ఎన్.టి.ఆర్ శత జయతి వేడుకలు
ఎన్.టి.ఆర్ మాకు దేవుడు ఎన్.టి.ఆర్ శత జయతి వేడుకల్లో – పద్మభూషణ్ కె.పద్మనాభయ్య
ఎన్.టి.ఆర్ శత జయతి వేడుకల్లో భాగంగా కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ ,ఎన్.టి.ఆర్ ఇంటర్నేషనల్ క్యారికేచర్ ,పోయెట్రీ అవార్డులు మరియు సేవ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని జింఖానా క్లబ్ లో నిర్వహించారు, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి కే.పద్మనాభయ్య ,నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ,నిర్మాత అట్లూరి నారాయణ రావు ,భగీరథ, ఇన్ కం టాక్స్ కమీషనర్ జీవన్ లాల్, తదితరులు పాల్గొన్నారు గజల్ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు అనంతరం ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ కన్వీనర్ అట్లూరి నారాయణ రావు ,భగీరథ అతిధులకు ,తమ కమిటీ ప్రచురించిన :శకపురుషుడు , ఎన్.టి.ఆర్ .శాసన సభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్ చారిత్రిక ప్రసంగాలు, పుస్తకాలను బహుకరించారు.
ఈ సందర్భంగా కె.పద్మనాభయ్య మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు తెర మీద పోషించిన శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , శ్రీవెంకటేశ్వర స్వామి , శివుడు , మహా విష్ణువు పాత్రలతో ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారని, తాను కూడా రామారావు గారిని అదే దృష్టి తో చూస్తానని రామారావు గారు నటుడుగా , రాజకీయ నాయకుడుగా చరిత్ర సృష్టించారని , తెలుగు జాతికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయుడని చెప్పారు .
జీవన్ లాల్ మాట్లాడుతూ – ఈరోజు ఇలా కమీషనర్ గా ఉన్నానంటే అది రామారావు గారు పెట్టిన భిక్షే . అప్పుడు వారు గురుకుల పాఠశాలలు ప్రారంభించడం వల్లనే , ఆర్ధిక స్తోమతు లేని నేను అక్కడ చదివానని ఆయన చెప్పారు . తెలుగంటే నాకు ఎంతో మక్కువ , తెలుగు భాషకు , సంస్కృతికి రామారావు గా చేసిన కృషి అనన్య సామాన్యమని జీవన్ లాల్ చెప్పారు . మధ్య యుగాల నాడు కృష్ణదేవరాలయాలు తెలుగు భాషకు ఎంతో సేవ చేశారని , మళ్ళీ శతాబ్దాల తరువాత రామారావు గారు తెలుగు వల్లభుడుగా కీర్తిగాంచారని చెప్పారు .
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు గారు నివసించిన నిమ్మకూరులోనే తమ కుటుంబం ఉండేదని , అదే ప్రాంగణంలో తాము కూడా వుండేవారిమని , వారి గొడ్లసావడి లోనే తాను జన్మించానని చెప్పారు . రామారావు గారి స్ఫూర్తి తోనే తాను కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని అన్నారు .