Reading Time: 3 mins

ఆపరేషన్ జావా మలయాళం మూవీ రివ్యూ

సైబర్ క్రైమ్ థ్రిల్లర్: ‘ఆపరేషన్ జావా’ రివ్యూ

Rating:3/5

మనిషి జీవితం డిజిట‌ల్ మయం అయిపోయింది. దాంతో అక్కడా మోసాలు పెరిగిపోయాయి. దొంగతనాలు జరిగిపోతున్నాయి. సైబర్ దొంగలు  ఈజీగా వ‌చ్చేస్తున్నారు. సైలెంట్ గా స‌ర్వం దోచుకుని ద‌ర్జాగా వెళ్లిపోతున్నాడు. ఇదంతా ‘సైబ‌ర్ క్రైమ్స్’ ఎఫెక్ట్.  ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మాట‌…. ‘సైబ‌ర్ క్రైమ్‌’. మ‌న క‌ష్టాన్ని అలవోకగా, కొద్దిపాటి తెలివితో జేబులో పెట్టుకుని వెళ్లిపోతున్న వైట్ కాల‌ర్ నేర‌స్థులు మ‌న చుట్టూ ఉన్నారు. వాళ్ల‌ని మ‌న ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేసిన సినిమా ‘ఆపరేషన్ జావా’.  మళయాళంలో వచ్చిన ఈ ‘సైబ‌ర్ క్రైమ్‌’ మంచి పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఏమిటి ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత, కథ అనేది చూద్దాం.

కథేంటి

సినిమా ఓపెనింగ్ లో .. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి  ఆంటనీ, వినయ దాసన్ అనే ఇద్దరు నిరుద్యోగులు వస్తారు. బీ టెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం తిరిగి విసిగి వేసారిన బాపతు వాళ్ళు. 2015 లో ప్రేమమ్ అనే మలయాళ సినిమా విడుదలవడానికి ముందే నెట్ లో మొత్తం సినిమా లీకైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తమిళరాకర్స్ వెబ్ సైట్ వాళ్ళు పెట్టారని, ఆ సైట్ కి సంబంధించిన వారు .. సింగపూర్ నుంచి దాన్ని ఆపరేట్ చేశారని వారిని పట్టుకొని జైల్లోకి తోసి… కేస్ క్లోజ్ చేస్తారు. అయితే అది తమిళ రాకర్స్ పనికాదని, కేరళ నుంచే ఎవరో దాని సెన్సార్ కాపీని నెట్ నుంచి లీక్ చేశారని ఆ ఇద్దరు కుర్రోళ్ళు పసిగట్టి సైబర్ పోలీసులకు చెబుతారు. అంతేకాదు.. దానికి సంబంధించిన వారిని తమ తెలివితేటల్ని  ఉపయోగించి పట్టిస్తారు. దాంతో ఆ ఇద్దరు కుర్రోళ్ళ పనితీరు మెచ్చుకొని వారిని కాంట్రాక్ట్ బేస్ లో సైబర్ సెల్ లోకి ట్రైనీస్ గా తీసుకుంటారు. అలా ఉద్యోగం లోకి చేరిన వారికి మొదటి కేస్ గా ఆంటనీ..  ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన కేస్ వస్తుంది.

ఆ అమ్మాయికి సింగపూర్ లో 2 లక్షల పేకేజ్ తో నర్స్  ఉద్యోగం వస్తుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కోసం దాదాపు 2 లక్షలు ఆ అమ్మాయి నుంచి లాగి.. మోసం చేస్తారు. ఆకేస్ ను ఛాలెంజ్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. దానికి సంబంధించిన వారిని పట్టుకొంటారు.

