అంతరిక్షం రివ్యూ
సెకండఫ్ లో దారి తప్పాడు (‘అంతరిక్షం’ రివ్యూ)
రేటింగ్ : 2.5
అంతరిక్షలో అశ్వమేఘాలు, ఆకాశంలో భూకంపం వంటి డబ్బింగ్ సినిమాలు ద్వారా అప్పుడప్పుడూ క్రింద ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు ఆకాశంలోనూ సినిమా కథలు నడుపుతూంటారు అని సగటు ప్రేక్షకుడు తెలుసుకుంటూంటాడు. అయితే వాటిని అక్కడితోనే మర్చిపోతాడు…అంతే తప్ప అటువంటివి తెలుగులో ఇన్నాళ్లూ ఎక్సపెక్ట్ చేయ్యడు. దానికి తోడు ఆ సినిమాలు కేవలం హాలీవుడ్ కే పరిమితం…మన వుడ్ అటువంటి కథలు చెక్కటానికి పనికిరాదు అని ఫిక్సైపోయినట్లుగా తెలుగు సినిమా ఇన్నాళ్లూ బిగ తీసుకుని కూర్చుంది.
అయితే కొత్త తరం వాటిని బ్రేక్ చేసే పనిలో పడింది. విభిన్నమైన ఆలోచనలు ఒడిసిపట్టుకుని, అసాధ్యం అనుకున్నవాటిని సుసాధ్యం చేసే పనిలో పడింది. అలా ఘాజీతో నీటిలో కథ నడిపి శభాష్ అనిపించుకున్న సంకల్ప్ ..ఈ సారి ఆకాశంలో కథ నడిపాలని అంతరిక్షం అన్నాడు. అయితే సినిమా అంటే మాస్ ..మసాలా అని ఫిక్సై చూసే మనవాళ్లకు ఈ కథ నచ్చుతుందా.. సైన్స్ పాఠాలు సామాన్య ప్రేక్షకుడు బుర్రకు ఎక్కుతాయా…వరణ్ తేజ్ ఏ ధైర్యంతో ఈ కథను నమ్మాడు. సంకల్ప్ ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కొడతాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ ఇదే..
కమ్యునికేషన్ వ్యవస్దకు కీలకంగా నిలిచే మిహిర అనే శాటిలైట్ ..కోడింగ్ ప్రాబ్లంతో దారి తప్పుతుంది. దాన్ని తిరిగి దాని కక్ష్య లోకి ప్రవేశపెట్టకపోతే కమ్యునేషన్ ఆగిపోతుంది. ప్రపంచం ఇబ్బందుల్లో పడిపోతుంది. దాని కోడ్ సరిచేసేదెవరూ అంటే దేవ్ (వరణ్ తేజ్). అతనో ఓ వ్యామోగామి.కానీ పర్శనల్ కారణాలతో గత ఐదేళ్లుగా ఆ ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. అతన్ని ఒప్పించి స్పేస్ లోకి పంపి ..దాన్ని సెట్ చేయాలని ప్లాన్ చేస్తుంది స్పేస్ సెంటర్ టీమ్. అందుకు కాస్త కష్టంగానే ఒప్పుకుని వెళ్లిన దేవ్ మనస్సులో వేరే ఆలోచన ఉంటుంది. అక్కడికి వెళ్లాక దాన్ని అమలు చెయ్యాలని చూస్తాడు. అసలు దేవ్ ప్లాన్ ఏంటి…శాటిలైట్ ని సెట్ చేసాడా…చక్కటి ఉద్యోగం వదిలేసుకుని అతను ఎందుకు దూరంగా వెళ్లిపోయాడు..గతం ఏమిటి…హీరోయిన్స్ కు ఈ కథలో స్దానం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కొత్త పాయింటే కానీ..ప్రేక్షకులు పాతే
హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఇదేమీ కొత్తగా అనిపించకపోవచ్చు కానీ..తెలుగువారికి మాత్రం ఇది ఖచ్చితంగా కొత్త బ్యాక్ డ్రాపే. స్పేస్ లో కథ నడపటమే విభిన్నతకు తావిచ్చింది. ఎప్పుడైతే కొత్త బ్యాక్ డ్రాప్ వచ్చి చేరిందో మిగతాదంతా కొత్తగా మారిపోతుంది. ఆ చట్రంలోంచి కథను చూస్తే అంతా కొత్తగా కనిపిస్తుంది. అదే ఈ సినిమాకు యుఎస్ పి గా మారింది. అయితే ఇంతకు ముందు స్పేస్ లో జరిగే కథంటూ గుణ్ణం గంగరాజు గారు చందమామపై అమృతం అంటూ ఓ సినిమాని మన ముందుకు తెచ్చారు.
