Reading Time: 3 mins

ఉప్పెన మూవీ రివ్యూ

ముంచలేదు.. మించలేదు :’ఉప్పెన’ మూవీ రివ్యూ

Rating:2.75/5

‘నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం’

అవునండీ ఈ పాట అంటే నాకు భలే ఇష్టం. ఎప్పుడు తెర మీద చూద్దామా అని ఎదురుచూస్తున్నాను. మొత్తానికి మన ‘మెగా’ మేనల్లుడు ‘ఉప్పెన’ లా భాక్సీఫీస్ మీద విరుచుకుపడటానికి థియోటర్స్ లో దిగాడు. కొత్త డైరక్టర్,కొత్త హీరోయిన్, కొత్త హీరో..అబ్బో ఈ సినిమాలో దాదాపు తొంభై శాతం పైగా కొత్తవాళ్లే. విజయ్ సేతుపతి లాంటి ఒకరిద్దరు తెలుసున్న వాళ్లు తప్ప. ఈ సినిమా కథ గురించి కన్నా ఈ సినిమా క్లైమాక్స్ గురించి జనాలు సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకున్నారు. అదేంటో మీకు తెలుసు. ఆ మ్యాటర్ ఇక్కడ చెప్పను కానీ ..కథను ఓ రెండు లైన్ల లో చెప్పేస్తాను..అంతకు మించి కథ సినిమాలోనూ లేదనుకోండి..

స్టోరీ లైన్

ఉప్పాడ అనే ఊళ్లో సముద్రం. అక్కడ జాలర్ల ఫ్యామిలీకు చెందిన ఆశీర్వాదం. ఈ కుర్రాడిని అందరూ ఆశీ అని పిలుస్తూంటారు. అతనే ఈ కథకు హీరో.సముద్రం ఒడ్డునే తిరుగుతూ తండ్రి చేస్తున్న చేపల వ్యాపారంలో ఓ చెయ్యేస్తూ హ్యాపీగా జీవితం గడిపేస్తూంటాడు. అతని జీవితంలో చేపలు, సముద్రం,ప్రెండ్ తాలింపు కాకుండా బేబమ్మ కూడా ఉంటుంది. బేబమ్మ అంటే మన ఆశిర్వాదానికి చిన్నప్పటినీ భలే ఇష్టం. అదే పెరిగి పెద్దయ్యాక కాలేజీలో చేరినా పోలేదు. వేరే అమ్మాయిపై మనస్సు పోలేదు. అయితే ఆ విషయాలన్ని బేబమ్మకు తెలియదు. ఉమెన్స్ కాలేజీలో చేరిన ఆమె..ఓ రోజు జరిగిన ఓ సంఘటనతో మొత్తానికి ఆశ్వీరాదంతో ప్రేమలో పడిపోతుంది. ప్రేమలో పడిన పిల్ల ఆగుతుందా..ఆశీర్వదం ని సీక్రెట్ గా కలుసుకుంటూ ఉంటుంది. సీక్రెట్ గా ఎందుకూ అంటే బేబమ్మ నాన్నకు భయపడి. బేబమ్మ తండ్రి రాయణం అదే విజయ్ సేతుపతి పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ ఊరి పెద్ద. ఆయనకు కులం,పరువు అనేవి కుడి,ఎడమ భుజాలు లాంటివి. అలాంటి పెద్దాయనకు తమ కులం కన్నా చిన్న కులపోడు కుర్రాడు వచ్చి అల్లుడు అవుతానంటే ఒప్పుద్దా. ప్రాణం పోయినా వాళ్ల ప్రేమ గెలవకూడదంటాడు. అందుకోసం మొదట వీళ్లిద్దరి విడకొడదామని ప్రయత్నిస్తే ఈ జంట లేచిపోతారు. దాంతో రాయనం కు మండిపోతుంది. తగిన బుద్ది చెప్పాలనుకుంటాడు. ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటో మీకు నేను చెప్పను..తెరమీద చూడండి.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాగిన ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా బాగా వీక్ అనే చెప్పాలి. ఎక్కడో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ని బేస్ చేసుకుని మిగతా సీన్స్ అల్లారు. అప్పటిదాకా ప్రేక్షకుడుకి ముఖ్యంగా సెకండాఫ్ లో సహన పరీక్ష పెట్టారు. క్లైమాక్స్ కూడా ఎంతమందికి పడుతుంది అనేది సందేహమే. ఎందుకంటే ఆ తర్వాత హీరోయిన్ చేత చెప్పించిన డైలాగుల్లో లాజిక్ అంతగా అనిపించదు. అలాగే కథే మరీ మధ్యయుగాల కాలం నాటిది తీసుకున్నారు. అయితే ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక విలన్‌ క్యారెక్టర్‌ పరువు కోసం ఏదైనా చేస్తాడు అనే బాగా హైలెట్ చేస్తూ పోయారు. అయితే తగినట్లుగా సీన్స్ మనకు ఆ తర్వాత కనపడవు. క్యారక్టర్ పడేసారు. విజయ్ సేతుపతి వంటి ఆర్టిస్ట్ చేయటంతో నిలబడింది కానీ లేకపోతే పూర్తిగా డ్రాప్ అయ్యిపోయేది. పోనీ సినిమాలో ప్రేమ కథలో వచ్చే సీన్స్ లో కొత్తదనం ఉందా అదీ లేదు. పరమ రొటీన్. ఏతావాతా మనకు అర్దం అయ్యేది ఏమిటీ అంటే..సంగీతం, మిగతా డిపార్టమెంట్స్ కు టాప్ టెక్నీషియన్స్ పనిచేయటం, విజయ్‌ సేతుపతి, కావాల్సినంత ఖర్చు పెట్టే మంచి నిర్మాణ సంస్థ లేకపోతే.. ఉప్పెన ..ఉప్పెనలో కలిసిపోయేదే. ఏదైమైనా క్లైమాక్స్ ట్విస్ట్ మీద బేస్ అయ్యారు కాబట్టి అది పట్టిందా..నిర్మాతలకు పట్టింది బంగారమే..చూద్దాం.

