క్లాప్ మూవీ రివ్యూ
ఆది పినిశెట్టి “క్లాప్” సినిమా రివ్యూ
బాలీవుడ్ తో పోలిస్తే తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు తక్కువే అని చెప్పాలి. అయినా తెలుగులోనూ మన హీరోలు వెండితెరపై తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించటానికి అప్పడప్పుడూ ప్రయత్నాలు చేస్తున్నారు.హిట్స్ కొడుతున్నారు. 90వ దశకంలో వచ్చిన అశ్వని చిత్రం నుంచి 2019లో విడుదలైన జెర్సీ వరకు చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. దాదాపు ఇక్కడ విడుదలైన స్పోర్ట్స్ చిత్రాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ ఉత్సాహంతో తెలుగులో మరో క్రీడా నేపథ్య చిత్రం విడుదలైంది. ఆ సినిమా కథేంటి..వర్కవుట్ అవుతుందా…రివ్యూలో ఇప్పుడు చూద్దాం.
Storyline:
విష్ణు (ఆది పినిశెట్టి) రన్నింగ్ రేస్ లో తిరుగులేని ఛాంపియన్ గా ఎదుగుతాడు. తన తండ్రి (ప్రకాశ్‌రాజ్) ప్రోత్సాహంతో నేషనల్స్ కు సెలెక్ట్ అవుతాడు. కానీ ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ లో అతని కాలు పోతుంది. మరో ప్రక్క తండ్రి చనిపోతాడు. విష్ణుకు మరో క్రీడాకారిణి మిత్ర (ఆకాంక్ష సింగ్) పెళ్లి చేసుకున్నా సంసార జీవితం సరిగ్గా సాగదు. కాలు లేదనే మానసిక వ్యథతోనే విష్ణు జీవితం గడుపుతూంటాడు. అలాంటి టైమ్ లో ఓ సంఘటన అతని జీవితానికి ఆశాదీపంలా ఎదురౌతుంది. ఖమ్మంలో భాగ్యలక్ష్మీ (కృష్ణ కురూప్) అనే ఓ మంచి అథ్లెట్ ఉందని, తండ్రి చనిపోవటంతో పరుగును మధ్యలో ఆపేసిందని తెలుస్తుంది. భాగ్యలక్ష్ణ్మిలో తనను చూసుకున్న విష్ణు…ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి మంచి కోచింగ్ ఇప్పించి, నేషనల్ ఛాంపియన్ చేయాలని ప్రయత్నం మొదలెడతాడు.అయితే అందుకు రకరకాల అడ్డంకులు…సమస్యలు వాటిన్నటినీ దాటి ఆమెను నేషనల్ అధ్లెట్ గా ఎలా నిలిపాడన్నదే మిగతా కథ.
Screenplay Analysis:
స్పోర్ట్స్ నేపథ్యంలోనే కథలు రాసుకుంటే.. ఆ సినిమాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుందనే విషయం మన మేకర్స్ కు తెలుసు. అయితే ధైర్యం చేయరు. స్పోర్ట్స్ సినిమాలు హిట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే పకడ్భందీగా ఉండాలి. అలాగే ఓ కండీషన్. ఆ సినిమాలోని భావోద్వేగాలు, ఉత్కంఠ, డ్రామా అందర్నీ కట్టిపడేసే స్దాయిలో ఉండాలి. అన్ని ఎమోషన్స్ ఫెరఫెక్ట్ గా సింక్ లో ఉంటేనే ఆడియెన్స్ సులభంగా కనెక్ట్ అవుతారు. అప్పుడే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాటి సై నుంచి నిన్నమొన్నటి జెర్సీ వరకు తెలుగులో అలాంటి అద్భుతాలు జరగటానికి వెనక ఫెరఫెక్ట్ గా అల్లుకున్న కథ,కథనం కలిసొచ్చాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సినిమా ప్రారంభంలోనే ఆదికి యాక్సిడెంట్ అ్యయినట్లు చూపించారు. తర్వాత సీన్ లో ఒంటి కాలుతో ఉన్న ఆది షాక్ ఇస్తాడు. అయితే అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. భార్యతో ముభావంగా ఉండే ఆది, ఓ అమ్మాయిని పిక్ చేసి, అధ్లెట్ గా ఎలా మార్చాడనేది కథనం. స్టోరీలైన్ గా వింటానికి బాగున్నా..స్క్రీన్ ప్లేలో బోర్ కొట్టించేసారు. అలాగే ఇదో డాక్యుమెంటరిగా అనిపిస్తుంది తప్ప సినిమాగా అనిపించదు.