైకరి అందరినీ కట్టిపడేస్తుంది. తాను ఎంచుకున్న రంగంలో కింగ్ అయినప్పటికీ బంధాల దగ్గర పుష్ప ఇచ్చే విలువ వేరు. తనకు అంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ తన అన్నయ్య అంటే ఒకరకమైన మర్యాద.

పుష్పరాజ్ చిన్న ఈగోతోటే ఏకంగా బన్వర్ సింగ్ శకావత్ ను ఎంతలా అవమానించాడో చూశాము. కానీ వాళ్ల అన్నఎంత అవమానించినా ఎదురుతిరగకుండా మౌనంగా ఉండిపోతాడు. పుష్ప ఉండే పరిస్థితుల్లో వాళ్ల అన్నయ్యను కొట్టి తన ఇంటిపేరు లాగేసుకునేవాడు. కానీ పుష్ప అంటే కేవలం స్మగ్లింగ్ చేసే వ్యక్తి మాత్రమే కాదు సున్నితమైన ఆలోచన ఉన్నవాడు అనేది చూపించారు. తన నుంచి లాగేసుకున్న ప్రతిది తనకు గౌరవంగా రావాలని కోరుకునే వ్యక్తి. అందుకే సెకండ్ హాఫ్ లో తన అన్నయ్య కూతురు కోసం అంత పెద్ద రిస్క్ చేస్తాడు. అది చేసిన తరువాత కూడా అతను మాములుగానే ఉంటాడు. ఆ సమయంలో అజయ్ వచ్చి జరిగిన ప్రతిది చెప్పి ఏడవడం, పత్రిక ఇచ్చిపోవడంతో భావొద్వేగం అయిపోయింది అనుకుంటాము కానీ శ్రీవల్లి అదే పత్రికను తీసుకొని పుష్ప రాజ్ కు చూపించి.. మన పేర్లు రాశారు ముల్లేటి శ్రీవల్లి-పుష్పరాజ్ అని చెప్పగానే అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యి ఏడుస్తాడు. అక్కడ సీన్ కు పూర్తి న్యాయం జరిగింది. అందుకే ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. 2024లో విడుదలైన అన్ని సినిమాల్లో పుష్ప ది రూల్ చిత్రం నెంబర్ 1 స్థానంలో ఉంది.