కొత్త కుర్రాడు..యాక్టింగ్ స్క్రిల్స్

ఇక ఈ సినిమాలో హీరోగా పరిచయం అయియన వైష్టవ్ తేజ్ గురించి చెప్పాలంటే అదరకొట్టాడు. ముఖ్యంగా అతని కళ్లు అద్బుతం. అలాగే హీరోయిన్ గా చేసిన అమ్మాయి అయితే వరస బిజీ అయ్యిపోతుంది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి.విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..మొన్నే మనం మాస్టారు లో చూసాం. అంతకు మించి ఈ సినిమాలో ‘రాయనం’ పాత్రలో విశ్వరూపం చూపెట్టాసాడు. చాలామంది ప్రేక్షకులు ఆయన్ని చూడటం కోసం సినిమాకు వెళతారని అనడంలో అతిశయోక్తి లేదు. మిగతా నటీనటులు అందరూ కూడా ఎమోషన్స్ బాగా పండించారు.

డైరక్షన్..మిగతా విభాగాలు..

కొత్త డైరక్టర్ ఎలా తీసాడు అంటే ..అచ్చం సుకుమార్ తీసినట్లే ఉంది. ఆయన శిష్యుడు కదా. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది. మరోసారి తనదైన శైలి బాణీలతో అలరించారు.కెమెరా వర్క్ అయితే ఎమేజింగ్ అనాలి. ఆర్ట్ వర్క్ కూడా సూపర్బ్.స్క్ర్రిప్టే సరిగ్గా చేసుకోలేదు. ఆ విషయమే ఈ సినిమాలో బాగా కనపడే లోటు. డైలాగులు బాగున్నాయి. నిర్మాతలు పెట్టిన డబ్బు ఖర్చు కూడా బాగుంది.

చూడచ్చా

మీకు రూరల్ లవ్ స్టోరీలు, కాస్తంత తమిళ వాసనలతో కలిపి ఉన్నవి ఇష్టం అయితే తెగ నచ్చుతుంది.

తెర ముందు వెనక..

బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
నటీనటులు: పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ తదితరులు.
సంగీతం: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనికా రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
సీఈవో: చెర్రీ
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
రన్ టైమ్ : 2గంటల, 27 నిముషాలు
విడుదల తేదీ: పిభ్రవరి 12,2021.