‘జెర్సీ’ సినిమా రివ్యూ
తండ్రి-కొడుకు- క్రికెట్ (నాని ‘జెర్సీ’రివ్యూ)
రేటింగ్ : 3/5
అర్జున్ (నాని) మంచి క్రికెటర్. ఫైర్ ఉన్నవాడు. కానీ సారా (శ్రద్దా శ్రీనాధ్) తో ప్రేమ, పెళ్లి తన జీవితాన్ని మార్చేస్తుంది. జాతీయ స్దాయిలో ఆడే అవకాశం రాక క్రికెట్ ని వదిలేస్తాడు. దాంతో పాటే స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్ కూడా. దాంతో అద్బుతమైన క్రికెటర్ కాస్తా సంపాదన గట్రా లేని అతి సాధారణ భర్త గా మారిపోతాడు. భార్య సంపాదనతో జీవితం లాగుతున్న అతనికి కొడుకు నాని అంటే ప్రాణం. ఆ కొడుకు పుట్టిన రోజుకు ఓ ఐదు వందల రూపాయల విలువ చేసే జెర్సిని గిప్ట్ గా కూడా ఇవ్వలేకపోతాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా వర్కవుట్ అవ్వవు. తన ఆర్దిక పరిస్దితిపైనా, తన పైనే తనకే విరక్తి వస్తుంది. ఈ టైమ్ లో ఓ ఛారిటీ సంస్ద కోసం క్రికట్ గేమ్ ఆడే అవకాశం వస్తుంది.దాని ద్వారా వచ్చే డబ్బుతో కొడుకు కోరిక తీరుద్దామని కసిగా ఆడతాడు.అయినా ఫలితం ఉండదు. కానీ ఆ గేమ్ అయ్యాక అతనికి ఇన్స్పిరేషన్ వస్తుంది. తనలో ఇన్నాళ్లుగా నిద్రపోయిన క్రీడాకారుడు మేల్కొంటాడు. తను మళ్లీ ఎందుకు క్రికెటర్ కాకూడదని ప్రశ్నిస్తాడు. అప్పుడు మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి, మనదేశం తరుపున ఆడాలనుకుంటాడు. అందుకోసం అర్జున్ ఏం చేసాడు ? అతని లక్ష్యం నెరవేరిందా ? ఫైనల్ గా ఏమైంది ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది…
కేవలం రూ.500 పెట్టి జెర్సీ కొనిపెట్టడానికి ఓ తండ్రి పడే ఆవేదన, ప్రయత్నం ఫస్టాఫ్ లో కనిపించి కథను మలుపు తిప్పుతాయి. ఈ Dramatic Conflict చుట్టూ కథను అల్లటంలోనే రైటింగ్ బ్యూటీ కనపడుతుంది. ఓ ఇరాన్ సినిమా చూస్తున్నట్లుగా న్యాచురల్ గా కనిపిస్తుంది. అక్కడతో ఆగకుండా ఆ సంఘటన నుంచి హీరో ప్రేరణ పొందటం ముందుకు వెళ్లి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవటం సినిమాకు ప్లస్ అయ్యాయి. క్లాసిక్ సినీ స్క్రీన్ ప్లేలో ఈ విధానం మనకు కనిపిస్తుంది.
ఒక ఓడిపోయిన వ్యక్తి తిరిగి ప్రయత్నించి గెలిస్తే వింటానికి ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. అదే ఈ సినిమాలో పే ఆఫ్ అయిన అంశం. అలాగే ఈ సినిమా కేవలం క్రీడా నేపధ్యమే తీసుకుని దాని చుట్టూనే కథ నడిపితే రొటీన్ గా అనిపించేది. అలా కాకుండా ఈ కథకు తండ్రీ కొడుకుల సెంటిమెంట్ బాగా ప్లస్ అయ్యింది. అయితే క్లైమాక్స్ కొందరికి హీరో పాత్రపై సానుభూతి పుట్టిస్తే మరికొందరికి కృత్రిమంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎలా తీసుకుంటారనేదానిపై సినిమా సక్సెస్ స్దాయి అధారపడి ఉంటుంది.
ఎవరికి ప్లస్…
నాని కెరీర్ గత కొంతకాలగా స్లో అయ్యింది. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ ఏదీ సరైన స్టాంప్ వేయటం లేదు. నాని బాగా చేసాడంటారు సినిమా గొప్పగా ఆడదు. అయితే ఓ విషయం మాత్రం అర్దమవుతుంది. నాని స్టామినాకి తగ్గ కథ పటడంలేదని. పడితే తన నటనతో నువ్వా నేనా అనే స్దాయికి వెళ్లిపోతాడని. ఇదిగో ఇన్నాళ్లకు అతనికి ‘జెర్సీ’ రూపంలో అలాంటి కథ పడింది. నాని అంటే కేవలం కామెడీనే కాదు…ఎమోషన్స్ సైతం అద్బుతంగా పండిస్తాడని ప్రూవ్ చేసింది.
ఇక ‘మళ్లీ రావా’ అనే ఫీల్ గుడ్ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ని చాలా నీట్ గా డీల్ చేసారు. సుమంత్ ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు అతనికి మళ్ళీరావా కాస్త బజ్ క్రియేట్ చేసింది. అయితే ఆ బజ్ కు కారణం దర్శకుడే అని నాని గ్రహించి ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ని గోల్డెన్ ఆపర్చునేటిగా మార్చుకుని మంచి విషయమున్న డైరక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు గౌతమ్. కాబట్టి నాని కన్నా ఈ సినిమా గౌతమ్ కే బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి.
టెక్నికల్ గా…
ఈ సినిమా పూర్తి గా డైరక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్. అలాగే రైటింగ్ కు సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. సీన్స్ వాటితో పాటు వచ్చే డైలాగ్స్ కూడా ఫెరపెక్ట్ గా సింక్ అయ్యాయి. ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ సీన్ హైలెట్స్ లో ఒకటిగా చెప్పాలి. అలాగే క్రికెట్ సీన్స్ ను చాలా సహజంగా చూపించటంతో ఎవరిదో నిజ జీవిత బయోపిక్ చూస్తున్న ఫీల్ వచ్చింది. సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్, ఆర్ట్ డిపార్టమెంట్ ఈ సినిమాను ఎనభైల్లోకి తీసుకెళ్లటంలో బాగా సహకరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అనిరుద్ ఇచ్చిన పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్ గా ఉంది. స్లో నేరషన్ తప్పిస్తే వంక పెట్టడానికి ఏమీలేదు.
చూడచ్చా…
ఫ్యామిలీతో ఓ వీకెండ్ స్పెండ్ చేయచ్చు. చూశాకా…ఏమో మీ జీవితంలోనూ వదిలేసిన లక్ష్యం ఏదన్నా ఉంటే తిరిగి దాన్ని ప్రెష్ గా మొదలెట్టచ్చు. విజయం సాధించవచ్చు.
తెర వెనక..ముందు…
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
కూర్పు: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: 19-04-2019