Reading Time: < 1 min

Versatile Actor Priyadarshi Birthday Special
విలక్షణ నటుడు ప్రియదర్శి బర్త్ డే స్పెషల్

తెలుగు చిత్ర సీమలో ఎంతోమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ ఎవరి ప్రత్యేకత వారిదే. రేలంగి, కాంతారావు, బ్రహ్మానందం, అలీ, సునీల్ ఆ తర్వాతి వరసలో ప్రియదర్శి ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. కమీడియన్ గా మొదలై హీరోగా మారిన నటుల్లో ప్రియదర్శి పేరు సైతం చేరింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో ప్రియదర్శి అరంగేట్రం చేశారు. మొదటి సినిమాలోని ప్రియదర్శికి మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. కొత్తవాడైనప్పటికీ తన నటనలోని ఈజ్ తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. సినిమా మొత్తం లో ప్రియదర్శి నటన ఒక ఎత్తు అయితే చివరిలో ‘నా చావు నేను చస్తా’ అనే డైలాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత ప్రియదర్శిలోని టాలెంట్ను గుర్తించిన తెలుగు చిత్ర పరిశ్రమ వరుసగా ఆఫర్లను ఇచ్చింది.

తెరపై హీరోల స్నేహితుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే 2019లో మల్లేశం అనే చిత్రంలో తొలిసారి హీరోగా నటించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా ఫిల్మ్ కంపానియన్ దశాబ్దపు 100 గొప్ప చిత్రాలలో ఒకటిగా మల్లేశం చిత్రాన్ని ప్రదర్శించారు.

ప్రియదర్శి కుటుంబం అంతా హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారే. ఓల్డ్ సిటీలో పెరిగిన ప్రియదర్శికి హైదరాబాద్ స్లాంగ్ అతనికి ఎంతో మేలు చేసింది.
సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ప్రియదర్శి మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేసుకుని, జాబ్ ట్రైల్స్ లో ఉండగానే ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే సమయంలో 2016 లో విడుదలైన టెర్రర్ చిత్రంలో ఒక టెర్రరిస్ట్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లిచూపులు చిత్రంలో కౌశిక్ పాత్ర అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ప్రియదర్శి ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల కన్నా బలగం చిత్రం ఎంతో స్పెషల్. తెలుగు కమెడియన్ వేణు తొలిసారిగా దర్శకత్వం వహించిన తెలంగాణ ప్రాంతీయ చిత్రం బలగం. ఈ చిత్రంలో సాయిలు పాత్రలో హీరోగా నటించిన ప్రియదర్శి తనలోని పూర్తి నటుడుని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఓం బీమ్ బుష్ చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించారు. దాని తర్వాత డార్లింగ్ చిత్రంలో హీరోగా నటించారు.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం తమిళ్ చిత్రాలలో సైతం నటిస్తున్నారు. అలాగే సినిమాలతో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్ లు ఈవెంట్స్ కు యాంకరింగ్ సైతం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న ప్రియదర్శి ఇంకెంతో సాధించాలని కోరుకుంటూ.. ఆగస్టు 25న జన్మదినం జరుపుకుంటున్న ప్రియదర్శికి బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున శుభాకాంక్షలు అందిస్తున్నాము.