జెట్టి సినిమా లిరికల్ సాంగ్ విడుదల
గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా “జెట్టి” సినిమాలోని ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ లిరికల్ సాంగ్ విడుదల
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన “జెట్టి” సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం.
తాజాగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా “జెట్టి” సినిమా నుంచి ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ..’ అనే పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. *చంద్రబోస్ రాసిన ఈ పాట ఎలా ఉందో చూస్తే…..గంగమ్మ గంగమ్మ మాయమ్మ…మమ్ము సల్లంగ సూడాలమ్మా.. సుడి గుండాలు, గండాలు రాకుండా సెయ్యమ్మా…ఆటుపోటుల్లోనే ఆటుపోటుల్లోనే ఆట పాటలంట హైలెస్స…అలల కౌగిట్లోనే అలల కౌగిట్లోనే అలుపు తీరెనంట హైలెస్స…ఉప్పొంగి పోయేటి ఉప్పెనలో మేము ఊయలూగేమంట హైలెస్సో, ఉబికి వచ్చె మా సెమటనీటి తోటి ఉప్పు నీరు ఇంకా ఇంకా ఉప్పయిందట…గంగమ్మ గంగమ్మ మాయమ్మ…మమ్ము సల్లంగ సూడాలమ్మా*..అని సాగుతుంది. ఈ పాటను కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ లో అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని, గంగమ్మ తల్లి ఆదరణకు సజీవ శిల్పమీ పాట.
ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ*…ఇటీవల పుష్ప సినిమాలో అడవి మీద పాట రాశాను. ఇప్పుడు “జెట్టి” మూవీలో సముద్రం గురించి, గంగపుత్రుల జీవితం గురించి ‘గంగమ్మ గంగమ్మ మాయమ్మ…’ అనే పాట రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడికి కృతజ్ఞతలు. చాలా చక్కటి పాట ఇది. సముద్ర ఘోష ఈ పాటలో వినిపించేలా కంపోజిషన్ చేశారు సంగీత దర్శకుడు కార్తీక్. గీత రచయితగా ఈ పాట రాయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అనురాగ్ కులకర్ణి అంతే చక్కగా పాడాడు. త్వరలో విడుదల కానున్న “జెట్టి” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని “జెట్టి” సినిమాను తెరకెక్కించారు. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక.
నటీ నటులు : నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ షెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు : బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్, మ్యూజిక్ : కార్తిక్ కొండకండ్ల, డిఓపి: వీరమణి, ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి, ఎడిటర్: శ్రీనివాస్ తోట, స్టంట్స్: దేవరాజ్ నునె, కోరియోగ్రాఫర్ : అనీష్, డైలాగ్స్ ః శశిధర్, నిర్మాత ః వేణు మాధవ్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ః సుబ్రహ్మణ్యం పిచ్చుక.