Reading Time: 2 mins

అండ్‌ ది ఆస్కార్‌ గోస్ టు మూవీ  రివ్యూ

Rating: 2.5/5

ప్రతీ సినిమా నిర్మాణం వెనుక, దర్శకుడు వెనుక ఖచ్చితంగా ఓ కథ ఉంటుంది. అయితే ఆ కథలు కొన్ని చెప్పుకునేందుకు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. మరికొన్ని పరమ బోర్ గా ఉంటాయి. ఇంకొన్ని కథలు అయితే చాలా ప్రేరణగా ఉంటాయి..సినిమా కోసం ఆ దర్శకులు చేసిన త్యాగాలు మనని చాలా ఇన్సైపైర్ చేస్తాయి. అలా ఓ  సినిమా …సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ వైపు ప్రయాణం పెట్టుకుంటే..అదీ ఓ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ చిత్రం అయితే ఆ జర్నీ ఎలా ఉంటుంది….దాన్ని ఓ సినిమాగా తీస్తే మనం చూడగలమా …కేవలం సినిమావాళ్లకే నచ్చుతుంగా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

నర్శింగ్ హోమ్ ప్రక్కనున్న థియోటర్ లో ముమ్మట్టి సినిమా వస్తోంటే…ఆ డైలాగులు వింటూ  ఇస్సాక్ అబ్రహం (టోవినో థామస్‌)  పుడతాడు.  చిన్నప్పటినుంచీ సినిమాలంటే పిచ్చితో పెరుగుతాడు. తాను పెద్ద డైరక్టర్ ని అవుతానని నమ్ముతూంటాడు. అలాగే కష్టపడి సినిమా పరిశ్రమలో ప్రవేశిస్తాడు. కానీ ఏదీ అనుకున్నట్లుగా జరగదు కదా. ఈ కాబోయే డైరక్టర్ కు నిర్మాత దొరకటం కష్టమైపోతుంది. చివరకు విసిగి తానే సొంతంగా సినిమా నిర్మిస్తూ, డైరక్ట్ చేయాలనుకుంటాడు. తన వాటాకు వచ్చే ఆస్తిని తాకట్టు పెట్టి, తను కష్టపడి కొనుక్కున్న స్దలాన్ని అమ్మి, బ్యాంక్ లోన్ తెచ్చి మరీ సినిమా ప్రారంభిస్తాడు. దిన దిన గండంలా ఆర్దిక కష్టాలు వెంటాడతాయి.

తల్లి, సోదరి నగలు తాకట్టు పెట్టాల్సిన పరిస్దితి కూడా వస్తుంది. అయినా సరే ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా సినిమా పైనే దృష్టి పెడతాడు. అయితే అతను తీస్తున్నది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఆర్ట్ సినిమా. వాస్తవిక సంఘటనలతో, రియలిస్టిక్ లొకేషన్స్ లో సినిమాని పూర్తి చేస్తాడు. అయితే సినిమా పూర్తి చేయగానే నిర్మాత పని పూర్తి కాదు కదా..అప్పుడే అసలు పని మొదలవుతుంది. సినిమాని సజావుగా థియోటర్స్ లో రిలీజ్ చేయాలి. అయితే ఇస్సాక్ ది అంతకు మించిన కల. తన సినిమాని ఆస్కార్ కు తీసుకెళ్లాలని…ఈ క్రమంలో అతను ఎన్ని కష్టాలు పడ్డాడు..ఆ కోరిక నెరవేరిందా వంటి విషయాలు తెలియాలంటే ఆహాలో ఈ సినిమా చూడాల్సిందే.
 
ఎలా ఉంది

2019లో ఇదే టైటిల్ తో వచ్చిన మళయాళి సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఆహా యాప్ వారు వరస పెట్టి మళయాళ డబ్బింగ్ సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం రిలీజైన ఈ సినిమా …సినిమా పరిశ్రమపై ఓ డాక్యుమెంట్ లా అనిపిస్తుంది. ఇక ఈ దర్శకుడు సలీమ్ అహ్మద్ తొలి చిత్రం  ‘Adaminte Makan Abu’ నేషనల్ అవార్డ్ సాధించింది. కేరళ స్టేట్ అవార్డ్ సైతం పొందింది. అంతేకాదు 84వ ఆస్కార్ అవార్డ్ లకు మన దేశం పంపబడిన రీజనల్ సినిమాగా ఎంపికైంది. ఈ నేపధ్యంలో తన అనుభవాలతో ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. దాంతో ఈ సినిమా…సినిమా జనాలను ఎంటర్టైన్ చేయగలగినట్లుగా..మామూలు జనాలను చేయటం కష్టం అనిపిస్తుంది. అయితే దర్శకుడు నిజాయితీగా ఈ సినిమా తీసినట్లు మనకు అర్దమవుతుంది.
 
టెక్నికల్ గా ..

ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే నడిచిపోయినా..సెకండాఫ్ మాత్రం చాలా చోట్ల నట్టుతుంది. హాలీవుడ్ లాబీయిస్ట్ తో స్ట్రగుల్స్ ..జ్యూరీ తన సినిమా చూడటానికి వంటివి స్క్రిప్టుపై బాగానే అనిపించినా తెరపై మీదకు వచ్చేసరికి తేలిపోయాయి. అయినా ఈ సినిమా టెక్నికల్ టీమ్ ఎక్కడా లోటు చేయకుండా సినిమాకు సొబగులు అద్దే ప్రయత్నం చేసింది. నటుడుగా టోలీనో థామస్ చాలా సీన్స్ లో అవార్డ్ స్దాయి నటన ప్రదర్శించారు. అయితే సినిమా బాగా స్లోగా ఉండటం ఈ సినిమా చూసేటప్పుడు చాలా చోట్ల విసిగిస్తుంది.

చూడచ్చా…

మీరు సినిమా వాళ్లైనా లేదా సినిమాలు ఆస్కార్ కు ఎలా ఎంపికవుతాయో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్లైనా  ఓ లుక్కేయచ్చు.

ఎవరెవరు…

నటీనటులు :టోలీనో థామస్, నిక్కీ, అను సితార, కవితా నాయర్ మొదలైన వారు.
సంగీతం  :బిజిబల్  
ఛాయాగ్రహణం  : మధు అంబట్
ఎడిటర్ : విజయ్ శంకర్
రన్ టైమ్ : 124 నిముషాలు
 కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సలీమ్ అహమ్మద్  
విడుదల తేదీ : 28,ఆగస్ట్ 2020

విడుదల:-O T T  ఆహా ఎక్సక్లూజివ్