గాలి సంపత్ మూవీ రివ్యూ
ఫ..ఫ..ఫఫ్ఫ..పాతదే: ‘గాలి సంపత్’ మూవీ రివ్యూ
Rating: 2.5/5
రాజేంద్రప్రసాద్, అనీల్ రావిపూడి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా కామెడీ ప్రియులను థియోటర్స్ కు రప్పించేదే. అయితే అబ్బే మీరు ఎక్సపెక్ట్ చేసే కామెడీ ఈ సినిమాలో లేదు అని అనీల్ రావిపూడి ఎందుకైనా మంచిదని రివీల్ చేసేసాడు. అయితే మరి ఏముంది ఈ సినిమాలో అంటే ఎమోషన్ ఉంది..హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి..ఓ గొప్ప కథ ఉంది..అంటూ ఊరించారు. సరే చూద్దా అని వెళ్లిన వారికి ఏ అనుభూతి దక్కింది. నవ్వుకున్నాడా..ఎమోషన్ అయ్యాడా..ఈ సినిమాకు ఎందుకువచ్చామా అని ఏడ్చారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం పదండి.
స్టోరీలైన్
గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్)కు గాత్రం కరువు. యాక్సిడెంట్ లో వాయిస్ ని, తన వైఫ్ ని పోగొట్టుకున్న సంపత్ నటనపై ఉన్న ఆసక్తిని మాత్రం చంపుకోలేకపోతాడు. ‘ఫీ ఫీ ఫీ’ అంటూ స్టేజి ఎక్కి నటిస్తూంటాడు. అది వయస్సు వచ్చిన కొడుకు సూరి (శ్రీవిష్ణు)కు విసుగ్గా ఉంటుంది. దానికి తోడు అతి ప్రేమతో ఆ తండ్రి చేసే పనులు కొడుక్కి ఇబ్బందిగా మారుతూంటాయి. డ్రైవర్ అయిన కొడుకుకి ఒకే ఒక జీవితాశయం అది..తను ఎప్పటికైనా సొంతంగా డీసిఎం వ్యాన్ కొనుక్కోవాలని. అందుకోసం డబ్బులు కూడ పెడుతూంటాడు. అలాగే సూరి..ఆ ఊరి సర్పంచ్ కూతురు(లవ్లీసింగ్) తో లవ్ స్టోరీ. ఇలా తండ్రి,కొడుకులిద్దరూ ఎవరు లైఫ్ ని వాళ్లు లీడ్ చేస్తూంటే ఓ అనుకోని అవాంతరం వచ్చి పడుతుంది. నాటకాల పరిషత్తు వాళ్లు పోటీ ప్రకటన ఇస్తారు. నాటకాల పోటీలో గెలిస్తే ప్రైజ్ ఎనిమిది లక్షలు. అది విన్న గాలి సంపత్..ఉత్సాహపడతాడు.
ఆ డబ్బుని గెలిచి తన కొడుకుకి వ్యాన్ కొనుక్కోవటానికి అప్పుగా ఇద్దామని అనుకుంటాడు. అయితే ఆ నాటకాల కాంట్రాక్టర్ ఓ కండిషన్ పెడతాడు. ఐదు లక్షలు అడ్వాన్స్ ఇస్తే ..స్టాట్ ఇస్తానని అంటాడు. వేరే దారి కనిపించక…తన కొడుకు దాచుకున్న డబ్బు ఐదు లక్షలు తీసేస్తాడు. అయితే ఆ కాంట్రాక్టర్ మోసం చేస్తాడు. మరో ప్రక్క తనకు తెలియకుండానే తన కొడుకు పెళ్లిని చెడ కొట్టేస్తాడు. ఈ రెంటితో కొడుకు మనస్సు విరిగిపోతుంది. తండ్రిని నానా మాటలు అంటాడు. తండ్రి మొహం ఇక కొడుకు చూడనని అంటాడు. ఆ క్రమంలో గాలి సంపత్ పెద్ద నూతిలో చూసుకోకుండా పడతాడు. అసలే మాటలు రాని మనిషి. ఓ ప్రక్క కొడుకుతో గొడవ పెట్టుకున్నాడు… అతని పరిస్దితి ఏమిటి..చివరకు ఏమైంది..కొడుకు ..తండ్రిని అర్దం చేసుకున్నాడా..కొడుకు లవ్ స్టోరీ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్
తండ్రి గొప్పదనం ఏమిటి? ఎంతటి త్యాగం చేస్తాడు? తండ్రి పిల్లలకోసం ఎలాంటి కష్టాలు పడతాడు? తండ్రి పిల్లలపై ఎంతటి ప్రేమను చూపుతాడు? అనే విషయాలు ప్రతి కూతురు/కొడుకు తెలుసుకోవాల్సినవే..కానీ పాత ఫార్మెట్ లోనే చెప్తే ఎంతమంది ఆసక్తి చూపిస్తారు…పాత విషయాన్ని అయినా కొత్తగా చెప్పమని మన సినిమా పెద్దలే పదే పదే చెప్తూంటారు. అలాంటిది ఈ పాత విషయాన్ని పనిగట్టుకుని పాతగా చెప్పినట్లు ఉంది. అయితే దర్శకుడు,నిర్మాత అలాగే మరో దర్శకుడు అనీల్ రావిపూడి ఈ విషయాలను పట్టించుకున్నట్లు లేరు. ఎంతసేపూ తమ సినిమాలో రాజేంద్రప్రసాద్ కొత్తగా గాలి సంపత్ లా కనిపిస్తాడు.అలాంటి పాత్ర ఎప్పుడూ తెలుగు తెరపై ఎవరూ చేయలేదు.అని మురిసిపోతూ ఆ పాత్రను చెక్కటంలోనే టైమ్ అంతా సరిపెట్టారు.
అలాగే నూతిలో పడిపోయిన ఓ మూగ వ్యక్తి ఎలా బయిటకు వస్తాడు అనే విషయం పైనా కాన్సర్టేట్ చేసారు. అంతే తప్ప…అసలు ఈ సినిమాలో తండ్రి,కొడుకు మధ్య వచ్చే కాంప్లిక్ట్స్ ఓ ప్రక్క, నూతిలోంచి బయిటకు రావటం అనే రెండు వేర్వేరు..స్టోరీలు ఉన్నాయి..వాటిని కలిపే స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోవాలి అనుకోలేదు. అలాగే తండ్రి,కొడుకు మధ్య వచ్చే సీన్స్ సైతం మరీ ఎనభైల్లో పాత్రల్లా నడుస్తున్నాయని అర్దం చేసుకోలేదు. విలేజ్ ఎట్మాస్మియర్ దాకా ఓకేనే కానీ ప్రపంచం మరింత ముందుకు వెళ్లిపోయిందనే విషయం గుర్తు పెట్టుకోలేదు.నాటకాలు పరిషత్తులు ఉన్నా, ఇప్పుడు అంతా యూట్యూబ్ ప్రపంచం. అవేమీ ఈ సినిమా చేసేటప్పుడు ఎవరికీ గుర్తు లేదు. టైమ్ మిషన్ ఎక్కి పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయారు.
టెక్నికల్ గా…
అనుభవం ఉన్న అనీల్ రావిపూడి దగ్గరుండి మంచి టెక్నీషియన్స్ తో అద్బుతమైన అవుట్ పుట్ తీసుకున్నాడు అనటంలో సందేహం లేదు. డైరక్టర్ ఎమోషన్స్ సీన్స్ ని బాగానే పండించారు. అయితే ఎమోషన్ సీన్స్ లో డెప్త్ లేదు. మరీ మెలోడ్రామా ఎక్కువైందని అంటారని భయోపడ్డారో ఏమో కానీ ..డెప్త్ లేదు. దాంతో ఆ సీన్స్ తేలిపోయాయి. ఇంక తండ్రి కొడుకుల సీన్స్ ఎక్కువ లాగారనిపించింది. ఆ మేరకు స్క్రీన్ ప్లే ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. అయితే మిర్చి కిరణ్ రాసిన డైలాగులు మాత్రం బాగున్నాయి. అలాగే ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది..నేపధ్య సంగీతం. గాలి సంపత్ గోతిలో పడ్డ తరువాత రాజేంద్ర ప్రసాద్ ఎక్సప్రెషన్స్ కు తన మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి. అయితే పాటలు మాత్రం సోసోగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ గా చేయచ్చు అనిపించింది. బాగా స్లో గా అనిపించింది.
నటీనటుల్లో రాజేంద్రప్రదాస్ వందకు వంద శాతం మార్కులు వేయించుకున్నారు. శ్రీవిష్ణు..అంతకు ముందు చేసిన నీది నాది ఒకటే కథ టోన్ నే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సాయి శ్రీరామ్ కెమెరా కెమెరా వర్క్ బాగుంది. అరకు అందాలు అద్బుతంగా చూపెట్టారు.
చూడచ్చా…
ఈ మధ్యకాలంలో ఎమోషన్ సినిమాలు రావటం లేదనుకునుకుంటూ ఎమోషన్ అయ్యేవాళ్లకు బాగా నచ్చుతుంది.
ఎవరెవరు…
బ్యానర్: ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్;
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు తదితరులు
సంగీతం: అచ్చు;
సినిమాటోగ్రఫీ; సాయి శ్రీరామ్,
ఎడిటింగ్; బి.తమ్మిరాజు,
నిర్మాత: ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు, గారపాటి;
స్క్రీన్ప్లే, దర్శకత్వం పర్యవేక్షణ: అనిల్ రావిపూడి;
కథ, దర్శకత్వం: అనీశ్ కృష్ణ;
రన్ టైమ్: 1 గంట 58 నిమిషాలు
విడుదల: 11-03-2021