Types of Popular Categories in Telugu movies
తెలుగులో వచ్చిన పాపులర్ కేటగీరిస్ చిత్రాలు
బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి రెండున్నర గంటల పాటు మనసును రంజింపజేసే మాయాజాలమే సినిమా. అలాంటి చిత్రానికి ముఖ్యంగా కావలసింది కథ. ఎంచుకున్న కథను బట్టి సినిమానా పలు జానర్స్గా విభజించారు. తొలినాళ్లలో ఎక్కువగా జానపద చిత్రాలు, సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు వస్తుండేవి. ఆ తరువాత కాలక్రమేనా యాక్షన్ చిత్రాలు, రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, కామెడీ, థ్రిల్లర్స్ ఇలా చాలా రకాల జోనర్స్ వస్తున్నాయి. మరి తెలుగులో పాపులర్ జోనర్స్ ఏంటి, అందులో వచ్చిన పాపులర్ సినిమాలు ఏంటో ఒకసారి సమీక్షిద్దాం.
జానపద చిత్రాలు: మనకున్న ఒత్తిడిని మరిచిపోయి, మనల్ని మనము రిఫ్రెష్ చేసుకోవడానికి సరదాగా సాగిపోయే జానపద చిత్రాలను చూస్తుంటాము. మన చుట్టూ ఉండే పాత్రలో, కథల రూపంలో విన్న పాత్రలో ఈ జానర్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో కథ కూడా చాలా సరళంగా.. చిన్న చిన్న ట్విస్టుల రూపంలో ఉంటుంది. రాజులు, రాజ్యాలు, దేవలోకం, దేవతలు, దయ్యాలు, భూతాలు, మంత్రాలు, మాయలు, తాంత్రికులు, మాయగాళ్లు, పాత్రలుగా వినోదాత్మక కథనాల ఆధారంగా జానపద చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. గుళేబకావళి కథ, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, సింహాసనం, బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలు కూడా ఈ జానర్లోనే వస్తాయి. అయితే దీనిలో బాహుబలి వంటి చిత్రాలను పీరియాడికల్ యాక్షన్ డ్రామా అంటూ మరో పేరు పెట్టి పిలుస్తున్నారు.
పౌరాణికాలు: భారతీయ ఇతిహాసలైనా రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తుల ఆధారంగా తెరకెక్కించిన కథలను పౌరాణికాలుగా వ్యవహరంచారు. ఇందులో కూడా కథ చాలా సరళంగా ఉంటుంది. దీనిలో 1940లలో పద్యాల రూపంలో ఎక్కవగా కథ సాగేది. భక్త ప్రహ్లాద, సంపూర్ణ రామాయణం, పాండవ వనవాసం, కురుక్షేత్రం, దాన వీర శూర కర్ణ వంటి చిత్రాలలో కథనం ఆసక్తిగా వెళ్తూనే ఉండేది దానితో పాటు పద్యాలు పాడేవారు. ఆ తరువాత దర్శకుడు బాపు తెరకెక్కించిన శ్రీరామ రాజ్యం వంటి చిత్రాలలో కేవలం మాటల రూపంలోనే తెరకెక్కించారు.
సాంఘికాలు: సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా తీసే సినిమాలు సాంఘికాలు. వీటి ద్వారా సమస్యను లేవనెత్తడం లేదా ఉన్న సమస్యలకు రచయితలు, దర్శకులు సమాధానాలు ఇవ్వడం, సమాజానికి మెసేజ్ ఇవ్వడం లాంటి కథలను తెరకెక్కిస్తారు. ప్రస్తుతం వచ్చే సినిమాల్లో ఎక్కవ శాతం ఇవే సినిమాలు ఉంటాయి. పెత్తందార్లు, ప్రేమనగర్, మానవుడు దానవుడు, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, శివ, ఠాగూర్, మహార్షి వంటి చిత్రాలు వస్తాయి. ఇందులోనే కమర్షియల్ చిత్రాలు అంటూ ఇప్పుడు విభజించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సమర సింహారెడ్డి, ఇంద్ర, నరసింహారెడ్డి వంటి చిత్రాలు కూడా సాంఘీకాలే కానీ వీటిని కమర్షియల్ ఫ్యాక్షన్ డ్రామా అంటూ వ్యవహరిస్తున్నారు.
