Reading Time: 2 mins

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు చిత్రం కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌

లెజెండ్ ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా సుశాంత్ చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌. వ‌చ్చే వారం షూటింగ్ ప్రారంభం

యంగ్ హీరో సుశాంత్ ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. దాని త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌. ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌.

సెప్టెంబ‌ర్ 20 ఆదివారం న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’లోని సుశాంత్ కొత్త పోస్ట‌ర్‌ను చిత్రం బృందం విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సుశాంత్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌పై కూర్చొని స్టార్ట్ చెయ్య‌డంతో రోడ్డుపై ఉన్న నీళ్లు చింది పైకి లేచాయి. అందుకు త‌గ్గ‌ట్లు ఒక చేత్తో హ్యాండిల్ ప‌ట్టుకొని, మ‌రొక చేతిని పైకిలేపి, సంతోషాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు సుశాంత్‌. పోస్ట‌ర్‌పై “గేర్ మార్చి బండి తియ్!!!” అనే అక్ష‌రాలు క‌నిపిస్తున్నాయి. అవి హీరో ఎలాంటి సెల‌బ్రేష‌న్ మోడ్‌లో ఉన్నాడో తెలియ‌జేస్తున్నాయి.

వ‌చ్చే వారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో “లెజెండ్‌ ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటూ త్వ‌ర‌లో ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ షూటింగ్” అంటూ ట్వీట్ చేశారు. “ఏఎన్నార్ లివ్స్ ఆన్” అనే హ్యాష్‌ట్యాగ్‌ను దానికి జోడించారు.

హీరో సుమంత్ సైతం ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. మొద‌ట తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావును గుర్తు చేసుకుంటూ “ఆప్యాయ‌త నిండిన అన్ని జ్ఞాప‌కాలు ఈ రోజు ఎక్కువ‌గా మెదులుతున్నాయి. తాతా.. మీ లాగా ఇంకెవ‌రూ ఉండ‌రు. మీ జీవితంలో ఒక చిన్న భాగ‌మైనందుకు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను, కృత‌జ్ఞుడ‌నై ఉంటాను” అని భావోద్వేగ‌పూరితంగా రాసుకొచ్చారు.

ఆ త‌ర్వాత‌, “మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్!!!” అని ట్వీట్ చేశారు సుశాంత్‌. “ఐవీఎన్ఆర్” (ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు), “నో పార్కింగ్” అనే హ్యాష్‌ట్యాగ్‌ల‌ను జోడించారు.

ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌కు సైతం మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని చిత్ర బృందం తెలిపింది.

ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
సుశాంత్‌, వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య‌, నిఖిల్ కైలాస‌, కృష్ణ‌చైత‌న్య‌

సాంకేతిక బృందం:
సంభాష‌ణ‌లు:  సురేష్ భాస్క‌ర్‌
సంగీతం:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
సినిమాటోగ్ర‌ఫీ: ఎం. సుకుమార్‌
ఎడిటింగ్‌:  గ్యారీ బీహెచ్‌
ఆర్ట్‌:  వి.వి.
నిర్మాత‌లు: ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల
ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌. ద‌ర్శ‌న్‌
బ్యాన‌ర్స్‌:  ఏ1 స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్‌