Reading Time: 3 mins

కృష్ణ అండ్ హిజ్ లీల మూవీ రివ్యూ

ట్రయాంగిల్ ప్రేమ గోల (‘కృష్ణ అండ్ హిజ్ లీల’ రివ్యూ)
Rating:2.5/5

బోయ్ ప్రెండ్ ఉన్నాడా లేదా?
వాట్
ఉన్నాడా లేడా
ఉన్నాడు…
నాకూ..గర్ల్ ప్రెండ్ ఉంది
నేను అడగలేదే…
అంటే నాకు బోయ్ ప్రెండ్ ఉన్నాడు కాబట్టి నీకు గర్ల్ ప్రెండ్ ఉంది..
అదేం కాదు ..నిజంగానే
అయితే ఫొటో చూపించు…
ఇదీ ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ మాట్లాడుకునే ఓ సన్నివేశం… బ్రేకప్ అయ్యాక…ఇద్దరు గ్యాప్ తర్వాత కలిసి..మాట్లాడుకునే ఈ సన్నివేశం చాలా నాచురల్ గా ఉంటుంది. మన జీవితంలో నిజంగా జరిగినట్లే ఉంటుంది. ఈ కాలం కుర్రాళ్ల మనోభావాలను పసిగట్టి..పట్టి సినిమాలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు…దాన్ని “క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవికాంత్ తన రెండో చిత్రం లో దాదాపు చేయగలిగారు. అయితే మనం చేసిందంతా జనాలకు నచ్చుతుందా…ఇంతకీ ఈ సినిమా క్షణం లాంటి మరో థ్రిల్లరా..లేక పోస్టర్స్ చూపెడుతున్నట్లు రొమాంటిక్ కామెడినా…అసలు సినిమాలో మ్యాటరేంటి…ఎక్కేదేనా లేక మనమీద ఎక్కి తొక్కేదా రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

కాలేజీ రోజుల్లో సత్య(శ్రద్ధ శ్రీనాథ్) తో ప్రేమ వ్యవహారం నడిపిన కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) అతి చేసి ఆమెకు విసుగు తెప్పిస్తాడు. దాంతో నీలాంటివాడిని భరించలేనంటూ ఆమె బై చెప్పి బెంగుళూరు జాబ్ కు వెళ్లిపోతుంది. దేవదాసులా ఎక్కడ గెడ్డం పెంచాలో అని ఆలోచనలలో ఉన్న సిద్దుకి ఈ సారి రాధ(శాలిని వడ్నికట్టి) కనపడుతుంది. ఖాళీగా ఉన్న హృదయంలో టైమ్ వేస్ట్ ఎందుకని వెంటనే చోటు ఇచ్చేస్తాడు. ఆమె కూడా ఇతని బ్రేక్ అప్ లవ్ స్టోరీ విషయం తెలిసుకుని సానుభూతి చూపెడుతూ ఈ సీనియర్ లవర్ తో సెటిల్ అవ్వాలనుకుంటుంది. ఈ ప్రేమ కథ లెస్సన్స్ దాటి ప్రాక్టికల్స్ వచ్చేసిన సమయంలో మన హీరోకు బెంగుళూరులో జాబ్ వస్తుంది. ఆ మహా నగరానికి వెళ్లిన కృష్ణకు అక్కడ మళ్లీ తన పాత ప్రేయసి సత్య కనిపిస్తుంది. ఆమె మీదకు మనస్సు పోతుంది. ఆమె కూడా ఆసక్తి చూపిస్తుంది. అలా ఇటు సత్యని, అటు రాధని మ్యానేజ్ చేస్తూంటాడీ కృష్ణ. ఓ రోజు వీళ్ళద్దరికి ఈ కృష్ణలీల తెలిసిపోతుంది. వాడు నా వాడు..అని పాడకుండా ఇధ్దరూ మనవాడిని కార్నల్ చేయటం మొదలెడతారు. అప్పుడు కృష్ణ ఏం నిర్ణయం తీసుకున్నాడు. ఎవరివైపు మ్రొగ్గు చూపాడు. అతని ప్రేమ మజలి చివరకు ఎటు చేరింది అనేది నెట్ ప్లిక్స్ లో చూసి తెలుసుకోవాల్సిన విషయం.

