అర్థ శతాబ్దం మూవీ రివ్యూ
అర్ద శబ్దమే:’అర్థ శతాబ్దం’ రివ్యూ
Rating:2/5
కథలు జీవితాల్లోంచి పుట్టుకొస్తాయి. వాటిల్లోని పాత్రలు మనతో స్నేహం చేస్తాయి. భావోద్వేగాలు పంచి… గుండెల్లో తిష్టవేసేస్తాయి. సినిమా పూర్తయిన తరువాత స్క్రీన్ నుంచి పాత్రలన్నీ నేరుగా మనతోనే ఇంటికొస్తాయి. కొన్నాళ్లపాటు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే అలాంటి సజీవ పాత్రలు, సహజ పాత్రలతో వచ్చిన సినిమాలు ఎప్పుడో కానీ రావు. అర్ద శతాబ్దం కూడా రిలీజ్ కు ముందు అలాంటి సినిమానే అని ప్రచారం జరిగింది. వాస్తవికంగా ఉంటుందని, మన కళ్ల ముందు మన సమాజ స్వరూపాన్ని నిలబెడుతుందని చెప్పుకున్నారు. నిజంగానే సినిమా అలాగే ఉందా..అసలు సినిమా కథేంటి…దర్సకుడు ఏం చెప్దామనుకున్నాడు. ఆ చెప్దామనుకున్నది తెరపై కనపించిందా,కొన్నాళ్లపాటు సినిమారక్తిని సజీవంగా ఉంచగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
సిరిసిల‍్ల ఊళ్లోఎలక్ట్రీషియన్ కృష్ణ (కార్తీక్ రత్నం) కు ఒకటే కోరిక. ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని. అందుకు ప్రయత్నాలు చేస్తూంటాడు. అలాగే అతనికి చిన్నప్పటి నుంచి అదే ఊరికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే ప్రేమ. కానీ వన్ సైడ్. తను దుబాయి వెళ్లేలోగా ఆమెకు తన విషయం చెప్దామనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు,రెండు వర్గాలగా విడిపోవటానికి,కులాల పేరుతో కొట్టుకోవటానికి దారి తీస్తుంది. ఇంతకీ అసలు కృష్ణ చేసిన పని ఏంటి? అది గొడవలకు ఎలా లీడ్ చేసింది? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందగలిగాడా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రిప్టు విశ్లేషణ
సినిమా లక్ష్యం ఏమిటి..ఈ ప్రశ్న పుట్టననాటి నుంచి ఉంది. స్క్రీన్ మీద కనిపించేవన్నీ సినిమాలు కాదు. అక్కడ కొన్ని -జీవితాలూ ఉంటాయ్. ప్రతి సినిమా లక్ష్యం వినోదమే కాదు. అక్కడ -బతుకుకు అర్థం చెప్పే ఆదర్శాలూ ఉంటాయ్. అయితే అలా జరగాలంటే అందుకు తగ్గ సమర్దుడైన డైరక్టర్ ఉండాలి. లేకపోతే అరకొర సినిమాలు వస్తాయి. ఇప్పుడీ సినిమా చూస్తూంటే అదే అనిపిస్తుంది. అర్దవంతమైన సినిమా చూపెడాతా అని ఆశపెట్టి..అటూ ఇటూ గానీ సినిమాని దర్శకుడు మన ముందు ఉంచాడు. అతనిలోని అవగాహనాలోపం సినిమాలో స్పష్టంగా కనపడుతుంది. ముక్యంగా జానర్ ఎంపిక అనేది ఈ సినిమాకు వర్తించదు. వ్యంగ్యంగా తీసిన సినిమానా లేక రియలిస్టిక్ గా తీసిన సినిమానో స్పష్టత ఉండదు. ఈ సినిమాని కంచరపాలెం తో పోలుస్తున్నారు కానీ అంత సీన్ కనిపించదు.
కంచరపాలెం అనే మారుమూల గ్రామంలోని కొన్ని బతుకు కథలు ఏరుకుని, వాటి ఆశనిరాశలు, కష్టసుఖాలు, పగా ప్రతీకారాలు, పరువుమర్యాదలు.. ఇలా బతుకు కోణాలను కథనంగా గుదిగుచ్చి -కేరాఫ్ కంచరపాలెంగా అందించాడు దర్శకుడు వెంకటేశ్ మహా. జీవితంలో మనకెదురైన అనేక సంఘటనలను పాత్రలకు ఆపాదించి గుర్తుచేశాడు. నవ్వించాడు. కన్నీళ్లు పెట్టించాడు. కంగారు పెట్టాడు. ఏం జరుగబోతోందోనని భయపెట్టాడు. ఇక్కడ అలాంటిదేమీ కనపడదు. కాకపోతే ‘కేరాఫ్ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్ రత్నం ఇందులోనూ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు అంతే.
నిజానికి మన సౌతిండియా చిత్రాల్లో ఇలాంటి వన్ సైడ్ లవ్,కులాల గొడవతో ఊళ్లు విడిపోయి కొట్టుకోవటం వంటి కథలు తక్కువేం కాదు. కాకపోతే ఈ మద్యన రావటం లేదంతే. ఇలాంటి వాటిల్లో మెలోడ్రామానే ఎక్కువ కనిపిస్తుంది. దానిని దర్శకుడు తగ్గించగలిగాలి. కాని తొలి చిత్రం అవటం మూలన ఏమో కానీ… చాలా చోట్ల ‘అతి’ గా అనిపిస్తూ భావోద్వేగాలు బాలెన్స్ లేకుండా ఉంటాయి. సహజ పాత్రల ప్రవర్తనా తీరు ప్రతిబింబించేలా సన్నివేశాలను రాసుకునే క్రమంలో దారి తప్పాడు. సినిమా మొదలైన యాభై నిమిషాలు అయినా పూర్తిగా కథలోకి రాకపోవడం, రీళ్లకు రీళ్లు డ్రాగ్ అవుతూ కాన్‌ఫ్లిక్ట్‌ను త్వరగా తీసుకురాకపోవడం వంటివి సినిమాని ఇబ్బందుల్లోకి తోసేసాయి. ఏదమైనా చెత్త చిత్రాలూ, మూస మూవీలతో ప్రేక్షకుడు విసుగెత్తిపోయే సమయంలో ఇలాంటి సినిమాలు వస్తే..తెరపై సిత్రాలేవో జరుగుతాయని ప్రేక్షకుడు ఆశిస్తాడు. కానీ డైరక్టర్స్ అవగాహనా లోపంతో…అందుకు రివర్స్ తయారైన చిత్రాలు వస్తాయి.
టెక్నికల్ గా ..
ఈ సినిమాకు మంచి డైలాగులు రాసుకున్న దర్శకుడు సరైన కథ,కథనం రెడీ చేయలేకపోయాడు. పాత్రలు ఎమోషనల్ గా కనెక్ట్ కావు. ఫస్టాఫ్ ప్రేమ కథతో అక్కడే తిప్పి తిప్పి కథని సాగదీస్తే, సెకండాఫ్ లో రన్ టైం తగ్గించాలని దారుణమైన ఎడిటింగ్ చేసారు. సాయికుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర అజయ్, ఆమని, పవిత్ర వంటి స్టార్ యాక్టర్స్ ఉన్నా కలిసి రాలేదు. అయితే నోఫెల్ రాజా సంగీతంలో ‘ఏ కన్నులు చూడని’పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అస్కర్, వెంకట్, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ బాగోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
చూడచ్చా
కరోనా లాక్ డౌన్ తో మరీ ఖాళీగా ఉన్నాం..ఏదో ఒక సినిమా చూడాల్సిందే అనుకునేవారికి తప్ప మిగతావారికి కష్టం.
తెర ముందు..వెనక
బ్యానర్: ఆర్‌ఎస్ క్రియేషన్స్
నటీనటులు: కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమర్, కృష్ణప్రియ, శుభలేఖ సుధాకర్, ఆమని తదితరులు
సంగీతం: నఫల్ రాజా
సినిమాటోగ్రఫీ: అఖేర్, వెంకట్ ఆర్ శాఖమూరి, ఈజే వేణు
ఎడిటింగ్: జె.ప్రతాప్ కుమార్
ఆర్ట్: సుమిత్ పటేల్
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
కథ, దర్శకత్వం: రవీంద్ర, పుల్లె
రన్ టైమ్ :1 గంట 57 నిమిషాలు
ఓటీటి : ఆహా
విడుదల తేది: 11,జూన్ 2021