Reading Time: 4 mins

కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌ జూలై రిలీజ్‌

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’. జూన్‌ 24న సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకోనుంది. జూలై రెండోవారంలో సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా.. హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో చిత్ర సమర్పకులు, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌.రామారావు విలేకరులతో మాట్లాడారు.

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ – ”మా బేనర్‌లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. జూన్‌ 24న సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తమిళ్‌లో తీసిన ‘కణ’ సినిమా చూసి.. మంచి సినిమా, ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా రైట్స్‌ తీసుకున్నాం. ఆ సినిమాలో నటించిన ఐశ్వర్యా రాజేష్‌ మన తెలుగు అమ్మాయి. అప్పటికే తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఐశ్వర్యా రాజేష్‌ ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నటించిన రాజేష్‌ కుమార్తె. రాజేష్‌ తండ్రి అమర్‌నాథ్‌ కూడా సీనియర్‌ హీరో. అలాగే మన కమెడియన్‌ శ్రీలక్ష్మీకి మేనకోడలు. వీళ్లందరి వారసత్వ నటన ఆ అమ్మాయిలో కూడా ఉంది. క్రికెట్‌ని బేస్‌తో పాటు కంటెంట్‌ ఉండే స్టోరి. అందరి సహకారంతో సినిమాను జూలై రెండోవారంలోపు రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్‌ స్టోరి ఇది. ఒక సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఆయనకు క్రికెట్‌ అంటే ఉన్న అభిమానాన్ని అబ్జర్వ్‌ చేసి ఎలాగైనా మంచి క్రికెటర్‌ అయ్యి ఇండియాకు ఆడాలనుకునే అమ్మాయి కథ. ఐశ్వర్య ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి క్రికెట్‌ నేర్చుకుని మరీ నటించింది. ఈ చిత్రం క్రికెట్‌ అభిమానులతో పాటు యూత్‌కి, ఫ్యామిలీస్‌కి కూడా బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా దర్శకుడు భీమనేని ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో రైతుల సమస్యలకి సంబంధించిన స్టోరి కూడా ప్యార్‌లల్‌గా రన్‌ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఇన్‌స్పిరేషన్‌ కలిగిస్తుంది. ఈ చిత్రానికి ముందే ఐశ్వర్యా రాజేష్‌ మా బేనర్‌లో క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రానికి ఒక హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశాం. ఆ క్రమంలోనే ఈ సినిమా టీజర్‌ చూసి.. దీన్ని తెలుగులో డబ్బింగ్‌ చేస్తే ఆడియన్స్‌కి అంతలా కనెక్ట్‌ అవ్వదని, తెలుగు వాతావరణంలో, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండాలని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. రాజేంద్రప్రసాద్‌గారు తండ్రిగా ఒక అద్భుతమైన క్యారెక్టర్‌లో నటించారు. తండ్రీ కూతుళ్ళ ఎమోషనల్‌ కథే ఈ సినిమా. ఈ సినిమాలో తమిళ్‌ హీరో శివకార్తికేయన్‌ మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ అమ్మాయికి ఒక ఎయిమ్‌ టార్గెట్‌ చేసి ఇండియాకి సెలెక్ట్‌ అయ్యేవిధంగా చేసే కీలక పాత్రలో ఆయన నటించారు. తమిళ్‌లో తన బేనర్‌ అయిన ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌లో రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దిబు థామస్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌. సౌత్‌ ఇండియాలోనే ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ క్రియేట్‌ చేసిన దిబు థామస్‌ ఈ సినిమాకి మంచి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమాలో నాలుగు పాటలుంటాయి. రామజోగయ్య శాస్త్రి, కెకె అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. హీరోయిన్‌ మదర్‌ క్యారెక్టర్‌లో ఝాన్సీ బాగా చేసింది. అలాగే నా మిత్రుడు వైజాగ్‌ రాజు కుమారుడు కార్తీక్‌ రాజు ఒక మంచి క్యారెక్టర్‌ చేశాడు. చిన్న క్యారెక్టరే అయినా చాలా అద్భుతంగా నటించాడు. వెన్నెల కిషోర్‌ క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌, టెక్నీషియన్స్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశారు. త్వరలోనే సోని మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలవుతాయి. అలాగే ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవిగారు విడుదల చేసిన టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. జూలై 2న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్‌కి విమెన్‌ ఇండియన్‌ టీమ్‌కి కెప్టెన్‌గా చేసిన మన హైదరాబాదీ మిథాలీ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