స్టోరీ, స్క్రీన్ ప్లే లీలలు

ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇలాంటి తింగరి స్టోరీలు తెరపై చాలా సార్లు చూసాం. ముందు ఒకరిని, తర్వాత ఇంకొకరి ప్రేమించి మద్యలో నలిగిపోయే శోభన్ బాబు కథలు తెలుగు తెరని ఒకప్పుడు ఏలాయి. ఈ కార్తీక దీపం కాన్సెప్టుని ఇప్పటికీ కొనసాగించటమే చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఈ సినిమా స్క్రిప్టు మినిమం బేసిక్స్ అయిన కథలో కాంప్లిక్స్ ఉండాలనే ఆలోచన కనపడదు. సినిమా క్లైమాక్స్ లోని ఇద్దరు హీరోయిన్స్ కు అసలు నిజం తెలియదు. తమను హీరో…ఒకరికి తెలియకుండా మరకొరు మెయింటైన్ చేస్తున్నారని తెలుసుకోలేదు. తెలుసుకుని హీరోని నిలదీస్తే అప్పుడు మొదలయ్యేది అసలు కథ. ఆ నిలదీసే కార్యక్రమం ప్రీ క్లైమాక్స్ కు పెట్టుకోవటంతో సినిమాలో డ్రామా పుట్టేందుకు అవకాసం లేకుండా పోయింది. ఎంతసేపు హీరో …కన్ఫూజ్ గా ఉండి..కథను సాగతీయటమే సరిపోతుంది. అయితే ఓపినింగ్ బ్రేకప్ సీక్వెన్స్ ,సినిమాలో వచ్చే చాలా డైలాగులు దర్శకుడి ప్రతిభను పట్టిస్తాయి.

దర్శకత్వం,మిగతా విభాగాలు

ఇక ఈ సినిమా స్క్రిప్టు విషయం ప్రక్కన పెడితే దర్శకుడుగా క్షణం సినిమాకు ఈ సినిమాకు పోలికలేదు. ఇలాంటి పాతబడ్డ జానర్ తో కూడా ఎంగేజ్ చేసి, హోల్డ్ చేయటానికి ప్రయత్నించారు. అలాగే చాలా షాట్స్ బాగున్నాయి. అయితే ఎక్కువ కాన్వర్షన్స్ మీద సీన్స్ నడుస్తాయి. అర్బన్ జీవితం రిప్రెజెంట్ చేస్తూంటాయి. క్షణం లో బోలెడు ట్విస్ట్ లు ఉన్నాయి కదా ఈ సినిమాని పూర్తి విరుధ్దంగా నడపాలనుకుని మినిమం ట్వీక్ కూడా చెయ్యలేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే లీడ్ పెయిర్ చేసిన సిద్దు, శ్రద్దా శ్రీనాధ్ ఇద్దరూ పోటీపడి చేసారు. సీరత్ కపూర్ పెద్ద చేయటానికి ఏమీ లేదు. కానీ ఉన్నంతలో అందంగా పలకరించింది. అర్బన్ యూత్ ని రిప్రజెంట్ చేసింది.

ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా మూడ్‌కి త‌గ్గ‌ట్టు సింపుల్ గా బిట్ సాంగ్స్ తో సాగింది. పాట‌లు కూడా హంగామా లేదు. కెమెరా వర్క్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. డైలాగులు నాచురల్ గా ఉన్నాయి. మిగతా విభాగాలు సినిమాలో కలిసిపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఏది ప్లస్

హెవీ మెలోడ్రామా, భారీ డైలాగులు లేకుండా వెబ్ ప్రేక్షకుల అభిరుచుకి తగినట్లు డిజైన్ చేయటం

ఏది మైనస్

సినిమాలో ఎమోషన్ మిస్సవటం, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా సాదా సీదాగా ఉండటం.

చూడచ్చా

ఓసారి కాలక్షేపానికి పనికొస్తుంది. ఎక్కువ ఎక్సపెక్టే చేస్తే చాచి పెట్టి కొడుతుంది.

తెర ముందు..వెనక

నటీనటులు : ‘గుంటూరు టాకీస్’‌ ఫేం సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్దాశ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడికంటి తదితరలు.
సంగీతం : శ్రీచరణ్ పాకాల
రచన&దర్శకత్వం : రవికాంత్ పేరేపు
సినిమాటోగ్రఫీ : షానిల్ డియో-సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు
నిర్మాత : సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి