Reading Time: 3 mins

 

 ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ రివ్యూ

కొంతే ఎస్ : ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ రివ్యూ
రేటింగ్: 2.5 / 5
 
ఓటీటిలోకి వెళ్లలేక  చాలా కాలంగా వెయిట్ చేస్తున్న చిన్న సినిమాలు దైర్యం చేసి వచ్చేస్తున్నాయి.ఆ క్రమంలో చిన్న సినిమాల్లో పెద్ద క్రేజ్ తెచ్చుకున్న‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సైతం యస్ ఇదే రైట్ టైమ్ థియోటర్స్ లోకి దూకింది. ఓటీటి ఆఫర్స్ ని వద్దనుకున్న ఈ సినిమా థియోటర్ లో ఏ స్దాయి మ్యాజిక్ చేసింది. మాస్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంటూ గమ్మత్తైన ప్యాకేజీ చేసిన ఈ సినిమా కథేంటి.హీరోనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సెట్ చేసుకుని రంగంలోకి దిగిపోయిన ప్రయత్నం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
 
 స్టోరీ లైన్

అనగనగా ఓ కడప కుర్రాడు  క‌ళ్యాణ్ (కిర‌ణ్ అబ్బ‌వరం) . అతనికి వారసత్వ ఆస్దిగా ఓ కల్యాణమండపం వస్తుంది. తాత నిర్మించిన ఆ కళ్యాణమండపం ఆ రోజుల్లో ఓ వెలుగు వెలిగింది. తన తాగుబోతు తండ్రి ధ‌ర్మ (సాయికుమార్‌)  హయాంలో ఇప్పుడు ఆరిపోయిన దీపంలా రెప రెపలాడుతోంది.  తాకట్టులోకి వెళ్లిపోయింది. దాంతో తల్లి(తులసి) ప్రేరణతో తాత వారసత్వాన్ని నిలబెట్టాలని, కళ్యణమండపాన్ని రిన్నోవేట్ చేసి నిత్య క‌ళ్యాణం… ప‌చ్చ‌తోర‌ణంగా మార్చాలని రంగంలోకి దూకుతాడు.  త‌న చ‌దువుని ఆపేసి మరీ క‌ళ్యాణ‌మండ‌పం బాధ్య‌త‌లు తీసుకుంటాడు. కష్టపడి కళ్యాణమండపం నిలబెట్టాక  పూర్వ వైభ‌వం తిరిగొచ్చాక ఓ ట్విస్ట్ పడుతుంది. అదే కళ్యాణమండపంలో తన లవర్ సింధు (ప్రియాంక జవాల్కర్‌) పెళ్లి చేయాల్సిన సిట్యువేషన్ ఏర్పడుతుంది. పెళ్లి ఆపి తను చేసుకుంటే కళ్యాణమండపం విలువ పడిపోతుంది. చేసిన శ్రమ అంతా పోతుంది. అప్పుడు కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు…ఎలా ఆ క్రిటికల్ సిట్యువేషన్  నుంచి బయిటపడ్డాడు.తండ్రి ధ‌ర్మ‌తో కళ్యాణ్ కు మాటలు లేకపోవటానికి కార‌ణ‌మేమిటి? అనేదే మిగతా సినిమా కథ.
 

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

హీరో…టిఫెన్ సెంటర్ పెట్టి డవలప్ చేస్తానంటూ మిడిల్ క్లాస్ మెలోడోస్ అనే సినిమా ఓటీటిలలో వచ్చింది. ఇదిగో ఇప్పుడు హీరో కళ్యాణమండపం రిన్నోవేట్ చేస్తూనంటూ  ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ అనే సినిమా రంగంలోకి దిగింది. ఇలా మనదైన,మన చుట్టూ కనపడే సమస్యలను బేస్ చేసుకుని అల్లే కథలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయనటంలో సందేహం లేదు.అయితే ఆ కథను చెప్పే విధానమే కరెక్ట్ గా ఉండాలి. అలాగే  లొకేషన్ కూడా కథలో ఓ క్యారక్టర్ అయ్యి…సినిమా దాని చుట్టూ తిరగటం బాగుంటుంది. ఇక్కడా కథ కళ్యాణమండపం చుట్టూ తిరుగుతుంది. అయితే కళ్యాణమండపంని ఒకటైమ్ లో వదిలేస్తుంది. అప్పుడే మనమూ సినిమాను వదిలేస్తాము. ఫస్టాఫ్ అంతా కళ్యాణమండపం డవలప్ మెంట్ ,రిన్నోవేషన్ మీద దృష్టి పెట్టిన డైరక్టర్, సెకండాఫ్ కు వచ్చేసరికి పట్టు వదలేసాడు. దాంతో సెకండాఫ్ రిపేర్ కు వెళ్లాల్సిన సిట్యువేషన్ వచ్చింది. ఇంటర్వెల్ దగ్గ  కామెడీతో బేస్ లైన్ బాగా సెట్ చేసిన రైటర్.. సెకండాఫ్ లో చేతులెత్తేసాడు. తను ఎంచుకున్న స్టోరీలైన్ ని వదిలేసి సెంటిమెంట్ ని పట్టుకుని వీరంగం ఆడేసాడు.డెప్త్ గా చూపెట్టాల్సిన తండ్రీకొడుకుల సంబంధాన్ని అటు ఎంటర్టైనింగ్ గా ఇటు ఎమోషనల్ గానూ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు.  అందుకు కారణం అవసరమైన బలమైన సీన్లు ఈ చిత్రంలో కరువయ్యాయి. తండ్రి వైఫల్యానికి కారణం ఏమిటో తెలిసి కూడా కొడుకు మాట్లాడకపోవడంలో ఔచిత్యం ఎంత వెతికినా కనిపించదు. దాంతో ఆ సెంటిమెంట్ సీన్స్ ను కూడా ప్రేక్షకులను కదిలించలేవు. దానికి తోడు రొటీన్ స్క్రీన్ ప్లే ..తర్వాత ఏం జరుగుతుందో చెప్పేస్తుంది.   కళ్యాణ మండపం రిజిస్టర్ లో ఒక్కసారి పేరు రాసిన తర్వాత, ఆ పెళ్ళి ఎలాగైనా జరగాల్సిందే అనే సెంటిమెంట్ మీద కథ వెళ్తే సినిమా పండేది. దానికి తోడు హీరో స్నేహితులు, వారి మధ్య ఎప్పుడూ తాగుడు గోలే. ఆ సీన్స్ సైతం పరమ రొటీన్ గా ఉన్నాయి. హీరో లవ్ ట్రాక్ లో అతి అదిరిపోయే ట్విస్ట్ అనుకుని ప్రవేశపెట్టిన అనవసరపు పెళ్లికొడుకు వ్యవహారం అసలు పేలలేదు. ఏదైమైనా హీరో బిల్డ‌ప్ సీన్స్‌పైనే బాగా కసరత్తు చేసినట్లున్నారు. అవి తప్పించి సినిమాలో ఏమీ లేవు అనేంతగా రిజిస్టర్ అయ్యాయి.
 