ఇక మరో కేసు విషయానికొస్తే..  నగరంలోని ఒక అపార్ట్ మెంట్ లో ఒకమ్మాయి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. అది ఆర్డర్ చేయడానికొచ్చిన డెలివరీ బాయ్.. ఆ అమ్మాయి మీద దాడి చేసి ఇంట్లోని ఖరీదైన వస్తువులు దొంగతనం చేస్తాడు. అదే వ్యక్తి వేరే చోట ఫుడ్ డెలివరీ పేరుతో వచ్చి వృద్ధ దంపతుల్ని మర్డర్ చేస్తాడు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికొచ్చిన పోలీసాఫసర్ కు ఈ కుర్రోళ్ళిద్దరూ హెల్ప్ చేస్తారు.  

ఆ డెలివరీ బాయ్.. ముందుగా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ముందు ఒక లేడీ తో మాట్లాడతాడు. ఆ లేడీని ట్రాప్ చేసి .. ఆ డెలివరీ బాయ్ ను పట్టుకొంటారు. అయితే హంతకుడు అతడు కాదని తెలుస్తుంది. ఆ క్రమంలో అసలు వాడిని ట్రేస్ చేసి పట్టుకొని అరెస్ట్ చేస్తారు.

అయితే.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇంత సహాయం చేసినా.. ఇద్దరు కుర్రోళ్ళ కాంట్రాక్ట్ అయిపోవడంతో..వారిని అపాయింట్ చేసుకొన్న పోలీసులు వాళ్ళకి సారీ చెప్పి.. వేరే ఎక్కడైనా ఉద్యోగం చేసుకోండని పంపిస్తారు. ఆ కుర్రోళ్ళిద్దరూ మళ్ళీ ఉద్యోగ వేటలో పడతారు ఇదీ టోటల్ గా కథ. అయితే దీన్ని ఎంత గొప్పగా తెరకెక్కించారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ …

2015 – 17 లో కొచ్చీ సైబర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన రియల్ లైఫ్ కేసెస్ ఆధారంగా రూపొందించిన సినిమా. ఇందులో ప్రధానంగా మూడు సైబర్ నేరాల కేసులు కనిపిస్తాయి. అయితే అభిమన్యుడు తరహాలో డీప్ ఇన్వెస్టిగేషన్, డీటెయిలింగ్ లాంటివేమీ ఉండవు. కాకపోతే..  ఒకోకేసు ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది.  టెక్నాలజీ పెరిగింది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చింది. దాని వల్ల స్మార్ట్ స్కామ్స్ కూడా పెరిగిపోయాయి. మీ బ్యాంక్ అకౌంట్ వేలిడిటీ అయిపోయింది. మీ ఫోన్ లోకి వచ్చే ఓటీపీ నెంబర్ చెప్పండి అంటూ బ్యాంక్ ఖాతాలోని లక్షలు ఖాళీ చేసే మోసం, 5000 కే ఐఫోన్ అంటూ ప్రకటన చూసి ఆర్డర్ చేస్తే .. సోప్ పెట్టె పంపించే మరో మోసం. ఇవన్నీ నిజజీవితంలో జరుగుతున్న  మోసాలు. వీటిని జనానికి అర్ధమ్యే రీతిలో చెప్పిన సినిమా ఆపరేషన్ జావా.

ఒక్క రక్తం చుక్కకూడా చిందించకుండా..  చాలా సులువైన మార్గాల్లో జనాన్ని దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ళ గుట్టు విప్పే సినిమా ఇది. ఇండియాలో అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాలు జరుగుతున్న రాష్ట్రం కేరళనే.  అయితే ఈ స్కామ్ లోని నేరస్థుల్ని పట్టుకోవడం అంత తేలిక కాదు. ఈ స్కామ్ లోని లింకుల్ని ఛేదించడం పోలీసులకు తలకు మించిన భారం గా మారుతోంది. అమ్మాయిల నకిలీ నగ్న వీడియోల్ని ఆన్ లైన్ లో పంపించి చాటింగ్ లో పెర్సనల్ వివరాలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి.. లక్షల్లో దోచుకొనే కేసులు కోకొల్లలు. ఇలాంటి కేసుల్ని సాల్వ్ చేసేదే సైబర్ సెల్.
నిజానికి సైబర్ సెల్ అనే పేరు మాత్రమే మనం వింటున్నాం. కానీ అది ఎలా పనిచేస్తుంది? నేరస్థుల్ని పట్టుకోడానికి వారు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు? అనేది అంతగా ఎవరికీ తెలియదు.