ముఖ్యంగా హీరో పోరాటం మొత్తం ఓ వ్యక్తి మీద, ఓ అసోసియేషన్ మీద అన్నట్టుగా మారిపోయింది. అంతేకానీ సినిమాలో కోర్ పాయింట్ అయిన పట్టుదల ఉంటే అట్టడుగు వర్గానికి చెందిన మహిళ అయినా క్రీడా మైదానంలో విజయ పతాకాన్ని ఎగరేస్తుంది అనే విషయం హైలెట్ చేయలేకపోయారు. అదే కనుక చేసి ఉంటే సినిమా ఓ స్దాయిలో ఉండేది. దానికి తోడు చాలా వరకు ఈ సినిమా చాలా డల్ గా సాగదీతగా ఉంటుంది. ఎక్కడా రైజ్ అయ్యే ఎమోషన్స్ ఉండవు.ఎంతసేపు చూసినా ఏమి జరిగినట్లు అనిపించదు. దాంతో ఆడియెన్స్ కి అంత ఆసక్తి పెద్దగా కలగదు.అలాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అంటే ఎలా చూసుకున్నా మంచి ఇన్ స్పైర్ చేసే సన్నివేశాలు సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ఉంటాయి. కానీ అవేవి ఈ సినిమాలో కనపడవు. ఫ్లాట్ గా స్క్రీన్ ప్లే రాసుకోవటమే సినిమాకు డ్రాబ్యాక్ గా అనిపిస్తుంది. కథలో డ్రామా పుట్టే అవకాశం ఉన్నా పట్టించులేదు. సాలిడ్ ఎమోషన్స్ కూడా లేవు.
Analysis of its technical content:
టెక్నికల్ గా చూస్తే ఈ సినిమాలో ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ నాచురల్ గా సాగింది. అలాగే ఇళయరాజా సంగీతం చాలా సీన్స్ లో ఎఫెక్టివ్ గా ఉంది. ‘చిన్న మాట పైకి రాదా ఎవరికోసం వారేనా…’ పాట అర్థవంతంగా ఉంది. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా చెయ్యాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆ చిన్న సినిమాకు సరిపడేలా బాగున్నాయి.దర్శకత్వం విషయానికి వస్తే….డైరక్టర్ పృద్వి ఆదిత్య ..ఎంచుకున్న స్పోర్ట్స్ నేపధ్యం రన్నింగ్ బాగుంది కానీ జనాలని మెప్పించే స్థాయిలో తీయలేకపోయారు. సినిమాని మరింత ఇంట్రస్ట్ గా మలచడానికి ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు. కథలో అందుకు చాలా స్కోప్ ఉన్నా వదిలేసాడు. డైలాగులు బాగున్నాయి.
నటీనటుల్లో ఆది పినిశెట్టి తనేంటో మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు. హాఫ్ లెగ్ తో ఆది కనిపించే సీన్స్ చాలా సహజం గా ఉన్నాయి. అలానే ప్రతి సీన్ నూ ఆ పాత్ర తాలూకు పెయిన్ ను స్పష్టంగా ఆది ప్రెజెంట్ చేయటంలో సక్సెస్ అ్యయాడు. మిత్రగా ఆకాంక్ష సింగ్ ఓకే. మరో కీలక పాత్ర పోషించిన కృష్ణ కురుప్ కళ్ళతోనే నటించింది. విలన్ గా నాజర్, సహాయపాత్రల్లో బ్రహ్మాజీ, హీరో తండ్రి గా ప్రకాశ్ రాజ్ తో పాటు ఇతర ప్రధాన పాత్రలను ‘ముండాసుపట్టి’ రాందాసు, మైమ్ గోపీ పోషించారు.
CONCLUSION:
చూడచ్చా?
క్రీడా నేపథ్య చిత్రాలను, మోటివేషనల్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘క్లాప్’ నచ్చుతుంది.
Movie Cast & Crew
బ్యానర్స్: శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్
తారాగణం: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష్ణ కురుప్, నాజర్, ప్రకాష్ రాజ్, రాందాస్, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం: మేస్ట్రో ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
ఎడిటింగ్: రాగుల్
ఆర్ట్: వైరబాలన్, ఎస్. హరిబాబు
ఫైట్స్: ఆర్. శక్తి శరవణన్
కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్
సమర్పణ: బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐ.బి. కార్తికేయన్
పీఆర్వో: వంశీ –శేఖర్
దర్శకత్వం: పృథివి ఆదిత్య
నిర్మాతలు: రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి
విడుదల తేదీ: మార్చి 11, 2022
Run Time: 2 hours 09 minutes
ఓటిటి: సోనీ లివ్