చారిత్రాత్మకాలు: మనిషి పుట్టిన తరువాత మొదలైన నాగరికతను, మానవ జాతిచరిత్ర, రాజుల పోరాటాలు, మన దేశం కోసం కానీ ఒక వర్గం కోసం చేసిన వీరొచితగాధలను వెండితెరపై చూపించడమే చారిత్రాత్మక సినిమాలు. పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం, తాండ్ర పాపారాయుడు, విశ్వనాధనాయకుడు, అల్లూరి సీతారామరాజు, రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలు ఉన్నాయి. చరిత్రను ఎక్కడ వంచించకుండా, తప్పుడు దోవ పట్టించకుండా ఫ్యాంటసీని జోడిస్తూ చెప్పడం దీనిలోని ప్రత్యేకత. ఈ తరహా చిత్రాలు ఇప్పటికీ ఆసక్తిని కల్పిస్తాయి.
థ్రిల్లర్స్: సిినిమాలు చూసే ప్రేక్షకుడు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు టెన్షన్ ఫీల్ అవడం కూడా అనుభూతి అని థ్రిల్లర్ సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఈ చిత్రాలతో పాటు ప్రేక్షకుడు ట్రావెల్ చేస్తూ.. ఉత్సుకతను పొందుతాడు. వీటిలో కృష్ణ, కాంచన నటించిన అవే కళ్లు చిత్రం నుంచి మొదలు కొని అభిలాష, అన్వేషణ, పసివాడి ప్రాణం, కోకిల, క్షణం క్షణం, క్షణం, హిట్ సీరిస్ లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనే మరో జానర్ ను తీసుకొచ్చారు. దీనిలో కథ మొత్తం క్రైమ్ నేపథ్యం చుట్టు ఉంటుంది. అంటే రాక్షసుడు, భూతద్దం భాస్కర్ నారాయణ లాంటి సీరియల్ కిల్లర్స్ మూవీస్ అన్ని ఈ జానర్ కిందకే వస్తాయి.
యాక్షన్ ఎంటర్ టైనర్: యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాలన్నీ సాంఘికాలే అని చెప్పవచ్చు. కాకపోతే ఇందులో కొంత కమర్షియల్ హంగులు ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఇప్పుడు వస్తున్న చిత్రాలు అన్ని ఇదే జానర్‌కు చెందినవే. హీరో, విలన్ వీరి నడుమ వచ్చే డ్రామా. ఇందులో లవ్ పాయింట్ ఉండొచ్చు, కుటుంబాలకు సంబంధించిన పగలు ఉండొచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా ఉండోచ్చు.. మాములుగా ఐదు ఫైట్లు, ఐదు పాటలు అంటుంటాం కదా అదే తరహా సినిమాలను యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ జానర్ కు చెందినవి. సలార్, కేజీఎఫ్, దేవర, శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య మొదలైనవి.
ఇక అడ్వెంచర్, సూపర్ హీరోలా సినిమాలు గురించి తెలిసిందే. అయితే ఈ తరహా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు కానీ ఈ మధ్య ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం మాత్రం సూపర్ హీరో మూవీ అనే ప్రచారం చేశారు. కామెడీ చిత్రాల గురించి తెలిసిందే. జంద్యాల, రేలంగి నరసింహారావు తెరకెక్కించిన ఆహా నా పెళ్లంటా, చెవిలో పువ్వు వంటి చిత్రాలతో పాటు జాతి రత్నాలు, మ్యాడ్ వంటి చిత్రాలు అందుకు చక్కటి ఉదాహారణ.
అలాగే సైన్స్ ఫిక్షన్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆనందింపచేయడంతో పాటు ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఆదిత్య 369 నుంచి నేటి కల్కి వరకు చాలా రకాల చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలలో అ, ఇస్మార్ట్ శంకర్, ఆరంభం వంటి చిత్రాలు ఉన్నాయి.
చరిత్రకారుల జీవితాల గురించి సినిమాటిక్ గా చూపించడమే బయోగ్రఫి ఫిల్మ్స్, దీనిలో భాగంగా కథనాయకుడు, మహానాయకుడు, యాత్ర, యాత్ర2, తలైవీ వంటి చిత్రాలు వచ్చాయి. స్పోర్ట్స్ డ్రామాలకు సంబంధించి సినిమాలకు స్పోర్ట్స్ కెటాగిరి ఇస్తారు. హర్రర్ చిత్రాలు అనే విభాగం కూడా మంచి ఆదరణలో ఉంది. దీనితో పాటు సోసియే ఫ్యాంటసీ చిత్రాలు అయినా బింబిసారా, ప్రస్తుతం తెరకెక్కుతున్న విశ్వంభర. వంటి కెటగిరీలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి.