Reading Time: 2 mins

గుణ 369 మూవీ రివ్యూ

కథా గుణం తక్కువ (‘గుణ 369’ మూవీ రివ్యూ)
Rating‌: 2 /5

‘ఆర్‌ఎక్స్‌100’…ఈ ఒక హిట్ సినిమా కార్తికేయను ఒక్కసారిగా తెలుగులో షో మ్యాన్ గా మార్చేసింది. ఆ ఆనందంలో తేరుకోకుండానే ఇమ్మీడియట్ గా వచ్చిన  ‘హిప్పీ’ సినిమా అంతే వేగంగా వెనక్కి లాగేసింది. ఇప్పుడు మూడో సినిమా. తేడా కొడితే తేరుకోవటం కష్టం. ఈ విషయం కార్తికేయకు తెలయకండా ఉండదు. ఇలాంటి పరిస్దితిల్లో తెరకెక్కిన  ‘గుణ 369’ రిజల్ట్ ఏంటి…అతన్ని నిలబెట్టిందా…ఖచ్చితంగా హిట్ కావాల్సిన సమయంలో చేసిన ఈ సినిమాకు ఎలాంటి కథ ఎంచుకున్నాడు, దర్శకత్వం వహించిన బోయపాటి శిష్యుడు తన గురువు పేరు నిలబెట్టాడా …వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే  గుణ(కార్తికేయ)  ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పని చేస్తూంటాడు.  పెద్దగా గొడవలంటే ఇష్టపడని అతనిదో చిన్న ప్రపంచం.  అమ్మానాన్న(నరేష్-హేమ), చెల్లి(కౌముది), ఓ స్నేహితుడు భట్టు(రంగస్థలం మహేష్). అలాగే అతని లైఫ్ లోకి వచ్చిన ప్రేయసి  గీత(అనఘా). వీళ్లతో తనదైన శైలిలో హ్యాపీగా గడిపేస్తున్న అతనికి  ఓ స్నేహితుడు వల్ల సెటిల్మెంట్ కోసం  గద్దలగుట్ట రాధా(ఆదిత్య మీనన్) అనే రౌడీ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది.  అయితే మధ్యవర్తిగా వెళ్లిన గుణ అనుకోకుండా అక్కడే ఓ పెద్ద  ప్రమాదంలో పడతాడు.

దానివల్ల జైలుకు వెల్లాల్సి వస్తుంది.  దాంతో అతని జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోతుంది.  ఫ్యామిలీకు  ఇబ్బందులు ఎదురౌతాయి. తను ఇష్టపడ్డ అమ్మాయి దూరం అవుతుంది.  మంచి చేయబోయి మునిగిపోయిన అతను జైలు నుంచి బయిటకు వచ్చాక, అసలు తనను ఇలాంటి క్రైమ్ లో ఎవరు ఇరికించారు అనే అన్వేషణ మొదలెడతాడు. ఆ క్రమంలో  ఏం జరిగింది…అసలు అతన్ని  కావాలని ఇరికించారా..అతని గర్ల్ ఫ్రెండ్ కు ఏమైంది..తిరిగి తన జీవితాన్ని యధాస్దితికి తీసుకురాగలిగాడా లేదా అనేదే మిగిలిన కథ.

ట్విస్ట్ కే ట్విస్ట్

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమా ఆడటానికి కారణం …అందులో మెయిన్ ట్విస్ట్ ..షాకింగ్ గా ఉండటమే. ఇదే బుర్రలో పెట్టుకుని ఈ కథ చేసినట్లున్నారు..హీరో ఓకే చేసినట్లున్నారు. అయితే అన్ని ట్విస్ట్ లు షాకింగ్ గా ఉండవు. సినిమాని నిలబెట్టవు. స్క్రిప్టులో షాకింగ్ గా అనిపించింది…తెరపై తేలిపోవచ్చు ..లేదా విసుగు తెప్పించవచ్చు. అదే ఈ సినిమాకు జరిగింది. ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమా లవ్ స్టోరీ..కాబట్టి ఆ ట్విస్ట్ అద్బుతం. అదే గుణ చిత్రం యాక్షన్ సినిమా. ఇక్కడ విలన్, హీరో అంటూ ఇద్దరు కనపడతారు. ట్విస్ట్ …హైలెట్ అయితే సినిమా బోల్తా పడుతుంది.

డైరక్టరే విలన్…
సాధారణంగా మన దర్శకుల్లో చాలా మంది ఫారిన్ డీవీడి కథపై ఆధారపడి సినిమాలు చేస్తూంటారు. కానీ ఈ సినిమాతో పరిచయమైన అర్జున్ జంధ్యాల కొద్దిగా డిఫరెంట్…ఆల్రెడీ తెలుగులో వచ్చిన నా పేరు శివ, గులాబి సినిమాల నుంచి స్టోరీ లైన్ తీసుకుని ఆర్డరేసుకున్నాడు. ఈ రెండు సినిమాల నుంచి మెయిన్ ట్విస్ట్ లు తీసుకున్న దర్శకుడు మిగతా కథను మాత్రం వదిలేసాడు. ఏమీ లేకుండా కేవలం కాలక్షేపం సీన్స్ తో నడిపే ప్రయత్నం చేసాడు. అదే బెడిసికొట్టింది. పరమ రొటీన్ లవ్ ట్రాక్ విసిగిస్తే. క్లైమాక్స్ ట్విస్ట్ ..కిక్ ఇవ్వకపోగా  కక్కు తెప్పిస్తుంది. కమిడియన్  ని విలన్ గా చూపాలనే తాపత్రయం బెడిసికొడుతుంది.

మరో విషయం…గుణ అంటూ పెద్ద యాక్షన్ స్టోరీ మొదలెట్టి సినిమా సగానికే విలన్ ని లేపేస్తే…ఇంక ఎంగేజ్ చేయటానికి ఏముంటుంది. అదే ట్విస్ట్ అనుకుని మురిసిపోమంటే ఎలా.  యాంటగనిస్ట్‌  లేకుండా సెకండాఫ్ మొత్తం బోర్ వచ్చేసింది. ఎక్కడో   క్లైమాక్స్ లో వచ్చే  ట్విస్ట్  పేలాలనుకుని..విలువలైన స్క్రీన్ టైమ్ ని వృధా చేసేసారు. అలాగని సినిమా ఏమన్నా మేకింగ్ పరంగా అద్బుతంగా ఉంటుందా అదీ ఉండదు. కథకు తగ్గట్లే డైరక్షన్ సైతం ప్యాసివ్ గా ఉంటుంది. దాంతో తెరపై విలన్ లేడు కానీ ఈ సినిమా కు డైరక్టరే విలన్ అనిపిస్తుంది.

కలిసిరాని టెక్నికల్ వ్యూహం

కథే నీరసంగా ఉన్నప్పుడు మిగతా హంగులు ఎన్ని ఉన్నా వృధానే. అలాగే ఈ సినిమాకు టెక్నికల్ హంగామా ఏమీ కలిసి రాలేదు. డైరక్టర్ గా  తను అనుకున్నది తెరకెక్కించగలిగాడు కానీ కొత్తదనం చూపలేకపోయాడు.  తన గురువు బోయపాటి శ్రీను లాగానే సినిమాను పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని ప్రయత్నం చేసాడు. అ క్రమంలో మిగతావన్నీ వదిలేసాడు. ముఖ్యంగా యూత్ కు పట్టే  లవ్‌ ట్రాక్‌ పూర్తి డల్ గా ఉంది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన పాటల్లో బుజ్జి బుజ్జి బంగారం.. సాంగ్‌ మినహా ఇతర పాటలు  బాగా  లేవు.   బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగ్స్ ఏవీ వినసొంపుగా లేవు.  రామ్‌రెడ్డి కెమెరా పనితనం,తమ్మిరాజు ఎడిటింగ్‌ సినిమాకు తగినట్లు ఉన్నాయి.   ఫస్ట్ హాఫ్‌  లో  లవర్‌ బాయ్‌ గా  సెకండ్‌ హాఫ్‌లో  యాక్షన్  హీరోగా కార్తికేయ డిఫెరెన్స్ చూపించి ఆకట్టుకున్నాడు.

చూడచ్చా
మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చూసే  ఆసక్తి  ఉంటే  …

ఆఖరి మాట

అన్ని కథలు ‘ఆర్‌ఎక్స్‌100’ కావు

తెర వెనక, ముందు

సమర్పణ: శ్రీమతి ప్రవీణ్‌ కడియాల
నిర్మాణ సంస్థ: జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.జి.మూవీ మేకర్స్‌
నటీనటులు: కార్తికేయ, అనఘ, మహేశ్‌, నరేశ్‌, హేమ, కౌముది, ఆదిత్యమీనన్‌, శివాజీ తదితరులు
కెమెరా: రామ్‌రెడ్డి
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
ఆర్ట్‌: జి.ఎం.శేఖర్‌
ఎడిటర్‌: తమ్మిరాజు
నిర్మాతలు: అనీల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి