Reading Time: 2 mins

ఆకాశమే నీ హద్దురా మూవీ రివ్యూ

కమర్షియల్ బయోపిక్ రా..: ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ

Rating:3/5

మహా(సూర్య) అనే కుర్రాడికి ఓ జీవితాశయం. సామాన్య ప్రజలు కూడా డొమాస్టిక్ ఎయిర్ లైన్స్ ఉపయోగించుకునేలా రేట్లు ఉండాలి. అయితే అది సాధ్యమయ్యే పనేనా..విమాన ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. దాన్ని ట్రైన్ రేటుకు తీసుకురావటం అంటే నిజ జీవితంలో జరిగే పనేనా. కానీ ఆ కుర్రాడు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేస్తాడు. తన కలని నిరూపించి చూపుతాడు. అయితే అసలు ఆ కుర్రాడికి అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది. దానికి దారితీసిన సంఘటన ఏమిటి…అసలు ఆ కుర్రాడి నేపధ్యం ఏమిటి..తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఆ కుర్రాడికి ఎదురు దెబ్బలు ఏమిటి వంటి ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే నిజ జీవిత స్పూర్తిగా రూపొందిన ఈ సినిమా …ఆ అంశాలను ఎంత స్పూర్తివంతంగా ,ఆసక్తికరంగా చెప్పిందనేది ఇంట్రస్టింగ్ అంశం.
 
స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమాలో ఇంతకు మించి కథేమీ లేదు. ఇదో రేగ్స్ టు రిచ్ ఫార్ములా. అయితే ఇక్కడే ఉంది కష్టం. రొటీన్ అనిపించకుండా ఉన్న కథను చెడకుండా, ఎంటర్టైన్ చేస్తూనే ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగాలి. దర్శకురాలు సుధా కొంగర గతంలో గురు (వెంకటేష్)తో ఇలాంటి ఫీట్ చేసి సక్సెస్ అయ్యింది. దాంతో ఆమె దృష్టి ఈసారి ఈ బయోపిక్ పై పడింది.  ‘సింప్లీ ఫ్లై’ అనే పుస్తకాన్ని ఆధారం చేసుకుని ఈ కథ అల్లుకుంది. అయితే సినిమా కదా అని కాస్తంత సినిమాటెక్ లిబర్టీ బాగా తీసుకుంది. అందులోనూ సూర్య వంటి కమర్షియల్ ఉండటంతో విలన్, ఎత్తులు,పైఎత్తులు, క్రిమినల్ ఏక్టివిటీస్ వంటివి కూడా బాగానే చోటు చేసుకున్నాయి. దాంతో సహజంగా నడవాల్సిన కథ కాస్తా చాలా డ్రమిటిక్ మారిపోయింది. గురులో రా ఎమోషన్స్ ని ఎంతో ఈజ్ తో హ్యాండిల్ చేసిన సుధ కొంగర ఈ సినిమా దగ్గరకొచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ పై దృష్టి పెట్టింది. కమర్షియల్ వే లో ఎమోషన్స్ ని రైజ్ చేయటానికి ప్రయత్నించింది. ఇక తండ్రిని క‌డ‌సారి చూడ్డానికి హీరో తాప‌త్ర‌య ప‌డ‌డం, విమాన ప్ర‌యాణానికి త‌గినంత డ‌బ్బులు లేక‌పోవ‌డం, ఎయిర్ పోర్టులో మిగిలిన ప్ర‌యాణికుల ద‌గ్గ‌ర ప్రాధేయ ప‌డ‌డం లాంటి స‌న్నివేశాలు.. కాస్త ఎమోష‌న్ ట‌చ్ ఇవ్వ‌గ‌లిగాయి.

ఓపినింగ్ ఫ్లైట్ సీన్ లోనే కథ సోల్ ఏమిటో, కోర్ ప్లాట్ ఏంటనేది చెప్పేసింది. ఫస్టాఫ్ అంతా ఆడుతూ పాడుతూ కాంప్లిక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన ఆమె సెకండాప్ కు వచ్చేసరికి సీరియస్ టోన్ లోకి అదీ స్లో నేరేషన్ లోకి దిగిపోవటం ఆశ్చర్యపరుస్తుంది. కథకు ఎమోషనల్ ఆర్క్ అవసరమే కానీ మరీ ఫార్ములా మోడ్ లోకి వెళ్లిపోతోందమో గమనించుకోవాలి. స్టార్స్ చేసే కమర్షియల్ సినిమాల్లో ఫార్ములా ఉన్నా ఎవరూపట్టించుకోరు. కానీ ఇలాంటి బయోపిక్ లనుంచి ఎంతో కొంత నిజం, నిజాయితీ ఆశిస్తాం. అప్పుడే ఇవి బియ్యంలో రాళ్లులా అడ్డం పడతాయి. అలాగే ఇది ఓ ప్రెడిక్టుబుల్ స్టోరీనే. అయినా సరే దర్శకురాలి మ్యాజిక్ చెయ్యటానికి ప్రయత్నించింది. పల్లెటూరి కుర్రాడు, ఓ టీచర్ కొడుకు..ఎయిర్ ఫోర్స్ లో పెద్ద జాబ్ లో ఉన్నవాడు ఎయిర్ లైన్స్  స్థాపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది సుధా కొంగర చక్కగా ప్రెజెంట్ చేసింది. ఇవన్నీ ఎలా ఉన్నా తమిళ అతి సినిమాలో చాలా చోట్ల కనిపించింది. దాన్ని తెలుగు వెర్షన్ కు డోస్ తగ్గిస్తే బాగుండేది.

సాంకేతికంగా…

ఈ సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్ట్స్ లో ఉంది. సూర్య వంటి స్టార్ సినిమాకు అది పెద్ద విషయం కూడా కాదు. జివి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చెప్పుకోదగిన రీతిలో ఉన్నాయి. అయితే ఈ సినిమాకు అన్ని పాటలు అనవసరం. ఓటీటిలో కాబట్టి వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళ్తాం. ఇక ఈ సినిమాకు అంత లెంగ్త్ కూడా అనవసరం. లెంగ్త్ తగ్గిస్తే బోర్ తగ్గేది.  నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి చెప్పుకోదగ్గ రీతిలో ఉంది. సినిమా కథ ఎలా ఉన్నా తన కెమెరాతో సహజంగా సీన్స్ కనపడేలా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఎడిటర్ ..లెంగ్త్ విషయం చూసుకోవాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. గ్రాఫిక్స్ పై మరికాస్త కష్టపడాలి. తేలిపోయాయి.

నటీనటుల్లో సూర్య హైలెట్. ఈ పాత్ర‌కు స‌త్య‌దేవ్ డ‌బ్బింగ్ చెప్పాడు. స‌త్య‌దేవ్ ది బాగా తెలిసిన గొంతు కావటంతో కాస్తంతం ఇబ్బందే అనిపించింది. మోహ‌న్ బాబుది చెప్పుకోదగిన పాత్రేమీ కాదు. కేవ‌లం గెస్ట్ రోల్. మూడు సీన్స్ లో  క‌నిపించాడు.సూర్య భార్య  బేబీ పాత్ర‌ని బాగా రాసుకోవ‌డంతో మనం కనెక్ట్ అవుతాం.
 
చూడచ్చా

బయోపిక్ చూస్తున్నామని గుర్తు పెట్టుకుని చూస్తే కాస్తంత అతి అనిపిస్తుంది. కానీ లేకపోతే బాగానే ఎంజాయ్ చేయచ్చు.


తెర ముందు..వెనుక

తారాగణం: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్‌ రావల్‌, ఊర్వశి తదితరులు
సంగీతం:  జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి
ఎడిటర్‌: సతీష్‌ సూర్య
స్క్రీన్‌ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర
మాటలు: రాకేందు మౌళి
కథ, దర్శకత్వం: సుధ కొంగర
నిర్మాత: సూర్య
రన్ టైమ్: 2గం|| 33ని||
విడుదల తేదీ: 12 నవంబర్, 2020
స్ట్రీమింగ్ ఓటీటి:  అమెజాన్‌ ప్రైమ్‌