కొత్త నేపధ్యాన్ని పరిచయం చేసిన ఆ సినిమా…ఆ పరిచయం పూర్తి కాకుండానే, జనాలు పూర్తిగా అర్దం చేసుకుండానే.. దానిపై జోక్స్ పేల్చే ప్రయత్నం చేసింది. దాంతో ఆ జోక్స్ ఎవరికి అర్దం కాలేదు. తెలుగువాడు ఆఫ్రికా జోక్స్ ని ఇంగ్లీష్ లో అర్దం చేసుకునే ప్రయత్నం చేసనట్లు గా మారింది. ఆ తప్పు ఇక్కడ సంకల్ప్ చేయలేదు. కథను సీరియస్ టోన్ లో చెప్పాడు. అదే సమయంలో సైంటిఫిక్ విషయాలతో సినిమాను నింపేసాడు. కొద్దిగా స్పేస్..గురించి అవగాహన ఉన్నవాడికి అంతరిక్షం…బాగుందనిపిస్తే…స్పేస్ సైన్స్ పై అవగాహన లేనివారికి సోసో గా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా ఆశించి వచ్చేవాడికి సోది సినిమాగా చిరాకేస్తుంది.
స్క్రీన్ ప్లే సమస్య ఈ కథకు స్క్రీన్ ప్లే సరిగ్గా చూసుకోలేదనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మొదలుపెట్టినప్పడు కథకు ఓ లక్ష్యం ఉంది. అది శాటిలైట్ ని సెట్ చేయటం. అది పూర్తవగానే కథ పూర్తైనట్లే. కానీ కథను అక్కడితో ఆపకుండా ..హీరో కు మరో లక్ష్యం అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ముందుకు పదండి అంటారు. దాంతో మళ్లీ ఇంకో కథ మొదలైనట్లు అనిపించి,బోర్ వచ్చేసింది. ముఖ్యంగా ఇలాటి హై కాన్సెప్టు సినిమాలకు ఒకే కథ ..ఒకే లక్ష్యం ఉంటేనే వర్కవుట్ అవుతాయి. విసిగించవు.
దర్శకత్వం, మిగతా విభాగాలు
ఇక ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకుడు గా మరో మెట్టు ఎక్కాడని చెప్పలేం. ఎందుకంటే ఘాజీ కంటే గొప్పగా ఈ సినిమా ఏమీలేదు. అయితే నటులు నుంచి మంచి నటన రాబట్టున్నారు. టెక్నికల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లారు. అయితే ఈ సినిమాకోసం పోగుచేసుకున్న నాలెడ్జ్ మొత్తం వేరే సినిమాకు వాడటం కష్టం అనుకున్నాడో ఏమో కానీ ఎక్కడో చోట దాన్ని ఇరికించటానికి చూసారు. దాంతో ఆ టెక్నికల్ డిటేల్స్ ..సినిమాపై ఆసక్తిని చంపేసాయి. ఖచ్చితంగా స్పేస్ లో జరిగే సినిమా కథ చేస్తున్నప్పుడు ప్రొసీడింగ్స్ కరెక్ట్ గా చూపాల్సిందే. అంత మాత్రాన మరీ టెక్నికల్ డిటేల్స్ ఎక్కువైతే అది డాక్యుమెంటరీ అవుతుంది. కేవలం వ్యామోగాములు లేదా..అంతరిక్షం సైన్స్ అవగాహన ఉన్నవాళ్లకే అర్దమవుతుంది. ఎంతవరకూ చూపెట్టాలో అంతవరకే చూపెడితే సరిపోయింది.
ఇక సాంకేతికంగా ఈ సినిమా హై స్టాండర్డ్స్ లోనే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అవుట్ స్టాండింగ్ గా ఉంది. అయితే ఎడిటింగ్ మరికాస్త షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. విఎఫ్ ఎక్స్ డిపార్టమెంట్ మాత్రం దీనికి రివర్స్ లో ఉంది. అదే ఈ సినిమాకు మైనస్.
ఇక వరణ్ తేజ విషయానికి వస్తే…ఫెరఫెక్ట్ ఛాయిస్, హైదరీ కూడా తనపాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. లావణ్యకు చెప్పుకోదగ్గ పాత్రలేదు.
ఆఖరిగా…
రిస్క్ అనిపించే ఇలాంటి కొత్త ఆలోచనను ఎంకరేజ్ చేసినందుకు మొదట నిర్మాతను, హీరోను అభినందించాలి. ఇలాంటి సినిమాలు హిట్, ప్లాఫ్ లకు అతీతంగా జనం చూస్తేనే మరిన్ని విభిన్నతరహా సినిమాలు వస్తాయి.
నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు.
సంగీతం : ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వి.యస్
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
నిర్మాత : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి