Reading Time: 2 mins

ఎన్.టి.ఆర్ శత జయంతి  వేడుకలు

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి  వేడుకలు, వెబ్ సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారి చరిత్ర భావి తర తరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశ్యంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి జనార్దన్ తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్.టి.ఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ జనార్దన్ మీడియాతో మాట్లాడారు.

ఎన్. టి. రామారావు గారు సినిమా రంగంలో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలను పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో ప్రజానాయకుడుగా జేజేలందుకున్నారు. వారు తెలుగునాట మాత్రమే కాదు, భారత రాజకీయాలలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించి, జాతీయ నాయకుడుగా ప్రతిపక్షాలను. ఏకత్రాటి మీదకు తెచ్చిన దూరదృష్టి కల నాయకుడు, ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారి కి మార్గదర్శకం కావాలనే ఉద్ధేశ్యంతో మా కమిటీ ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసిందని జనార్దన్ తెలిపారు .

రామారావు గారి సినిమా ప్రస్థానం, రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్.టి.ఆర్ వెబ్ సైట్ రూపకల్పన జరుగుతోంది. అలాగే రామారావు గారితో చిత్ర రంగంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ రంగంలో వారితో సాన్నిహిత్యం వున్న నాయకులు, పనిచేసిన వారి వ్యాసాలు, ప్రముఖుల కథనాలు, సందేశాలు, అరుదైన ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక రూపొందుతుందని జనార్దన్ చెప్పారు. అలాగే రామారావు గారు శాసన సభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురిస్తున్నామని జనార్దన్ తెలిపారు.

రామారావు గారు నటుడుగా మూడున్నర దశాబ్దాలలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. మూడు తరాల ప్రేక్షకులకు ఆయన అభిమాన నటుడయ్యారు. సినీ రంగంలో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అపూర్వం, అనితర సాధ్యం. కేవలం నటుడిగానే కాక ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అన్నగా నేనున్నానంటూ ముందు కొచ్చి ఆదుకున్నాడు. రాయలసీమ కరవు, చైనా యుద్ధం, దివిసీమ సీమ ఉప్పెన లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, దేశరక్షణ కోసం నిధులు సమకూర్చడానికి సహా నటీనటులతో కలసి విరాళాలు సేకరించారు. ఆయన చేసిన అసమాన సేవ ఆయన్ని రాజకీయ రంగం వైపు నడిపించిందని జనార్దన్ తెలిపారు.

తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనకు చరమ గీతం పలకాలని నట జీవితాని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన మహోన్నత నాయకుడు, ఆదర్శ ప్రజా సేవకుడు, తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత అన్న ఎన్. టి. ఆర్ అని జనార్దన్ చెప్పారు.

సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రను సృష్టించాయి. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, మహిళలకు ఆస్తిలో హక్కు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని, నిలువనీడ కల్పించలేని, కట్టుకోవడానికి గుడ్డ ఇవ్వలేని రాజకీయం ఎందుకని? ఆయన ఆవేదనతో ప్రశ్నించారు. అది నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో చివరి వరకూ కృషి చేశారని జనార్దన్ చెప్పారు.

రామారావు గారు భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆయన ఇప్పటికీ జాతికి స్ఫూర్తి నిస్తూనే వున్నారు. ఆయన జీవితం తర తరాలకు మార్గదర్శనము కావాలనే ఈ మహాయజ్ఞానికి పూనుకున్నామని జనార్దన్ తెలిపారు. ఎన్.టి.ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ, హైదరాబాద్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని, తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారు, ఇతర జాతీయ నాయకులు, సినిమారంగ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు.

ఈ కమిటీలో సీనియర్ నాయకులు ఎమ్.ఏ. షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్, తెలుగు వన్ కంఠంనేని రవి శంకర్, నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, అట్లూరి నారాయణ రావు, సీనియర్ జర్నలిస్టులు భగీరథ, విక్రమ్ పూల, పారిశ్రామిక వేత్త మధుసూదన రాజు, మండవ సతీష్, కాసరనేని రఘురామ్ శ్రీపతి సతీష్ వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామ్మోహన్ రావు, సత్యనారాయణ, వినాయకరావు తదితరులు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారని జనార్దన్ తెలిపారు.

అయితే ఈ ప్రయత్నానికి అన్నగారి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు, అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా తమకు పంపించాలని మీడియా ద్వారా జనార్దన్ విజ్ఞప్తి చేశారు.