ఇదే కార్యక్రమంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ…


తెలుగుకి అనుగుణంగా కథలో ఏమైనా మార్పులు చేశారా?

– ఆర్టిస్ట్‌లు, లొకేషన్స్‌ మాత్రమే మార్పులు చేశాం. తమిళ్‌లో తండ్రి పాత్రలో సత్యరాజ్‌ నటిస్తే, తెలుగులో ఆ క్యారెక్టర్‌ను రాజేంద్రప్రసాద్‌ చేశారు. మిగితా ఆర్టిస్ట్‌లు కూడా తెలుగువారినే తీసుకున్నాం. ఈ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. ఆ ఫీల్‌ పోకూడదని కథలో ఎలాంటి మార్పులు చేయలేదు.

చిరంజీవిగారు టీజర్‌ లాంచ్‌ చేశారు కదా?

– చిరంజీవిగారితో మా సంస్థకు ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెల్సిందే. ఆయన మా సినిమా టీజర్‌ రిలీజ్‌ చేయడం మాకు చాలా ప్లస్‌ అయ్యింది. టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా కూడా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది.


ఇంతకు ముందు కూడా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చాయి కదా? ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

– ఈమధ్యకాలంలోనే క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఏ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో అయినా కథను ఎమోషనల్‌గా మిక్స్‌ చేసి తీయగలిగితే ప్రతి సినిమా విజయం సాధిస్తుంది. మిగితా చిత్రాలకు భిన్నంగా ఇది ఒక ఇండియన్‌ క్రికెటర్‌ అవ్వాలనుకునే ఒక సాధారణ రైతు కూతురి కథ.


తెలుగులో హీరోయినే డబ్బింగ్‌ చెప్పిందా?

– ఐశ్వర్యా రాజేష్‌ మన తెలుగు అమ్మాయే. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. తన క్యారెక్టర్‌కి ఆ అమ్మాయి పర్‌ఫెక్ట్‌గా డబ్బింగ్‌ చెప్పింది.


లేడీ ఓరియెంటెడ్‌ సినిమా కదా? ఏమైనా రిస్క్‌ అన్పించిందా?

– భీమనేని మంచి పేరున్న దర్శకులు. కంటెంట్‌లో దమ్ముండి ఎనర్జీ ఉంటే భీమనేని శ్రీనివాసరావుగారికి ఉన్న టాలెంట్‌, ఆయనకి ఉన్న టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఆ సినిమాను ఎంతవరకు తీసుకెళ్ళగలదు అనేది ఈ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్‌ అవుతుంది. ఆయన కెరీర్‌లో ఇది ఒక మైలుస్టోన్‌ మూవీగా నిలుస్తుంది.


తెలుగులో కూడా కోచ్‌ క్యారెక్టర్‌కి శివ కార్తికేయనే చేశారా?

– ముందు ఈ క్యారెక్టర్‌ కోసం చాలామందిని అనుకున్నాం. కానీ.. మన హీరోలందరూ బిజీగా ఉండటం, సమయాభావం వల్ల తీసుకోలేకపోయాం. అయితే శివకార్తికేయన్‌కి కూడా తెలుగులో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయనతోనే ఆ క్యారెక్టర్‌ చేయించాం.


ఈ సినిమా రైట్స్‌ విషయంలో ఏమైనా పోటీ జరిగిందా?

– సహజంగా తమిళంలో హిట్‌ అయితే తెలుగు నిర్మాతలు వాటి రైట్స్‌ కోసం పోటీపడటం గురించి తెల్సిందే. ఆ ప్రయత్నంలో ఇంతమంచి సినిమాని ఎలాగైనా మా బేనర్‌లో తీసుకురావాలని ఖర్చుకి వెనకాడకుండా రైట్స్‌ తీసుకోవడం జరిగింది.
ఈ విషయంలో పర్టిక్యులర్‌గా శివకార్తికేయన్‌కి థాంక్స్‌ చెప్పాలి.


నిర్మాతగా 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవంలో సినిమా నిర్మాణంలో మీరు గమనించిన మార్పులు ఏమైనా ఉన్నాయా?

– ‘పాతాళ భైరవి’, ‘మాయా బజార్‌’ అప్పటి నుండి సినిమాలు స్క్రీన్‌పై చూసి ఎంజాయ్‌ చేసేవాడ్ని. అప్పుడు స్క్రీన్‌ మీద చూశాను.. ఇప్పుడు స్క్రీన్‌పైన చూస్తున్నా. అప్పుడు కంటెంట్‌ ఉన్న సినిమాలు ఎలా ఆడాయో… ఇప్పుడు కూడా అలాగే ఆడుతున్నాయి. ఇప్పుడు మోడరైజేషన్‌లో భాగంగా టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌ స్టేజ్‌కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరిగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మీలో 50 ఏళ్ల క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు కూడా ఉందా?

– 50 ఏళ్ల క్రితం నాటి నా మేకింగ్‌ స్టైల్‌ ఇప్పుడూ అలాగే ఉంది. పని సరిగ్గా జరగనప్పుడు వచ్చే కోపం కూడా అట్లాగే ఉంది. అయితే పని చేసే విషయంలో డెడికేషన్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కథ వినడం కానీ, కథ విని ఎగ్జయిట్‌ అయ్యే విషయాల్లో నేనిప్పటికీ అలాగే ఉన్నాను.


టీజర్‌లో క్రికెట్‌తో పాటు రైతులకి సంబంధించిన సమస్యలు కూడా చూపించారు?

– ఇది క్రికెటర్‌ జీవితంతో పాటు ప్యారలల్‌గా జరిగే రైతు కథ. తన తండ్రికి క్రికెట్‌ అంటే ఉన్న అభిమానం చూసి, ఎలాగైనా క్రికెటర్‌ కావాలనుకునే అమ్మాయి తను చూస్తుండగానే రైతులు ఎంత హీన, దీన స్థితిలో ఉన్నారో ప్యారలల్‌గా చూపించడం జరిగింది. అమ్మాయి క్రికెటర్‌గా అభివృద్ధి చెందటం, రైతు ఎలా అప్పులు పాలయ్యాడు అనేది కథ. దాన్ని అరుణ్‌ రాజా కామరాజు తన అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఎక్స్‌ట్రార్డినరీగా మలిచారు.


ఒక వైపు ‘రాక్షసుడు’, ‘చంటి’ లాంటి సినిమాలు తీస్తూనే.. మరోవైపు ‘మాతృదేవోభవ’, ‘పుణ్యస్త్రీ’, ‘ముత్యమంత ముద్దు’లాంటి డిఫరెంట్‌ సినిమాలు తీయడం ఎలా అన్పించింది?

– పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఎంత శాటిస్‌ఫ్యాక్షన్‌గా ఉంటానో.. ‘పుణ్యస్త్రీ’, ‘మాతృదేవోభవ’, ‘ముత్యమంత ముద్దు’ సినిమాలు తీస్తున్నప్పుడు అంతే శాటిస్‌ఫ్యాక్షన్‌గా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై నాకు ఇంకో వైపు ఉన్న ఇంట్రెస్ట్‌ను తెలియజేసే సినిమాలు. ఈ ‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటి సినిమానే.