Reading Time: 2 mins

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్స్ ప్రకటన

శ్రీదేవి, రేఖ‌ల‌కు  ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి చేతుల‌మీదుగా ప్ర‌దానం – అక్కినేని నాగార్జున

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు`. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తికి వారి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది.
 
 
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దేవానంద్‌ 2006లో మొదటి ఈ అవార్డును అందుకున్నారు. ఇటీవల 2017లో ‘బాహుబలి’ ఆలిండియా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ఈ అవార్డు వచ్చింది.
 
2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది.
 
ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌వనున్నారు.  న‌వంబ‌ర్‌17న సాయంత్రం 5 గంట‌ల‌కి  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.  
 
 
ఈ సందర్భంగా న‌వంబ‌ర్ 14న  హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి చైర్మ‌న్, కళాబంధు, డా. టి. సుబ్బరామిరెడ్డి , అక్కినేని నాగార్జున పాల్గొన్నారు.

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి  చైర్మ‌న్, కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – గ్రేట్ అవార్డ్ అయిన `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్` కార్యక్రమం నవంబర్‌ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరగనుంది. ఎఎన్‌ఆర్ గారు  గ్రేట్‌ పర్సనాలిటీ, తరతారలకు అందరి గుండెల్లో జీవించి ఉండే మహోన్నత వ్యక్తి . న‌టుడిగానే కాకుండా వ్యక్తిత్వంలోగానీ, మానవత్వంలోగానీ ఆయనకు ఆయనే సాటి. అటువంటి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు త‌న‌కి  `దాదాసాహెబ్‌ ఫాల్కే` అవార్డు వచ్చినప్పుడు నన్ను పిలిచి భవిష్యత్తులో ‘ఎఎన్‌ఆర్ నేష‌న‌ల్ ఫిలిం అవార్డు’ స్థాపించి నేను ఉన్నా, లేకున్నా నాతరంవారిచే నేష‌న‌ల్ లెవ‌ల్‌లో సినీ ప‌రిశ్ర‌మ‌లోని గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ అవార్డుని ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. మంచి ఆలోచ‌న అని 2006లో ` ఎఎన్‌ఆర్‌ నేషనల్ అవార్డ్‌` స్థాపించి మొద‌టి సంవ‌త్స‌రం న‌టుడు దేవానంద్ కి అంద‌జేయ‌డం జ‌రిగింది. 2017లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ అవార్డ‌ను అందుకున్నారు. ప్ర‌స్తుతం 2018 సంవత్సరానికిగాను శ్రీదేవి, 2019కిగాను రేఖలకు నవంబర్‌ 17న ఈ అవార్డు ప్రదానం చేయబోతున్నాం. అంద‌రూ గ‌ర్వంచే మ‌హాన‌టి శ్రీదేవికి ఈ అవార్డ్ ఇవ్వాల‌నేది నాగేశ్వ‌ర‌రావు గారి కోరిక కూడా. అదే ర‌కంగా తెలుగు అమ్మాయి అయిన రేఖ కూడా జాతీయ స్థాయిలో ఎంతో పేరు సంపాదించింది. ఆమెకు కూడా ఈ అవార్డ్ ఇవ్వాలని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఈ నెల 17వ తారీకున సాయంత్రం 5 గంట‌ల‌కి  అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతుంది.  ఈ సందర్భంగా ఆయన తండ్రిగారి కోరికను మనసులో ఉంచుకొని నెరవేరుస్తున్నందుకు నాగార్జునగారిని మెచ్చుకోవాలి. ఆయ‌న ఈ బాద్య‌త‌లు చేప‌ట్పిన త‌ర్వాత గ్రేట్ ప‌ర్స‌నాలిటీస్‌ అయిన అమితాబ్‌ బచ్చన్ గారికి, రాజమౌళి గారికి ఈ అవార్డును అంద‌జేశారు. అంత బాద్య‌త‌గా త‌న తండ్రి కోరిక‌ను నెర‌వేరుస్తున్నందుకు నాగార్జున గారిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను” అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”సుబ్బరామిరెడ్డిగారు చెప్పినట్లు ఈ అవార్డు మాకు చాలా ప్రెస్టీజియస్‌ అవార్డు. ఇది నాన్నగారి కోరిక. ఆయన పేరు ఉన్నంతవరకు ఈ అవార్డును కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ అవార్డు ఇంత సక్సెస్‌ఫుల్‌ అవ్వడానికి సుబ్బరామిరెడ్డిగారు కూడా ఒక కారణం. సుబ్బరామిరెడ్డిగారిలో ఒక గమ్మత్తైన క్వాలిటీ ఉంది. నాన్నగారికి ఎంత క్లోజ్‌ ఫ్రెండో నేనుకూడా ఆయనకి అంత క్లోజ్‌ ఫ్రెండ్‌ అయ్యాను. నాన్నగారు వెళ్ళిపోయాక మా ఫ్యామిలీకి ఆయన పెద్ద దిక్కు. సుబ్బరామిరెడ్డిగారు ఎప్పుడూ ఈ అవార్డుకి బోర్డు చైర్మ‌న్‌గా ఉండాలనేది నాన్నగారి కోరిక. ఆయన గైడెన్స్‌తోనే ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌గారితో మొదలుపెట్టి అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్థాపించి ఏడేళ్ళు అవుతుంది. అది రోజురోజుకీ పెరిగి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ కూడా వస్తున్నారు. దాదాపు 450 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వారి గ్రాడ్యుయేషన్‌ సెర్మనీ ఈ అవార్డు ఫంక్షన్‌తో కలిపి చేయడం మొదలుపెట్టాం. కొంతమంది స్టూడెంట్స్‌కి అమితాబ్‌ బచ్చన్‌గారి చేతులమీదుగా, రాజమౌళిగారి చేతులమీదుగా గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చాం. ఈ సంవత్సరం రేఖగారి చేతులమీదుగా దాదాపు 70 మందికి అందజేయనున్నాం. శ్రీదేవిగారి తరపున ఈ అవార్డు తీసుకోవడానికి బోనీకపూర్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. అలాగే రేఖగారికి ఫోన్‌ చేయగానే ‘నాన్నగారికి, నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దగ్గర్నుంచి ఫిల్మ్‌ ఇండస్ట్రీ గైడెన్స్‌ తీసుకున్నాను. తప్పకుండా వస్తానుఅని చెప్పారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌వుతారు.  అవార్డులతో పాటు వీరిద్దరికి 5 లక్షల ప్రైజ్‌ మనీ ఇవ్వబడుతుంది ” అన్నారు.