టెక్నికల్ గా..

 మీడియం బడ్జెట్  సినిమా అయినా సాంకేతికంగా సినిమా క్వాలిటీగానే ఉంది. ముఖ్యంగా పాట‌లు తీసిన విధానం, సంగీతం నచ్చుతాయి. కెమెరా ప‌నిత‌నం కూడా ప్లస్ అయ్యింది. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూస్  మ‌రీ నాసిర‌కంగా ఉన్నాయి. క‌ళ్యాణ‌మండ‌పం అని టైటిల్ లో ఉన్న బిల్డప్, హంగామా, హడావిడి సినిమలో కనిపించలేదు. కేవలం బోర్డ్  తో ఆ ప్లేవర్ ఎలా వచ్చేసుంది. ఇక తొలి చిత్రం అయినా డైరక్టర్ తన ముద్ర అంటూ వేయలేకపోయాడు.  అసలు చాలా చోట్ల సినిమా టేకింగ్ నే  సహనానికి పరీక్ష పెట్టింది. ఉన్నంతలో  క‌థ‌, మాట‌ల ర‌చ‌యిత‌గా కూడా కిర‌ణ్ అబ్బ‌వ‌రం మెప్పిస్తాడు.  ‘సిగ్గెందుకురా మామా’ పాట బాగుంది. మాస్ ను పట్టుకుంటుంది.  చేతన్ భరద్వాజ సంగీతం చాలా ప్లస్ అయ్యింది. శంకర్ ఫైట్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ రెండు ఎపిసోడ్ లు ఆ విషయంలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తాయి. డైలాగుల్లో పెళ్లిళ్ల గురించి హీరో ఇచ్చే  స్పీచ్ మాత్రం బాగుంది. అలాగే పనిగట్టుకుని క‌డ‌ప‌జిల్లా రాయ‌చోటి నేప‌థ్యం తీసుకున్నప్పుడు. ఆ రాయ‌ల‌సీమ యాస ని వదిలిపెట్టకూడదు. అయితే  హీరో మిన‌హా మిగిలిన పాత్ర‌లేవీ ఆ యాస మాట్లాడ‌వు.
 

నటీనటుల్లో  సాయి కుమార్, తులసి, హీరో , తణికెళ్ల వంటి మెయిన్ కాస్టింగ్  తప్ప సపోర్టింగ్ క్యారెక్టర్ లు చేసిన నటులు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. క‌ళ్యాణ్ పాత్ర‌లో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయారు. హీరోయిన్ ని గ్లామర్ కోసం బాగానే సీన్లలో బాగానే వాడారు.

చూడచ్చా
ఎక్సపెక్టేషన్స్ లేకుండా ఓ లుక్కేయచ్చు. అదీ సెకండాఫ్ లో కాస్త ఓపిక చేసుకోగలిగితేనే.


తెర ముందు..వెనుక
బ్యానర్ : ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయి కుమార్, తులసి, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, తనికెళ్ళ భరణి, అరుణ్, అనిల్ జీల, భరత్, కిట్టయ్య తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిరణ్ అబ్బవరం
ఛాయాగ్రహణం: విశ్వాస్ డేనియల్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పాటలు: భాస్కరభట్ల, కృష్ణా కాంత్
నిర్మాతలు: ప్రమోద్, రాజు
సహా నిర్మాత: భరత్ రొంగళి
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యాం
దర్శకత్వం: శ్రీధర్ గాదె
రన్ టైమ్ :160 నిముషాలు
విడుదల తేదీ: 6 , ఆగస్ట్ 2021