Reading Time: 2 mins

World Photography Day Special

వరల్డ్ ఫోటోగ్రఫీ డే స్పెషల్

జీవితంలో మరపురాని సందర్భాలను, మన పెదవిపై చిరునవ్వులను పూయించే ఎన్నో మధురక్షణాలను కెమెరా బంధించి ఓ జ్ఞాపకంగా ఫోటోల రూపంలో అందిస్తుంది. ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే. మాములుగా ఫోటోగ్రఫీ అనగానే మనకు గుర్తుకొచ్చేవి అందమైన సముద్రాలు, మంచుకొండలు ఆ తరువాత సినిమా. ఫోటోగ్రఫీ లేకుండా సినిమాను ఊహించలేము. దృష్యాన్ని తనలో ముద్రించుకొని వెండితెరపై చూసే ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. ఫోటోగ్రఫి అనే సబ్జెక్ట్ ఒక సముద్రం. ఎంత నేర్చుకున్నా కొంత మిగిలే ఉంటుంది.

తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి నేటి వరకు మేకింగ్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయో చూస్తూనే ఉన్నాము. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, రీల్స్ నుంచి చిప్‌ల వరకు మూవీ మేకింగ్‌లో ఎక్కువగా మార్పు చెందిన క్రాఫ్ట్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు సాంకేతికత విపరీతంగా పెరిగింది. గ్రీన్ మ్యాట్, బ్లూమ్యాట్ సెట్టింగులు వేస్తూ.. లేని ప్రపంచాన్ని, అబ్బురపరిచే దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. కానీ టెక్నాలజీ లేని సమయంలో కూడా తెలుగులో పౌరానిక, భక్తి, జనపద చిత్రాలలో అద్భుతాలను సృష్టించారు. వీఎఫ్‌క్స్‌లు, జీఎఫ్‌ఎక్స్‌లు లేని సమయంలో అలాంటి దృష్యాలను ఎలా చిత్రీకరించారు అనే అనుమానం చాలా మందికి వస్తుంది. ముఖ్యంగా దీని వెనుక కొందరు మాస్టరు మైండ్స్ ఉన్నారు.

కేవలం కెమెరా యాంగీల్స్‌తో మ్యాజిక్ చేస్తూ చూసే ప్రేక్షకులను అవాక్కు చేశారు మార్కస్ బార్ట్లీ(Marcus Bartley). మార్కస్ ఏప్రిల్ 22, 1917లో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించారు. తెలుగు సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఆయన సినిమాటో గ్రాఫర్‌గా పనిచేసిన పాతాల భైరవి, మాయా బజార్ చిత్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా అద్భుతాలను చిత్రీకరించారంటే అది కేవలం వారి ప్రతిభ మాత్రమే. ఘటోత్కచుడి పాత్రాలో ఎస్వీ రంగారావును ఎలా చూపించారో సినిమా చూస్తే అర్థం అవుతుంది. కొన్ని సన్నివేశాల్లో సాధారణ మనిషిలా, మరికొన్ని సందర్భాలలో అసాధారణంగా ఎంతో ఎత్తు, ఎంతో లావు ఉన్నట్లు చూపించారు. అవన్ని కేవలం కెమెరా యాంగిల్స్ మాత్రమే, ఎలాంటి గ్రాఫిక్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ లేవు అంటే ఆశ్చర్యపోతాము.

తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళ భాషాల్లో సైతం తన ప్రతిభను అవిష్కరించారు. ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా చాలా సినిమాల్లో గ్రాఫీక్స్ తేలిపోతూ ఉంటుంది. కేవలం కెమెరా టెక్నిక్‌తో అలాంటి ప్రయోగాలు చేశారంటే మాములు విషయం కాదు. అందుకే ఆయన్ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి గోల్డ్ మెడల్ వరించింది. 1978లో మలయాళ చెమ్మీన్(Chemmeen) చిత్రానికి ఈ అవార్డు వచ్చింది. అలాగే 1970లో శాంతి నిలయం చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు లభించింది.

తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ చిత్రాలను తెరపై అవిష్కరించిన సినిమాటోగ్రాఫర్‌లలో వీ.ఎస్.ఆర్. స్వామి మొదటి వరుసలో ఉంటారు. 1969లో వచ్చిన కథానాయకుడు మొదలు కొని 2004లో వచ్చిన అడవి రాముడు చిత్రం వరకు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగు చిత్రాలకోసం పనిచేశారు. భలే మోసగాడు, ఖైదీ, వేట, సమరసింహారెడ్డి, ఇంద్ర వంటి కమర్షియల్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే పాతాల భైరవి చిత్రానికి మార్కర్ బార్ట్లీతో కలిసి పనిచేశారు. ఈయన కృషికి 1987లో విశ్వనాథ నాయకుడి చిత్రానికి నంది అవార్డు వరించింది.

ఇక ఇప్పుడు చాలా మంది బెస్ట్ సినిమాటోగ్రాఫర్లు ఉన్నారు. తెలుగు తెరపై హాలీవుడ్ హంగులను దిద్దిన సెంథిల్ కుమార్ ఇప్పుడు టాప్ లిస్టులో ఉన్నారని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ, బాహుబలి పార్టీ 1, పార్ట్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు సెంథిల్ పనిచేశారు. హాలీవుడ్ చిత్రాలకు మన విజువల్స్ ఏ మాత్రం తీసిపోవని నిరుపించారు. ఆ తరువాత రత్నవేలు, చోటా కే నాయుడు, రామ్ ప్రసాద్, పీసీ శ్రీరామ్, జ్ఞానవేల్ వంటి ఎంతో మంది ట్యాలెంటెడ్ ఛాయచిత్రకారులు ఉన్నారు.