ఆపరేషన్ జావా సినిమా దాన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. జావా అనేది ఆ ఆపరేషన్ లో ఒక భాగం.  ఇలాంటి ఎన్నో కేసుల్ని ఛేదించేందుకు సైబర్ పోలీసులకు తమ తేలివితేటల్ని ఉపయోగించి.. సాయపడతారు ఆ ఇద్దరు నిరుద్యోగులు. టెక్నికల్ గా చాలా బాగా డీల్ చేసారు.మనందరి జీవితాల్లో జరిగే కథే ఇది. అందుకే అక్క‌డే ఆ పాయింట్ దగ్గరే ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కొట్టేశాడు. ఇది మ‌న కథ‌. నిత్యం మ‌న‌కు ఎదుర‌య్యేదో, మ‌న స్నేహితుల‌కు తార‌స ప‌డేదో, లేదంటే పేప‌ర్లో, టీవీలో చూసేదో.. ఓ భ‌యంక‌ర‌మైన స‌మ‌స్య‌ని క‌థ‌గా రాసుకున్నాడు. అందుకే క‌థ‌లో ప్రేక్ష‌కుడు లీన‌మైపోతాడు. సైబ‌ర్ క్రైమ్ నేరాలు ఓ వైపు చూపెడితేనే కథలో మలుపులు తీసుకుని ఇంట్రస్టింగ్ గా నడిపారు.

 టెక్నికల్ గా …

ఫస్ట్ హాఫ్ లో కొన్నిసీన్స్, మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు టెన్షన్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో.. ఆ టెక్నాలజీ వల్ల ఉప‌యోగం ఎంత ఉంటుందో, న‌ష్టం కూడా అంతే ఉంటుందనే విషయాన్ని హైలెట్ చెప్పిన మెసేజ్ బాగుంది. డైరక్టర్ .. సామాన్య ప్రేక్ష‌కుడు త్వ‌ర‌గా క‌నెక్ట్ అయ్యే క‌థ‌ని ఎంచుకున్నాడు. లేటెస్ట్ టెక్నాలజీ  గురించి అందులో జ‌రుగుతున్న మోసాల గురించీ అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. త‌న‌కు మిగిలిన టెక్నికల్ డిపార్టమెంట్స్  నుంచి స‌రైన స‌హ‌కారం అందింది. కెమెరా వ‌ర్క్‌, ఎడిటింగ్‌ బాగుంది.  ద‌ర్శ‌కుడు త‌న ఇంటిలిజెన్స్ ని వాడిన చోట‌.. మెప్పించాడు. డైలాగులు బాగున్నాయి.  

చూడచ్చా..

ఖచ్చితంగా చూడాల్సిన సినిమా

తెర వెనక, ముందు…

బ్యానర్ వి సినిమాస్ ఇంటర్నేషనల్
నటీనటులు :  బాలు వర్గ్సీ, లుక్ మ్యాన్ ఆవరాన్, బిను పప్పు, అర్దిద్, వినాయకన్, షైన్ టామ్ చాకో తదితరులు.  
 సినిమాటోగ్రాఫర్‌: ఫయిజ్ సిద్దిక్
ఎడిటర్స్‌: నిషాద్ యూసఫ్
మ్యూజిక్‌: జాకోస్ బిజోయ్
రచన, దర్శకత్వం‌: తరుణ్ మూర్తి
నిర్మాతలు: పద్మ ఉదయ్
రన్ టైమ్: 146  నిముషాలు.
ఓటీటి: జీ 5
విడుదల తేదీ: 14,మే, 2021.